ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ  | TDP Leaders Chandrababu Narayana Land Scam In Amaravati | Sakshi
Sakshi News home page

ఏ–1 చంద్రబాబు.. ఏ–2 నారాయణ 

Published Wed, May 11 2022 5:16 AM | Last Updated on Wed, May 11 2022 10:20 AM

TDP Leaders Chandrababu Narayana Land Scam In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి పేరిట సాగిన మరో భారీ భూబాగోతం బట్టబయలైంది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి మాస్టర్‌ప్లాన్, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ డిజైన్ల ముసుగులో భారీ భూదోపిడీకి పాల్పడ్డారన్నది వెల్లడైంది. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు డిజైన్‌ను ముందుగానే మాస్టర్‌ప్లాన్‌లో చేర్చిన విషయాన్ని గోప్యంగా ఉంచి.. రోడ్డు డిజైన్‌ కోసం కన్సల్టెన్సీని నియమించినట్లుగా డ్రామా ఆడి.. తాము ముందుగా అనుకున్న డిజైన్‌నే ఖరారుచేశారు.

ఈ మధ్యలో ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు ఇరువైపులా తమ కుటుంబ వ్యాపార సంస్థలు, సన్నిహితులు, బినామీల భూములు ఉండేలా కథ నడిపించారు. ఆ విధంగా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్‌ కంపెనీ, ఆయన బినామీ లింగమనేని గ్రూప్‌ సంస్థలు, నారాయణ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు అడ్డగోలుగా వేలకోట్ల ప్రయోజనం కలిగించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడుతామని చేసిన పదవీ స్వీకార ప్రమాణానికి విరుద్ధంగా వ్యవహరించి తమ బినామీలకు అక్రమంగా భారీ ప్రయోజనం కలిగించారు. దాంతో సామాన్యులు తీవ్రంగా నష్టపోయారు.

ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ పేరిట సాగిన అక్రమాలపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది. సీఆర్‌డీఏ ఫైళ్లు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్ల వివరాలు, ఇతర కీలక ఆధారాలను సేకరించింది. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్, హెరిటేజ్‌ కంపెనీ, లింగమనేని గ్రూప్‌ సంస్థలతోపాటు మొత్తం 14 మందిపై కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–3గా లింగమనేని రమేష్‌లతోపాటు 14మందిపై సోమవారం ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసిన విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అంతేకాక.. సీఐడీ దర్యాప్తులో ఆశ్చర్యకర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 


గోప్యంగా ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డిజైన్‌
టీడీపీ ప్రభుత్వం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్‌ కన్సల్టెన్సీ ద్వారా రూపొందించిన రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లోనే ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ డిజైన్‌ను ముందుగానే చేర్చింది. అంటే అప్పటికే ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ ఎలా ఉండనున్నది నిర్ధారణ అయిపోయింది. కానీ, ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

అనంతరం ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌ను రూపొందించేందుకు నియమించిన ఎస్టీయూపీ అనే మరో కన్సల్టెన్సీకి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగానే ఉండాలనే షరతు పెట్టారు. ఈ అంశంపై సీఆర్‌డీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ పలు సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు డ్రామా ఆడి ముందుగానే ఖరారుచేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు డ్రాఫ్ట్‌ ప్లాన్‌ను ఆమోదించారు. 

అటూ ఇటూ భారీగా భూముల కొనుగోలు
ఇక ఇన్నర్‌రింగ్‌ రోడ్డు ఎలా నిర్మించనున్నారో ముందుగానే తెలిసిన చంద్రబాబు, నారాయణ తమ కుటుంబ సంస్థలు హెరిటేజ్, రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌లతోపాటు తమ బినామీ లింగమనేని రమేష్‌ తన సంస్థల పేరిట భారీగా భూములు కొన్నారు. అవన్నీ ప్రతిపాదిత ఇన్నర్‌రింగ్‌ రోడ్డుకు అటూ ఇటూ ఉండటం గమనార్హం. సీఐడీ అధికారులు మంగళగిరి, పెదకాకాని, తాడికొండ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను పరిశీలించగా ఈ విషయం స్పష్టమైంది.  

రాజధాని పరిధి పెంచుకుంటూ పోయారు
అమరావతి ప్రాంతంలోనే రాజధాని వస్తుందని ముందుగా నిర్ణయించిన చంద్రబాబు, ఆయన సన్నిహితులు, బినామీలు ఆ విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. ఆ ప్రాంతంలో తక్కువ ధరకు వేలాది ఎకరాలు కొనుగోలు చేసి అనంతరం రాజధానిని ప్రకటించారు. అంతేకాదు.. తాము కొనుగోలు చేసిన భూముల విలువ వందల రెట్లు పెరిగేలా అమరావతి పరిధిని అంతకంతకూ విస్తరించుకుంటూపోయారు. ఎలాగంటే..
► రాజధాని అమరావతి 122 చదరపు కి.మీ. పరిధిలో ఉంటుందని 2014, డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
► తరువాత 2015, జూన్‌ 9న 217 చదరపు కి.మీ.కు.. అనంతరం 391 చదరపు కి.మీ.కు పెంచారు. అంతేకాదు.. అమరావతిలో ఏ ప్రాంతం భూసమీకరణ పరిధిలోకి వస్తుంది... ఏ ప్రాంతం రాదన్నది కూడా నిర్ణయించారు. చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలకు చెందిన వందల ఎకరాల భూములన్నీ కూడా అమరావతి పరిధిలోనే ఉంటూ కూడా భూసమీకరణ పరిధిలోకి రాకపోవడం గమనార్హం. దాంతో ఎకరా సగటున రూ.25లక్షలకు కొనుగోలు చేసిన భూముల విలువ అమాంతంగా ఎకరా రూ.4కోట్ల వరకు చేరింది.  
ఈ నేపథ్యంలో.. చంద్రబాబు అండ్‌ కో అవినీతి బట్టబయలుకావడంతో సీఐడీ తదుపరి చర్యలు ఎలా ఉండనున్నాయన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement