
దర్భగూడెంలో పోలవరం నిర్వాసితులకు కొనుగోలు చేసిన భూమి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం పునరావాసంలో అక్రమాల డొంక కదులుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు పోలవరం భూసేకరణలో వందల కోట్ల రూపాయలు స్వాహా చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో జరిగిన అక్రమాలపై ఐటీడీఏ పీవో సూర్యనారాయణ విచారణ చేపట్టారు. ఇందులో ఇద్దరు వ్యక్తులకు అదనంగా నగదు చెల్లించిన విషయం బయటపడటంతో వారం రోజుల్లో రూ.87 లక్షలు వెనక్కి చెల్లించాలని నోటీసులు జారీ చేశారు.
సోమవారం దర్భగూడెంలో జరిగిన అక్రమాలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టనున్నారు. వివరాల్లోకెళ్తే.. పోలవరం ముంపులోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాల నిర్వాసితులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూమికి భూమి, ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఏడొందల ఎకరాల భూమిని టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ భూముల కొనుగోలులో టీడీపీ నేతలు, కార్యకర్తలు, పలువురు బ్రోకర్లు అనేక అక్రమాలకు తెరలేపారు. సాగుకు పనికి రాని భూములు, కంకర క్వారీ, చెరువు, చౌడు భూములు, 1/70 యాక్టులో ఉన్న భూములను సైతం భూసేకరణలో పెట్టి సొమ్ము చేసుకున్నారు. దర్భగూడెంలో పామాయిల్ తోటలు, బోర్లు, అటవీ వృక్షాలు ఉన్నట్లు చూపి నగదు స్వాహా చేశారు.
పారిశ్రామికవేత్త ఖాతాకు ఆరు కోట్లు
భూసేకరణలో బ్రోకర్‌గా వ్యవహరించిన ఒక వ్యక్తి.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే సోదరుడైన ఒక పారిశ్రామికవేత్త కరెంట్ ఖాతాకు రూ.6 కోట్ల నగదు జమయ్యేలా చేశారని తెలిసింది. ఇదేవిధంగా పలువురు రైతులకు నగదు జమ చేయించారు. దీనికి ప్రతిఫలంగా రైతుల వద్ద నుంచి ఎకరానికి యాభై వేలు కమీషన్ తీసుకున్నారు. విచారణలో ఇవన్నీ బయటపడటంతో దర్భగూడెంకు చెందిన పి.సత్యనారాయణరెడ్డి, అలవాల మోహనరెడ్డికి భూసేకరణ అధికారి ఆర్.వి.సూర్యనారాయణ నోటీసులు జారీ చేశారు. ఈ విషయమై పీవో సూర్యనారాయణ ‘సాక్షి’తో మాట్లాడుతూ భూసేకరణ విషయంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment