సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్రశాఖ సీమాంధ్ర నేతల సమావేశం పార్టీ నేతల మధ్య రుసరుసలు, నిరసనల మధ్య సాగింది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా తెలంగాణ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని పలువురు నేతలు విమర్శించటంతో కిషన్‌రెడ్డి సమావేశం మధ్యలోనే నిష్ర్కమించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొద్దిసేపు గందరగోళం తలెత్తినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన, ప్రస్తుత పరిస్థితులు, పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసే పర్యటనకు సంబంధించి చర్చించేందుకు సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సీమాంధ్ర నేతలు కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఎన్నో కష్టాలకు ఓర్చి సీమాంధ్రలో పార్టీ పక్షాన నిలుస్తున్నప్పటికీ రాష్ట్ర అధ్యక్షుడు తమకు భరోసా ఇవ్వటం లేదని సీమాంధ్ర నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది.
దీంతో నొచ్చుకున్న కిషన్‌రెడ్డి ఒక దశలో రాజీనామా చేస్తానని వ్యాఖ్యానించినట్లు చెప్తున్నారు. పార్టీ అగ్రనేతలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాలని తాము భావిస్తే తెలంగాణ నేతలను ఎందుకు తమతో పంపిస్తున్నారని సీమాంధ్ర నేతలు ప్రశ్నించటంతో.. వారితో పాటు తెలంగాణ నేతలను పంపించే ఆలోచనను కిషన్‌రెడ్డి విరమించుకున్నట్లు తెలిసింది.
ఈ సందర్భంగా వాగ్వాదం ముదురుతుండటంతో సమావేశం నుంచి కిషన్‌రెడ్డి బయటకువెళ్లిపోయినట్లు సమాచారం. పార్టీ సంఘటన ప్రధాన కార్యదర్శి రవీంద్రరాజు వల్లే ఇదంతా జరుగుతోందనే భావనలో కిషన్‌రెడ్డి ఉన్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఇదిలావుంటే.. పార్టీ కార్యాలయంలో జరిగిన సలహామండలి భేటీలో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ, సకలజన భేరీలో బీజేపీ నిర్వహించిన పాత్ర, ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చించారు. పార్టీ అగ్రనేతలు కిషన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శేషగిరిరావు, నాగం జనార్దన రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.వి.ఎస్.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కిషన్‌రెడ్డితో సీమాంధ్ర నేతల భేటీ రసాభాస
Published Tue, Oct 1 2013 4:33 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement