harishwar reddy
-
ప్రజల కడసారి చూపులతో.. హరీశ్వర్‌రెడ్డి అంతిమ వీడ్కోలు!
వికారాబాద్: ఆయన ప్రజల నుంచి పుట్టిన నాయకుడు.. చివరి శ్వాస వరకు ప్రజాశ్రేయస్సు కోసమే తపించిన నేత.. రాష్ట్ర స్థాయిలో పరిగి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శుక్రవారం రాత్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఐదు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎదిగారు. ఆయన కడసారి చూపు కోసం అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో పరిగి వీధులు జనసంద్రాన్ని తలపించాయి. రాజకీయ నేపథ్యం.. 1947 మార్చి 18న పరిగి గ్రామంలో జన్మించారు హరీశ్వర్‌రెడ్డి. వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1972 నుంచి 1977 వరకు ఉప సర్పంచ్‌గా, 1977– 83 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోపరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగి కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో 56 ఓట్ల స్వ ల్ప తేడాతో ఓటమి చెందారు. అనంతరం ఆయన టీడీపీలో చేరి 1985 మధ్యంతర ఎన్నికల్లో షరీఫ్‌పై 32,512 ఓట్ల మెజార్టీతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1986–88 వరకు ఆగ్రో ఇండసీ్ట్రస్ కార్పొరేషన్ చైర్మన్‌గా, 1988–89 వరకు టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. 1990 ఎన్నికల్లో కమతం రామ్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన కొప్పుల 1994, 1999, 2004, 2009 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1997 నుంచి 2003 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2003 నవంబర్ 14 వరకు ఆంధ్రప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012 నవంబర్ 15న టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరి పొ లిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 2014 ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మెహన్‌రెడ్డి చేతిలో 5,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితుల్లో హరీశ్వర్‌రెడ్డి ఒకరు. తను అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో టీఆర్ఎస్ టికెట్‌ను పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డికి కేటాయించారు. ఆయన ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రజాదరణ పొందిన నాయకుడు.. కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రజాదరణ పొందిన నాయకుడు. నిత్యం ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు ప్రతిష్టలు గడించారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నిరుపేదలకు సేవలందించారు. పరిగి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించారు. ప్రజలను అన్న, తమ్మి, కాకా అంటూ వరుసలతో పిలుస్తూ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన మహా నాయకుడు హరీశ్వర్‌రెడ్డి. ఏచిన్న కార్యమైనా.. ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి వారికి తన వంతుగా సాయమందిస్తూ ఉండేవారు. ఆయన లేడనే వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
అధికార లాంఛనాలతో హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు
పరిగి: ఉమ్మడి రాష్ట్ర ఉప సభాపతి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం పరిగిలో అధికార లాంఛనాలతో నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. హరీశ్వర్‌రెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం పట్టణంలోని ఆయన నివాసంలో ఉంచారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రముఖులు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి నివాళులర్పించారు. అనంతరం పల్లవి డిగ్రీ కళాశాలలోని మైదానంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఆయన పెద్ద కుమారుడు, ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి.. తండ్రి చితికి నిప్పంటించారు. ప్రముఖుల నివాళి శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, సబితారెడ్డి, మహేందర్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, బీజేపీ నేత ప్రహ్లాద్‌రావు, టీడీపీ నేత కాసాని వీరేశ్ తదితరులు హరీశ్వర్‌రెడ్డి మృతదేహం వద్ద నివాళులర్పించారు. కాగా హరీశ్వర్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ శనివారం ఒక ప్రకటనలో తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గన్ మిస్ ఫైర్ అంత్యక్రియల సందర్భంగా గాలిలో కాల్పులు చేసే క్రమంలో ఒకరి చేతిలోని గన్ అకస్మాత్తుగా పేలింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
రాజకీయాలపై విభజన రేఖ!
