‘పాలమూరు’ భూములకు వంద కోట్లు!
* ఎకరాకు రూ.3 లక్షల చొప్పున మార్కెట్ రేటు చెల్లింపునకు సర్కారు సిద్ధం
* సీఎం ఆదేశాలతో కదిలిన ప్రభుత్వం
* ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భూముల కొనుగోళ్లకే తొలి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా భూకొనుగోళ్ల పథకం మార్గదర్శకాలు ఖరారు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు కసరత్తు ఆరంభించారు.
గతంలో మాదిరి భూసేకరణ కాకుండా ఏకంగా భూముల యజమానుల నుంచి మార్కెట్ ధరకే భూములు కొనుగోలు చేయాలని ఇదివరకే నిర్ణయించిన ప్రభుత్వం... ఇందుకు సంబంధించి ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేసి తొలి విడత భూముల కొనుగోళ్లకు రూ.100 కోట్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. భూముల కొనుగోళ్ల కోసం ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ మార్గదర్శకాల ఉత్తర్వులు ఖరారైన వెంటనే ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. శ్రీశైలంలో వరద ఉండే రోజుల్లో 70 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టు కింద మూడు జిల్లాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయించడం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు చేపడితే ఏడు గ్రామాలు, 25,292 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఇందులో కర్వేని, వట్టెం రిజర్వాయర్ల కిందే ఎక్కువగా 10 వేల ఎకరాల ముంపు ఉండనుండగా మిగతా రిజర్వాయర్ల కింద 3 వేల ఎకరాల వరకు ముంపు ఉండనుంది. ఇక లోకిరేవు రిజర్వాయర్ కింద నాలుగు గ్రామాలు, కేపీ లక్ష్మీదేవునిపల్లి కింద మరో మూడు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి.
ప్రాజెక్టును నిర్ణీత నాలుగేళ్లలో పూర్తి చేసేందుకు వీలుగా భూసేకరణ, సహాయ పునరవాసానికే తొలి ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఇది వరకే నిర్ణయించారు. ప్రాజెక్టుల కింద భూ సేకరణ, పరిహార చెల్లింపులు వేగంగా జరిపేందుకు ప్రాజెక్టులవారీగా ప్రత్యేక అథారిటీలు ఏర్పాటు చేసి వీటి ద్వారానే చెల్లింపులు వేగంగా జరిపేలా చూడాలని ఆదేశించారు. అయితే నెలలు గడుస్తున్నా ఆదేశాలు అమలు కాకపోవడంపై సీఎం ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరగా భూముల కొనుగోళ్ల పథకానికి తుదిరూపమిచ్చి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తొలి విడతగా నార్లాపూర్ కింద ఉన్న ముంపునకు గురయ్యే భూముల కొనుగోలుకు రూ.100 కోట్లు కావాలని నీటిపారుదలశాఖ ఆర్థికశాఖను కోరినట్లు తెలిసింది. మిగతా భూసేకరణను సైతం ఆగస్టులోగా పూర్తి చేసి అదే నెల రెండో వారం నుంచి టెండర్ల ప్రక్రియపై ముందుకెళ్లాలని అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.