
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ భూముల అమ్మకం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ప్రస్తావించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో..‘ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో మీరు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.
నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.
మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడిన ఈ భూమి నగరానికి ఊపిరులూదే ఒక ఆక్సిజన్ వనరుగా ఉంది. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది.
ముఖ్యంగా ఈ భూమి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్ళకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ IV కింద భారతీయ నక్షత్ర తాబేళ్ళు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయి. ఈ చట్టం కింద ఆయా జీవజాతుల సంరక్షణతోపాటు, వాటి ఆవాసాలను కూడా సంరక్షించాలి. ఈ నక్షత్ర తాబేళ్ళు 2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) లో దుర్బలమైన జాబితాలో చేర్చబడి ఉన్నాయి. అంటే, ఇది అంతరించిపోతున్న వాటి జీవజాతిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర తాబేళ్ళు 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం (CITES - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా & ఫానా) కన్వెన్షన్ యొక్క అపెండిక్స్-I లో కూడా చేర్చబడి ఉన్నాయి.
అంటే ఆయా జీవజాతులకు అంతర్జాతీయ వాణిజ్యం నుంచి అత్యున్నత స్థాయిలో రక్షణ కూడా కల్పించబడి ఉంది. కాబట్టి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.
నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. ఇవి చాలవన్నట్లు ఆర్థిక వనరుల పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్ అడవులుగా మార్చడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికీ కూడా ఆమోదయోగ్యం కాదు.
ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతైనా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.