జిల్లాల పునర్విభజన సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలపండిన ప్రజాప్రతినిధులు.. రాజకీయ దిగ్గజాల తలరాత మారనుంది. జూన్ 2 రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన నయా జిల్లాలకు ముహూర్తం ఖరారు చేయనుండడంతో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేతల భవితవ్యంపై సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు తొలిస్థానం ఉంటుందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ముఖ్యనాయకుల హవాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి నామినేటెడ్ పోస్టుపై కన్నేశారు. విభజనతో ఆయన కూడా పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారు. మారనున్న రాజకీయ సమీకరణాలతో ఆయన ఆశించిన పోస్టు దక్కించుకోవడం సస్పెన్స్‌గా మారనుంది. తూర్పు ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటు కానుండడంతో ఇబ్రహీంపట్నం జిల్లా కేంద్రంగా అవతరిస్తే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాభవం మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, క్యామ మల్లేశ్, టీఆర్ఎస్ సారథి నాగేందర్గౌడ్ల పరిధి నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతిని ధుల ప్రాబల్యం తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తనదైనశైలిలో రాణిస్తూ.. జిల్లాను ఒంటిచేత్తో నడిపిస్తున్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి విభజన రేఖ కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. తూర్పు, ఉత్తర ప్రాంతంలోనూ ప్రభావం చూపుతున్న మంత్రి.. కేవలం పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాండూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేందర్ జిల్లాల ఏర్పాటుతో పక్క జిల్లాల్లో జోక్యం చేసుకునే అవకాశం అంతంతమాత్రమే కానుండడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయన గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. ఒకవేళ జిల్లాలు ఏర్పాటు చేసినా.. ఆయా జిల్లాల్లో మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టకపోతే మా త్రం ఆయన హవాకు ఢోకా ఉండదు. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఎవరికైనా మంత్రివర్గంలో చోటుకల్పిస్తే.. అమాత్యుని ప్రాభవం తగ్గిపోవడం తథ్యం. చైర్‌పర్సన్‌కు తప్పని తిప్పలు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డికి కూడా ఈ పరిణామం కొత్త సమస్యలు సృష్టించనుంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న యాలాల మండలం కూడా ప్రతిపాదిత పశ్చిమ జిల్లాలో ఉండడంతో ఆమె ప్రభావం తగ్గనుంది. కానీ, జిల్లా పరిషత్ పాలకమండలిపదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే.. ఆమె హవాకు ఢోకా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి సబిత సుదీర్ఘకాలం చేవెళ్ల రాజకీయాలను శాసించారు. మహేశ్వరం, మహేశ్వరం నియోజకవర్గాలపై పట్టు సాధించారు. విభజన నేపథ్యంలో ఈ సెగ్మెంట్లు వేర్వేరు జిల్లాల్లో చేరితే ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కానుంది. ఇక సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేశారు. విభజన నేపథ్యంలో ఇక ఆయన అక్కడి రాజకీయాలపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వైరివర్గాలన్నీ ఒకే జిల్లాకు.. జిల్లాల డీలిమిటేషన్ గ్రూపు రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది. రాజకీయ ఉద్ధండులు ఉన్న వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర అభిప్రాయబేధాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి మహేందర్‌రెడ్డికి కొంత కాలంగా పొసగడంలేదు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో కూడా దాదాపుగా ఇంతే. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా ఈ ఇరువురికి అంత సఖ్యత లేదు. ఇలా ఎవరికివారూ తలపండిన నేతలు కావడం.. వారంతా ఒకే జిల్లాకు పరిమితం కానుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. - జిల్లాల విభజనతో ఉత్తర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో కూడా కేబినెట్ బెర్తులపై ఆశలు చిగురిస్తున్నాయి. - జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు జిల్లాలవారీగా కేటాయించే అవకాశం ఉండడం కూడా ఆశావహులను ఊహలపల్లకీలో ఊరేగింపజేస్తున్నాయి. - ప్రతిపాదిత తూర్పు, ఉత్తర జిల్లాల్లో శివారు నేతలే ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది. -
ద్రోహులకే మంత్రి పదవులా?: నాగం
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణ ద్రోహులని తిట్టిపోసిన వారికే ఇప్పుడు కేసీఆర్ మంత్రిపదవులు ఎలా ఇచ్చారో ప్రజలకు చెప్పాలని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని వాళ్లు, ఒక్కసారైనా తెలంగాణ జెండా పట్టనివాళ్లు, ఉద్యమకారులను అవమానపర్చిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పోరాడిన సొంతపార్టీ ఎమ్మెల్యేలను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు ఇవ్వటం యావత్తు తెలంగాణ వాదులను అవమానపర్చడమేనన్నారు. సమర్థులైన హరీశ్వర్రెడ్డిలాంటి వారు ఓడిపోయినా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని, వారిని కూడా పక్కనపెట్టి వేరే పార్టీ నుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. -
15 ఏళ్లుగా ప్రతిపక్షమే..!
కుల్కచర్ల, న్యూస్‌లైన్: మరోసారి పరిగి ఓటర్లు రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నమైన తీర్పునిచ్చారు. గత 15 సంవత్సరాలుగా పరిగి శాసన సభ్యుడు ప్రతిపక్షానికే పరిమితమవుతున్నాడు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డిని గెలిపించి ఓటర్లు అదే తీర్పును పునరావృతం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ గాలి వీచినా పరిగి నియెజకవర్గం ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఈసారి సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టారు. నియెజవర్గంలో ఐదు మండలాలు దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కే ఓటు వేసి ఉంటారని, హరీశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని టీఆర్ఎస్ శ్రేణులు భావించాయి. ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చి అందరికీ షాకినిచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. అయితే సార్వత్రికానికి వచ్చే సరికి తీర్పు మారడంతో టీఆర్ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అయితే వరుసగా ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డికే అవకాశం ఇవ్వడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్ఆర్ గెలవగా హరీశ్వర్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలిస్తే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని, కనీసం ఈసారైనా నియోజకవర్గానికి న్యాయం జరిగి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్‌ఆర్‌ను ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయన్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. -
మన తెలంగాణను మనమే పాలించుకోవాలి
పరిగి అసెంబ్లీ టీఆర్ఎస్ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పూడూరు, న్యూస్‌లైన్: బంగారు తెలంగాణ నిర్మాణం కేవలం టీఆర్ఎస్తోనే సాధ్యమని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని సోమన్గుర్తి, సిరిగాయపల్లి, కెవరెళ్లి, దేవనోనిగూడం, రాకంచర్ల, తిర్మలాపూర్, చీలాపూర్ తదితర గ్రామాల్లో శనివారం ఆయన ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నంత మాత్రాన మన ఆశయం నెరవేరదన్నారు. మన తెలంగాణను మనమే పాలించుకోవాలని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. హరీశ్వర్‌రెడ్డి సమక్షంలో రాకంచర్లకు చెందిన నాయకులు బీక్యా నాయక్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అజీం, నాయకులు పుడుగుర్తి మల్లేషం, జి.రాములు, సత్యనారాయణ, అమ్రాది శ్రీనివాస్‌గుప్త, సర్పంచులు మధుసూదన్, గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రుల పాలనలో నష్టపోయింది మనమే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీమాంధ్ర నాయకుల పాలనలో అత్యధికంగా నష్టపోయింది జిల్లా ప్రజలేనని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పరిగి ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు టీఆర్ఎస్ కృషి చేస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. గురువారం నగరంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, నాయకుడు పి.పురుషోత్తంరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన రాగానే రాష్ట్రంలో టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు వైఖరి మార్చాయని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమన్నారు. గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ను పటిష్టపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు కనిపించలేదే : స్వామిగౌడ్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పేరిట ఇప్పుడు కొందరు యాత్రలు చేపట్టడంపై ఎమ్మెల్సీ స్వామిగౌడ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ఒక్క రోజు కూడా కనిపించని నేతలు.. ఇప్పుడు తామే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చామని చెప్పుకుంటూ యాత్రలు చేపట్టడం హాస్యాస్పదమన్నారు. కేసీఆర్ పదమూడేళ్ల పాటు ఉద్యమాన్ని నడిపించి, ప్రాణాలను లెక్కచేయకుండా అమరణ దీక్ష చేసినందుకే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. 17 నుంచి పాదయాత్ర: నాగేందర్ గౌడ్ తెలంగాణ సాధనలో భాగంగా ఈ నెల 17నుంచి నాలుగు రోజులపాటు రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ వెల్లడించారు. శంషాబాద్ మండలం పాల్మాకుల నుంచి రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ వరకు దాదాపు 80 కిలోమీటర్లు యాత్ర సాగుతుందని, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అబ్దుల్ ముకిత్ చాంద్‌కు నియామక పత్రం అందజేశారు. -
