జహీరాబాద్, న్యూస్‌లైన్:
సీమాంధ్ర నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఖాయమని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ సి.విఠల్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో పల్లెసీమల పునర్నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ఆదివారం జహీరాబాద్‌లో రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భారత్ సందేశ్ సమితి’ ఆవిర్భావ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇంకా ఎంతో దూరంలో లేదన్నారు. విధ్వంసం లేని అభివృద్ధినే ప్రజలు కోరుకుంటారని, కాని ప్రస్తుతం విధ్వంసాలతో కూడుకున్న అభివృద్ధియే కనపడుతోంద న్నారు. పరిశ్రమల ఏర్పాటు పేరుతో సెజ్‌ల ప్రతిపాదన ముందుకు వస్తోందన్నారు. దీంతో వ్యవసాయ రంగం విధ్వంసానికి దారి తీస్తోందన్నారు. హైదరాబాద్ ప్రాంతంలో హైటెక్‌సిటీ ఏర్పాటు వల్ల ఎందరో భూములను కోల్పోయారన్నారు. ఇది రైతులకు ఏ మాత్రం లాభం చేకూర్చక పోగా, బడా బాబులకే లబ్ధి చేకూరిందన్నారు. ప్రస్తుతం జహీరాబాద్ ప్రాంతానికి కూడా పరిశ్రమలు రాబోతున్నాయని, దీంతో సెజ్‌లు వచ్చి రైతులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతిని, వ్యవసాయరంగాన్ని దెబ్బతీయకుండా జరిగే అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్నారు. ఎక్కడి వారికి అక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రజల అవసరాలను తీర్చే విషయంలో ప్రభుత్వం వైఫల్యం చెందడం మూలంగానే అన్నా హజారే, కేజ్రీవాల్‌లాంటి వారు పుట్టుకువస్తున్నారన్నారు. నేటి యువతే భవిష్యత్తు నిర్దేశకులన్నారు. గ్రామ స్వరాజ్యంతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమన్నారు. రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్ బృందం భారత్ సందేశ్ సమితి ఏర్పాటు చేసి జహీరాబాద్ నియోజకవర్గాభివృద్ధికి రూపొందించిన ప్రణాళికలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు.
కొత్త ఏడాదిలో అనేక పెనుమార్పులు: బోయినిపల్లి హన్మంత్‌రావు
ఈ ఏడాది దేశ రాజకీయాలలో అనేక పెనుమార్పులు వచ్చే అవకాశాలున్నాయని భారత స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాల వేదిక అధ్యక్షుడు బోయినిపల్లి హన్మంత్‌రావు అన్నారు. చరిత్ర మలుపు యువత చేతుల్లో ఉందన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సైతం చారిత్రక సంఘటనలు జరగే అవకాశం లేకపోలేదన్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు సంస్థ తరఫున అభ్యర్థులను పోటీకి నిలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో ప్రొఫెసర్లు తిరుమలి, మల్లేష్, సంఘ సేవకుడు పండిత్ సుదర్శన్ స్వామి, టీ జేఏసీ నాయకులు శ్యాం, రఘురంజన్, రాంచందర్ భీంవంశీ, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎల్.జనార్ధన్, రైతు సంఘం నాయకుడు ఢిల్లీ వసంత్, భారత్ సందేశ్ సమితి నాయకులు సి.అంజి, కుత్‌బుద్దీన్, ప్రశాంత్, రవీందర్‌రెడ్డి, మహేష్‌వర్ధన్‌రెడ్డి, జి.అమిత్‌కుమార్, రాములునేత, శంకర్, శ్రీనివాస్, వేణు పవార్, పాండు రాథోడ్, ప్రేమ్‌సింగ్, తారానాయక్‌లు పాల్గొన్నారు.
‘తెలంగాణ’ ఖాయం
Published Sun, Jan 5 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
Advertisement
Advertisement