land purchases
-
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ భూముల అమ్మకం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ప్రస్తావించారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో..‘ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో మీరు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడిన ఈ భూమి నగరానికి ఊపిరులూదే ఒక ఆక్సిజన్ వనరుగా ఉంది. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది.ముఖ్యంగా ఈ భూమి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్ళకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ IV కింద భారతీయ నక్షత్ర తాబేళ్ళు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయి. ఈ చట్టం కింద ఆయా జీవజాతుల సంరక్షణతోపాటు, వాటి ఆవాసాలను కూడా సంరక్షించాలి. ఈ నక్షత్ర తాబేళ్ళు 2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) లో దుర్బలమైన జాబితాలో చేర్చబడి ఉన్నాయి. అంటే, ఇది అంతరించిపోతున్న వాటి జీవజాతిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర తాబేళ్ళు 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం (CITES - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా & ఫానా) కన్వెన్షన్ యొక్క అపెండిక్స్-I లో కూడా చేర్చబడి ఉన్నాయి.అంటే ఆయా జీవజాతులకు అంతర్జాతీయ వాణిజ్యం నుంచి అత్యున్నత స్థాయిలో రక్షణ కూడా కల్పించబడి ఉంది. కాబట్టి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. ఇవి చాలవన్నట్లు ఆర్థిక వనరుల పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్ అడవులుగా మార్చడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికీ కూడా ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతైనా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
రియల్ ఎస్టేట్ కోసమే ఎకరం వంద కోట్లని ప్రచారం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. దీపం ఆరిపోయే ముందు వెలుగెక్కువ అన్నట్లుగా ఉంది తెలంగాణ ప్రభుత్వం తీరు. భూములు అమ్మవద్దని ఆనాడు అసెంబ్లీలో మేమే(బీఆర్ఎస్) ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశాం. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం భూములు ఎలా అమ్ముతోందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోలేదని చెప్పడానికే ఎకరం వంద కోట్లు అని ప్రచారం చేసుకోవడానికి చూస్తున్నారు. ఫార్మా కంపెనీలకు భూముల సేకరణకు ఎంత పరిహారం ఇస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఈటల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ పేదల కోసం కాదు.. పెద్దల కోసం మాత్రమే. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కలెక్టర్లకు టార్గెట్స్ పెట్టారు. చట్ట సభలపై కేసీఆర్‌కి నమ్మకం సన్నగిల్లింది. బడ్జెట్ సమావేశాలు 11 రోజులు.. వర్షాకాల సమావేశాలు మూడు రోజులు. ఈ ఏడాది మొత్తంలో అసెంబ్లీ సమావేశాలు 14 రోజులు మాత్రమే జరిగాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగేవి. ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాల్లో ఉండే వాళ్లుగా.. పోలీసు స్టేషన్లకు ఫోన్ చేసే వాళ్లుగా మార్చారు. అసెంబ్లీలో నేడు నాలుగు పార్టీలే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలు ఉండేవి. అన్ని పార్టీలతో బీఏసీ సమావేశం నిర్వహించేవారు. జాతీయ పార్టీగా ఉన్న బీజేపీని బీఏసీ సమావేశానికి పిలవలేదు. ఒక్క ఎమ్మెల్యేగా ఉన్న జయప్రకాశ్ నారాయణ కూడా బీఏసీ సమావేశంలో పాల్గొనేవారు. సభ సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. స్పీకర్ కనీసం మావైపు కన్నెత్తి కూడా చూడలేదు. మూడు రోజులు సభ జరిగితే.. ఒకరోజు హరీష్ రావు, రెండోరోజూ కేటీఆర్, చివరి రోజు కేసీఆర్.. ప్రతిపక్షాలపై దాడి చేయడానికే సరిపోయిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికార పార్టీ సభ్యుల కంటే ఎక్కువగా ప్రతిపక్ష పార్టీ ఎంఐఎం పొగడటం జుగుప్సాకరంగా ఉంది. ప్రజల మీద, ప్రజాస్వామం, చట్ట సభల మీద బీఆర్ఎస్ నేతలకు నమ్మకం లేదు. ఈ సభలో బీఆర్ఎస్కి బైబై చెప్పినట్టే. ఇటీవల రాష్ట్రంలో వరదల కారణంగా 41 మంది మృతిచెందారు.. వారికి కనీసం అసెంబ్లీలో సంతాపం చెప్పలేదు. వరదలతో చాలా మంది నష్టపోయారు. వారికి కనీసం ప్రభుత్వం సహాయం చేయలేదు. 109 సీట్లు గెలుస్తామని కేసీఆర్ అహంకారంతో చెబుతున్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాగ్ రిపోర్టుపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలంగాణలో బడ్జెట్ పెరుగుతోంది. కేటాయింపులు తగ్గుతున్నాయి. కొన్ని శాఖలకు కేటాయింపులు ఉన్నా.. ఖర్చు కూడా చేయడం లేదు. రైతులు తీసుకున్న రుణాలకు 13 నుంచి 14వేల కోట్ల రూపాయలు వడ్డీ పెరిగిపోయింది. ప్రభుత్వ ఖర్చులతో ప్రతినెలా నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీలకు పోతుంది. నాలుగు కోట్ల రూపాయలు జీతభత్యాలకు పోతుంది అని అన్నారు. ఇది కూడా చదవండి: సుప్రీంకోర్టులో వనమాకు ఊరట.. -
ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పేరిట సాగిన మరో భారీ భూబాగోతం బట్టబయలైంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ డిజైన్ల ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారన్నది వెల్లడైంది. ఇన్నర్‌రింగ్ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి.. రోడ్డు డిజైన్ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడి.. తాము ముందుగా అనుకున్న డిజైన్‌నే ఖరారుచేశారు. ఈ మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఇరువైపులా తమ కుటుంబ వ్యాపార సంస్థలు, సన్నిహితులు, బినామీల భూములు ఉండేలా కథ నడిపించారు. ఆ విధంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన బినామీ లింగమనేని గ్రూప్ సంస్థలు, నారాయణ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు అడ్డగోలుగా వేలకోట్ల ప్రయోజనం కలిగించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి తమ బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు. ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ పేరిట సాగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. సీఆర్డీఏ ఫైళ్లు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్ కంపెనీ, లింగమనేని గ్రూప్ సంస్థలతోపాటు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–3గా లింగమనేని రమేష్‌లతోపాటు 14మందిపై సోమవారం ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతేకాక.. సీఐడీ దర్యాప్తులో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గోప్యంగా ఇన్నర్ రింగ్‌రోడ్డు డిజైన్ టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్ డిజైన్‌ను ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎలా ఉండనున్నది నిర్ధారణ అయిపోయింది. కానీ, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం ఇన్నర్‌రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు నియమించిన ఎస్టీయూపీ అనే మరో కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలనే షరతు పెట్టారు. ఈ అంశంపై సీఆర్డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు డ్రామా ఆడి ముందుగానే ఖరారుచేసిన ఇన్నర్ రింగ్‌రోడ్డు డ్రాఫ్ట్ ప్లాన్‌ను ఆమోదించారు. అటూ ఇటూ భారీగా భూముల కొనుగోలు ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది. రాజధాని పరిధి పెంచుకుంటూ పోయారు అమరావతి ప్రాంతంలోనే రాజధాని వస్తుందని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు, ఆయన సన్నిహితులు, బినామీలు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు. అంతేకాదు.. తాము కొనుగోలు చేసిన భూముల విలువ వందల రెట్లు పెరిగేలా అమరావతి పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూపోయారు. ఎలాగంటే.. ► రాజధాని అమరావతి 122 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుందని 2014, డిసెంబర్ 30న నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ► తరువాత 2015, జూన్ 9న 217 చదరపు కి.మీ.కు.. అనంతరం 391 చదరపు కి.మీ.కు పెంచారు. అంతేకాదు.. అమరావతిలో ఏ ప్రాంతం భూసమీకరణ పరిధిలోకి వస్తుంది... ఏ ప్రాంతం రాదన్నది కూడా నిర్ణయించారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములన్నీ కూడా అమరావతి పరిధిలోనే ఉంటూ కూడా భూసమీకరణ పరిధిలోకి రాకపోవడం గమనార్హం. దాంతో ఎకరా సగటున రూ.25లక్షలకు కొనుగోలు చేసిన భూముల విలువ అమాంతంగా ఎకరా రూ.4కోట్ల వరకు చేరింది. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అండ్ కో అవినీతి బట్టబయలుకావడంతో సీఐడీ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. -
Vijaya Dairy: పా‘పాల’ పుట్ట!
విజయ డెయిరీ.. ఇది ఓ పా‘పాల’ పుట్ట.. అడుగడుగునా అక్రమాల చిట్టా. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ ఇప్పుడు అంతులేని విమర్శలు, వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత యూనియన్ చైర్మన్‌గా కొనసాగుతున్న ఈ సంస్థలో ఇప్పుడు అనేకానేక గోల్మాల్ వ్యవహారాలు గుప్పుమంటున్నాయి. భూముల కొనుగోలులో చేతివాటం మొదలు రూ.కోట్లలో నిధుల మాయం.. మితిమీరిన కమీషన్ల కక్కుర్తి.. బోనస్‌ల బాగోతం వంటి అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని సంస్థ భాగస్వాములే కళ్లకు కట్టినట్లు చెబుతున్నారు. ఇక పొరుగు రాష్ట్రంలో అయితే ‘విజయ’ ముసుగులో ప్రైవేట్ దందాకు తెరతీశారు. మొత్తం మీద విజయ డెయిరీ పరిస్థితి ఇప్పుడు ‘మేడిపండు చూడ మేలిమై యుండు..’ అన్నట్లుగా ఉంది. సాక్షి, అమరావతి: కృష్ణా మిల్క్ యూనియన్‌కి చెందిన విజయ డెయిరీ అంటే ఒక బ్రాండ్. సుమారు 600 పాల ఉత్పత్తి సహకార సంఘాలు (సొసైటీలు) దీని కింద ఉన్నాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది రైతులున్నారు. ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలను సంస్థ సేకరిస్తుంది. ఇందులో కృష్ణాజిల్లా నుంచే ఎక్కువ పాలు సేకరిస్తారు. దీని వార్షిక టర్నోవర్ రూ.900 కోట్లుగా ఉంది. ఇంత ప్రతిష్ట ఉన్న ఈ సంస్థ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్. కానీ, ఇప్పుడు ఆ పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బతీస్తూ కొత్త పాలకవర్గం ఇష్టారాజ్యంగా అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు. నాణ్యతకు పెట్టింది పేరుగా ఉన్న ఈ సంస్థను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారనే ప్రచారం జరుగుతోంది. యూనియన్ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత చలసాని ఆంజనేయులు బాధ్యతలు చేపట్టాక ఆయన వ్యవహారశైలితో విజయ డెయిరీ బ్రాండ్ తన ప్రాభవాన్ని కోల్పోయిందని ఆందులో భాగస్వాములుగా ఉన్న పలు సొసైటీల చైర్మన్లు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అడుగడుగునా అనేకచోట్ల విజయ పార్లర్లు పెట్టడం ద్వారా సంస్థ ప్రగతిపథంలో ఉందనే భ్రమ బయటకు కల్పిస్తున్నా అంతర్గతంగా మాత్రం పరిస్థితి చేయిదాటిపోయినట్లు స్పష్టమవుతోంది. కొత్త పాలకవర్గం వచ్చిన రెండేళ్లలోనే సంస్థ పరిస్థితి దిగజారిందని, అనేక గోల్మాల్ వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపించారు. ఇదే విధానం కొనసాగితే మూడు, నాలుగేళ్లలో సంస్థ దివాళా తీయడం ఖాయమని వారు చెబుతున్నారు. అక్రమాల చిట్టా ఇదే.. ► కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో కొత్త డెయిరీ యూనిట్ పెడుతున్నామనే పేరుతో కొనుగోలు చేసిన భూముల్లో పెద్దఎత్తున గోల్మాల్ జరిగింది. ఇక్కడ తన స్నేహితుడికి చెందిన పొలం ఎకరం రూ.50 లక్షలుంటే రూ.75 లక్షలిచ్చి కొనుగోలు చేశారు. అలాగే, వీరవల్లి పరిసరాల్లోనే రైల్వే ట్రాక్‌కు ఆనుకుని రూ.25 లక్షలున్న ఎకరం భూమిని రూ.50 లక్షలిచ్చి రెట్టింపు రేటుకు కొన్నారు. ఇలా సుమారు 13 ఎకరాలు కొని రూ.4 కోట్లకు పైగా జేబులో వేసుకున్నారు. ఈ భూములను ఎందుకు కొన్నారో ఇప్పటివరకు సొసైటీలకు చెప్పలేదు. మొదట్లో పెల్లెట్స్ (గుళికలు) తయారీ ఫ్యాక్టరీ కోసం భూములు కొంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఓ కంపెనీకి రూ.90 కోట్ల వర్క్ ఆర్డర్ ఇచ్చి రూ.10 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. దీనివల్ల సంస్థకు నష్టం తప్ప లాభంలేదని తేలడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. అడ్వాన్స్ మొత్తం ఏమైందో సమాధానం చెప్పే దిక్కులేదు. ► 2019లో కొత్త పాలకవర్గం వచ్చే నాటికి సంస్థలో రూ.90 కోట్ల రిజర్వు నిధులున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన ఆ డబ్బును రెండేళ్లలోనే కరిగించేశారు. ఆ డబ్బును ఎందుకు, ఎక్కడ ఖర్చు పెట్టారో పాలకవర్గం సర్వసభ్య సమావేశంలో కొందరు అడిగినా ఇప్పటివరకు జవాబులేదు. బోనస్‌లో ఎలా బరితెగించారంటే.. గతంలో రూ.700 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్నప్పుడు రైతులకు రూ.65 కోట్ల బోనస్ ఇచ్చారు. ఇప్పుడు టర్నోవర్ సుమారు రూ.900 కోట్లకు చేరినా రైతులకిచ్చే బోనస్ రూ.45 కోట్లకు పడిపోయింది. గతంలో రైతులకు లీటర్‌కు రూ.32 పైసల చొప్పున 3 విడతలుగా బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు దాన్ని రూ.15 పైసలకి తగ్గించి ఒకసారే ఇస్తున్నారు. చైర్మన్ దుబారా, ధనదాహమే ఇందుకు కారణమని రైతులు ఆరోపిస్తున్నారు. విజయ పార్లర్లలో ఇతర బ్రాండ్లు ఇక విజయ పార్లర్లలో ఇతర సంస్థల ఉత్పత్తులను విజయ బ్రాండ్ పేరిట విక్రయించడానికి గేట్లు బార్లా తెరిచారు. దీంతో బ్రాండ్ పేరు మసకబారింది. కమీషన్ల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ఐస్‌క్రీం, బ్రెడ్, కేక్, బిస్కెట్లు కొని వాటిని విజయ ఉత్పత్తులుగా అమ్ముతుండడంపై సంస్థలోనే తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఎలాంటి టెండర్ లేకుండా ఒక ఐస్‌క్రీం కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేశారు. అలాగే, విజయ పాలకు ఉన్నట్లే విజయ పశు దాణాకు మంచి డిమాండ్ ఉంది. దాన్ని కూడా స్వయంగా తయారుచేయకుండా కమీషన్ల కోసం ఓ ప్రైవేట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. దీంతో అమ్మకాలు పడిపోయి నష్టాలు వస్తున్నాయి. ► ఇక చిత్తూరు జిల్లా రైతుల నుంచి సేకరించిన లీటర్ పాలకు రూ.3 బోనస్ ఇస్తామని చెప్పి రూ.1 మాత్రమే ఇచ్చారు. మిగతా రూ.2 మింగేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాగే వెండర్స్‌కి 7.5 శాతం బోనస్ ఇస్తామని చెప్పి డబ్బు డ్రా చేసి 3.5 శాతమే ఇచ్చారు. ఇప్పటికీ ఈ రైతులు, వెండర్లు తమ బోనస్ కోసం డెయిరీ పెద్దల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ► అవసరం లేకపోయినా కమీషన్ల వేటలో భారీగా వెన్న, పాల పొడిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనిట్లో వీటి స్టాకు పెద్దఎత్తున నిల్వ ఉంది. ► తెలంగాణలోని కోదాడ, ఖమ్మంలో విజయ డెయిరీకి గతంలో 16 వేల లీటర్ల మార్కెట్ ఉండేది. అది ప్రస్తుతం వెయ్యి లీటర్లకు పడిపోవడం వెనుక చైర్మన్ మాయాజాలం ఉన్నట్లు ఆరోపణలున్నాయి. స్థానికంగా కొందరితో కలిసి అక్కడే పాలు కొని సొంతంగా ప్యాక్ చేయించి అమ్ముతున్నట్లు సమాచారం. విజయ బ్రాండ్ పేరుతో సొంత లాభం కోసం ఇలా ప్రైవేటు దందాకు తెరతీశారని చెబుతున్నారు. ► తన పబ్లిసిటీ పిచ్చికి తమ చైర్మన్ రూ.50 లక్షలు వృధా చేసినట్లు వివిధ సొసైటీల చైర్మన్లు వాపోతున్నారు. యూనియన్ చైర్మనే స్వయంగా ఫ్లెక్సీలు వేయించి వాటిని అన్ని సొసైటీలకు లారీలో పంపి కట్టించారు. -
‘పోలవరం’లో కదులుతున్న అక్రమాల డొంక
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం పునరావాసంలో అక్రమాల డొంక కదులుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు పోలవరం భూసేకరణలో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో జరిగిన అక్రమాలపై ఐటీడీఏ పీవో సూర్యనారాయణ విచారణ చేపట్టారు. ఇందులో ఇద్దరు వ్యక్తులకు అదనంగా నగదు చెల్లించిన విషయం బయటపడటంతో వారం రోజుల్లో రూ.87 లక్షలు వెనక్కి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. సోమవారం దర్భగూడెంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. వివరాల్లోకెళ్తే.. పోలవరం ముంపులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూమికి భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏడొందల ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలులో టీడీపీ నేతలు, కార్యకర్తలు, పలువురు బ్రోకర్లు అనేక అక్రమాలకు తెరలేపారు. సాగుకు పనికి రాని భూములు, కంకర క్వారీ, చెరువు, చౌడు భూములు, 1/70 యాక్టులో ఉన్న భూములను సైతం భూసేకరణలో పెట్టి సొమ్ము చేసుకున్నారు. దర్భగూడెంలో పామాయిల్ తోటలు, బోర్లు, అటవీ వృక్షాలు ఉన్నట్లు చూపి నగదు స్వాహా చేశారు. పారిశ్రామికవేత్త ఖాతాకు ఆరు కోట్లు భూసేకరణలో బ్రోకర్‌గా వ్యవహరించిన ఒక వ్యక్తి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడైన ఒక పారిశ్రామికవేత్త కరెంట్ ఖాతాకు రూ.6 కోట్ల నగదు జమయ్యేలా చేశారని తెలిసింది. ఇదేవిధంగా పలువురు రైతులకు నగదు జమ చేయించారు. దీనికి ప్రతిఫలంగా రైతుల వద్ద నుంచి ఎకరానికి యాభై వేలు కమీషన్ తీసుకున్నారు. విచారణలో ఇవన్నీ బయటపడటంతో దర్భగూడెంకు చెందిన పి.సత్యనారాయణరెడ్డి, అలవాల మోహనరెడ్డికి భూసేకరణ అధికారి ఆర్.వి.సూర్యనారాయణ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై పీవో సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ భూసేకరణ విషయంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పారు. -
‘పాలమూరు’ భూములకు వంద కోట్లు!
* ఎకరాకు రూ.3 లక్షల చొప్పున మార్కెట్ రేటు చెల్లింపునకు సర్కారు సిద్ధం * సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వం * ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాల ఖరారు సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భూముల కొనుగోళ్లకే తొలి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా భూకొనుగోళ్ల పథకం మార్గదర్శకాలు ఖరారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు ఆరంభించారు. గతంలో మాదిరి భూసేకరణ కాకుండా ఏకంగా భూముల యజమానుల నుంచి మార్కెట్ ధరకే భూములు కొనుగోలు చేయాలని ఇదివరకే నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేసి తొలి విడత భూముల కొనుగోళ్లకు రూ.100 కోట్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. భూముల కొనుగోళ్ల కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ మార్గదర్శకాల ఉత్తర్వులు ఖరారైన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. శ్రీశైలంలో వరద ఉండే రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ ప్రాజెక్టు చేపడితే ఏడు గ్రామాలు, 25,292 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇందులో కర్వేని, వట్టెం రిజర్వాయర్ల కిందే ఎక్కువగా 10 వేల ఎకరాల ముంపు ఉండనుండగా మిగతా రిజర్వాయర్ల కింద 3 వేల ఎకరాల వరకు ముంపు ఉండనుంది. ఇక లోకిరేవు రిజర్వాయర్ కింద నాలుగు గ్రామాలు, కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద మరో మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ప్రాజెక్టును నిర్ణీత నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు వీలుగా భూసేకరణ, సహాయ పునరవాసానికే తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఇది వరకే నిర్ణయించారు. ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పరిహార చెల్లింపులు వేగంగా జరిపేందుకు ప్రాజెక్టులవారీగా ప్రత్యేక అథారిటీలు ఏర్పాటు చేసి వీటి ద్వారానే చెల్లింపులు వేగంగా జరిపేలా చూడాలని ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్నా ఆదేశాలు అమలు కాకపోవడంపై సీఎం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా భూముల కొనుగోళ్ల పథకానికి తుదిరూపమిచ్చి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలి విడతగా నార్లాపూర్ కింద ఉన్న ముంపునకు గురయ్యే భూముల కొనుగోలుకు రూ.100 కోట్లు కావాలని నీటిపారుదలశాఖ ఆర్థికశాఖను కోరినట్లు తెలిసింది. మిగతా భూసేకరణను సైతం ఆగస్టులోగా పూర్తి చేసి అదే నెల రెండో వారం నుంచి టెండర్ల ప్రక్రియపై ముందుకెళ్లాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. -
తుళ్లూరులో రియల్ మాయ
* రూ కోట్లు లెక్కపెట్టేందుకు దుకాణాల్లోనే నోట్ల లెక్కింపు యంత్రాలు * రోడ్ల మీదే ఖరీదైన కార్లు, సెకండ్ హ్యాండ్ వాహనాల ప్రదర్శనలు * భూ లావాదేవీల ఘర్షణల నివారణకు పోలీస్ బృందం గస్తీ సాక్షి, విజయవాడ బ్యూరో: తుళ్లూరు... గుంటూరు జిల్లాలోని ఓ మండలకేంద్రం. రెండునెలల కిందటి వరకు ఈ ఊరు ఎక్కడుందో కూడా చాలామందికి తెలియదు. రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణ జరిపే ప్రాంతంగా ఈ గ్రామం ఎంపిక కావడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. వచ్చిపోతున్న వాహనాలతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రధాన రహదారులు కిటకిటలాడుతున్నాయి. ఇటీవల వరకు రోజుకు రూ 200 వ్యాపారం జరిగితే గొప్ప అనుకున్న జిరాక్స్ సెంటర్లు మొదలుకుని కాకా హోటళ్లు, టీ అంగళ్లు, బిజీబిజీగా మారిపోయాయి. రాజధాని జోన్లో 29 గ్రామాల్లో భూ సమీకరణకు బాబు సర్కార్ కసరత్తు చేస్తుండటంతో భూ క్రయవిక్రయాలు ఊపందుకున్నా యి. ల్యాండ్ ఫూలింగ్‌తో తమ భూములు కో ల్పోతామని కలవరపడుతున్న అన్నదాతలు భూములు అమ్ముకునేందుకు సిద్ధమవుతున్నారు. గత పది రోజుల్లోనే ఈ 29 గ్రామాలకు చెందిన రైతులు సుమారు 3,500 ఎకరాల భూములను అమ్ముకున్నట్లు అనధికారిక సమాచారం. మూడు నుంచి నాలుగు చేతులు మారడంతో ప్రతీ రిజిస్ట్రేషన్లోనూ ధరలు పెరుగుతూపోయాయి. దీంతో పది రోజుల క్రితం రూ.90లక్షలు పలికిన ఎకరం ఇప్పుడు నుంచి కోటిన్నర నుంచి రెండు కోట్లపైమాటే. రూ.కోట్లను కమిషన్‌పై లెక్కించేందుకు నోట్ల లెక్కింపు యంత్రాలతో దుకాణాలు కూడా వెలిశాయి. బ్రోకర్లు కోటిు లెక్కిస్తే రూ. వెయ్యి కమిషన్ తీసుకుంటున్నారు. మరోవైపు కారు, బైక్ మేళాలు మొదలయ్యాయి. శనివారం నుంచి గుంటూరుకు చెందిన ఆటో కన్సల్టెన్సీ వాళ్లు పాత కార్లు తెచ్చి అమ్మేందుకు మేళా పెట్టారు. ఏడు రెవెన్యూ బృందాల ఏర్పాటు.. భూముల కొనుగోళ్లు అమ్మకాలకు రిజిస్ట్రేషన్ కావాలంటే పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్లు తప్పనిసరి కావడంతో రెవెన్యూ శాఖకు చేతినిండా పనిదొరికింది. తుళ్ళూరు తహశీల్దార్ కార్యాలయంలో పట్టాదార్ పాస్‌పుస్తకాలు, అడంగళ్ దస్త్రాల కోసం శనివారం వందల సంఖ్యలో రైతులు, బ్రోకర్లుతో కిక్కిరిసిపోయింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాలతో పాస్బుక్ల కోసం రైతులనుంచి వందలాది దరఖాస్తులు వస్తున్నాయని, వాటిని పరిశీలించేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్టు తహశీల్దార్ ఎ.