సీమాంధ్రుల పాలనలో నష్టపోయింది మనమే | Let us Telangana state development | Sakshi
Sakshi News home page

సీమాంధ్రుల పాలనలో నష్టపోయింది మనమే

Published Fri, Jan 10 2014 2:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM

Let us Telangana state development

సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీమాంధ్ర నాయకుల పాలనలో అత్యధికంగా నష్టపోయింది జిల్లా ప్రజలేనని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు టీఆర్‌ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. గురువారం నగరంలో టీఆర్‌ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నాయకుడు పి.పురుషోత్తంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన రాగానే రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు వైఖరి మార్చాయని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్నారు. గ్రామస్థాయి నుంచి టీఆర్‌ఎస్‌ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
 
 అప్పుడు కనిపించలేదే : స్వామిగౌడ్
 తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరిట ఇప్పుడు కొందరు యాత్రలు చేపట్టడంపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక్క రోజు కూడా కనిపించని నేతలు.. ఇప్పుడు తామే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటూ యాత్రలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ పదమూడేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి, ప్రాణాలను లెక్కచేయకుండా అమరణ దీక్ష  చేసినందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
 
 17 నుంచి పాదయాత్ర: నాగేందర్ గౌడ్
 తెలంగాణ సాధనలో భాగంగా ఈ నెల 17నుంచి నాలుగు రోజులపాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ వెల్లడించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల నుంచి రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్  మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అబ్దుల్ ముకిత్ చాంద్‌కు నియామక పత్రం అందజేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement