ఆంధ్రప్రదేశ్ విభజన సెగ మరోసారి హస్తినను తాకుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యాంధ్ర నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా హస్తిన బాట పట్టారు.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ విభజన సెగ మరోసారి హస్తినను తాకుతున్నాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్యాంధ్ర నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకోగా, మరోవైపు టీఆర్ఎస్ నేతలు కూడా హస్తిన బాట పట్టారు. ఆ పార్టీ నేతలు హరీష్ రావు, గంగుల కమలాకర్, విద్యాసాగర్ రావు ఈరోజు ఉదయం ఢిల్లీ బయల్దేరారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమపైనే దాడులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వాటిని సీడీల రూపంలో కేంద్రానికి, ప్రతిపక్షాలకు వివరిస్తామని హరీష్ రావు తెలిపారు. కాగా తమ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీలో ఉన్నందుకే తాము కూడా ఢిల్లీ వెళుతున్నామని ఆయన చెప్పారు.
ఇక కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నందున రాజకీయ సమీకరణాల్లో పలు పరిణామాలు చోటు చేసుకోనున్నాయనే అంచనాతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీ వెళుతున్నారు. తెలంగాణ ప్రకటన చేసిన నేపథ్యంలో కాంగ్రెస్లో టీఆర్ఎస్ విలీనం కాక తప్పదంటూ మరోవైపు ప్రచారం జరుగుతోంది. ఇక పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, నల్లాల ఓదేలు కూడా ఢిల్లీకి క్యూ కట్టనున్నట్లు సమాచారం.