సుధీర్‌బాబు ‘సాక్షి’కి చెప్పారు. ఫోర్జరీలకు, వివాదాలకు తావులేకుండా భూముల రికార్డులు, వాస్తవంగా భూములు ఎవరి పేరుతో ఉన్నాయనే విషయాలను రెవెన్యూ బృందాలు పూర్తిస్థాయి పరిశీలన చేసిన తరువాతే దరఖాస్తుదారులకు ధ్రువపత్రాలు జారీచేస్తామని తెలిపారు. తుళ్లూరులో వందలాది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేరుకోవడంతో భూలావాదేవీల్లో ఘర్షణలు తలెత్తకుండా ప్రత్యేక పోలీస్ టీం గస్తీ తిరుగుతోంది. -
భూముల ధరలకు మళ్లీ రెక్కలు
అమరావతి వైకుంఠపురంలో రాష్ట్ర అసెంబ్లీ భవనం, ధరణికోటలో సెక్రటేరియెట్, అమరావతి అగ్రి కల్చరల్ ఫారంలో వ్యవసాయ యూనివర్సిటీ, మండలానికి దగ్గరగా ఔటర్ రింగ్ రోడ్డు... ఇలా రోజుకో ప్రతిపాదన కొత్తరాజధాని తెరపైకి వస్తుండడంతో మండల పరిధిలో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. నిన్నటి మొన్నటి వరకు మండల కేంద్రమైన అమరావతిలో విజయ వాడ-గుంటూరు రోడ్డులో భూముల కొనుగోళ్లు నిలిచిపోయాయి. అమరావతిని స్మార్ట్ సిటిగా అభివృద్ధి చేయాలని, ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనలు రావటంతో తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగం పుంజుకుంది. మొన్నటి వరకు విజయవాడ-గుంటూరు రోడ్డు పక్కన ఎకరం కోటి రూపాయల ధర పలకగా, నేడు రెండు రూ. కోట్లకు పెంచారు. వాగుల పరివాహక ప్రాంతంలో వర్షాకాలంలో నీట మునిగే భూములను ఎకరా 30 నుండి 40 లక్షల రూపాయలు చెబుతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై స్పష్టత రావటంతో మండల పరిధిలో వైకుం ఠపురం, పెదమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె, 14వ మై లు ప్రాంతాల్లో భూముల ధరలు పెరిగాయి. కృష్ణానదికి రెండువైపుల రాజధాని నిర్మాణ జరగనున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో అమరావతి, ధరణికోట, దిడుగు, మల్లాది, మునగోడు వంటి నది పరివాహక భూములకు డిమాండ్ పెరిగింది. అమరావతికి పక్కనే ఉన్న తుళ్లూరు, తాడికొండ మండలాల మీదుగా అవుటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన వెలువడటంతో ఈ మూడు మండలాల్లో భూములకు విపరీతంగా ధర పెరిగింది. ఇంకా ధర పెరుగుతుందనే ఉద్దేశంతో రైతులు ప్రస్తుతం భూముల అమ్మకానికి మొగ్గు చూపటం లేదు. ప్రభుత్వ భూముల గుర్తింపు.. {పభుత్వం ఆర్డివో స్థాయి అధికారిని నియమించి మండల పరిధిలో పోరంబోకు, అసైన్డ్, అటవీ, చెరువు, కుంటలకు సంబంధించిన భూములను క్షుణ్ణంగా పరిశీలించి వాటి వివరాలు సేకరించటం ప్రారంభించింది. మండలంలో ఏదో ఒక రంగానికి సంబంధించి అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో కొందరు ఇక్కడ భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుం టే, లేఅవుట్ల ద్వారా వేసిన ప్లాట్ల అమ్మకాలు ఇక్కడ మందకొడిగా సాగుతు న్నాయి. నిబంధనలు పాటించని లేఅవుట్లలో స్థలాల కొనుగోలుకు ప్రజలు వెనుకాడుతున్నారు.