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులదే కీలకపాత్ర
పరిగి, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాత్రి మండల కేంద్రంలోని టీటీడీ క ళ్యాణ మండపంలో తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కేతావత్ లక్ష్మణ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ ఈఓ హరిశ్చందర్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్, టీజీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబర్‌సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణలో అతిపెద్ద సంఘంగా టీజీయూఎస్ ఎదుగుతుందని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబర్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు కేతావ త్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి తిమ్యానాయక్ పేర్కొన్నారు. ఎస్టీలకు జిల్లా యూనిట్‌గా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన జాతి పేరుతో రిజర్వేషన్లు అనుభవిస్తున్నవారు జాతి అభివృద్ధికోసం, తండాల బాగుకోసం పాటు పడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మెడలువంచి హక్కులు సాధించుకుంటామన్నారు. ఓటు అనే ఆయుధంతో డిమాండ్లు నెరవేర్చుకుంటామన్నారు. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి(డీసీటీఓ) రాంచందర్ మాట్లాడుతూ.. సంఘాలు ఎన్ని కార్యక్రమాలు చేపడితే అంత బలోపేతమవుతాయన్నారు. గు ర్తింపు అడుకుంటే వచ్చేది కాదు... అది సా ధించుకోవాలన్నారు. మనం చేసే పనులే మ నకు గుర్తింపు తెచ్చిపెడతాయన్నారు. ఇతర గిరిజన ఉద్యోగులు, సంఘాలు, మేధావుల సలహాలు సూచనలు తీసుకుని టీజీయూఎస్‌ను మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. సంఘం సమస్యలతో పాటు తండాల్లోని ప్రజల సమస్యలు పట్టించుకోవాలన్నారు. డిప్యూటీఈఓ హరిశ్చందర్ మాట్లాడుతూ.. తండాల్లో వెనుకబడిన వారికోసం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో టీజీయూఎస్ , జిల్లాకు చెందిన ఆయా పాఠశాలల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు గోపాల్, రాములు, వెం కట్, హరిలాల్, రూప్సింగ్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, బాబాయ్య పాల్గొన్నారు. -
హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం తగదు
పరిగి, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శాసనసభకు పంపించిన ముసాయిదా బిల్లులో పలు అంశాలు తెలంగాణ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించేలా, అన్యాయం చేసేలా ఉన్నాయని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి టీటీడీ కల్యాణ మండపంలో ఆయా పార్టీలు, జేఏసీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించారు. ఇంగ్లిష్, తెలుగులో ఉన్న బిల్లు ప్రతులను సమావేశానికి హాజరైన వారందరికీ హరీశ్వర్ రెడ్డి అందజేశారు. ఆయా వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ చివరగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం కల్పించడం ఈ ప్రాంత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమేనని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇస్తుందని అన్నారు. అప్పుల పంపకం జనాభా ప్రాతిపదికన అంటే ఒప్పకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, పోర్టుల నిర్మాణాలతో అభివృద్ధి ఏ ప్రాంతంలో జరిగితే, ఆ ప్రాంతం వారే ఆ అప్పులు భరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని, ఆయితే తెలంగాణ ప్రాంతంలో చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటంతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్యాకేజీ తెలంగాణకే ఇవ్వాలి... రాష్ట్ర విభజన తర్వాత ఒకవేళ కేంద్రం ప్యాకేజీ ఇస్తే అది తెలంగాణకే ఇవ్వాలని హరీశ్వర్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగినందునే వేర్పాటువాదం తెరపైకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రానికే ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి మాత్రమే నిధులు సమకూర్చాలని స్పష్టం చేశారు. ఇక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే పదవీ విరమణ పొందుతారని, వారందరికీ పెన్షన్లు ఎక్కడినుంచి ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ అపాయింట్మెంట్ అయిన ఉద్యోగులను అక్కడికే పంపటంతో పాటు వారికి అక్కడే పింఛన్ చెల్లించే విధంగా బిల్లులో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా కన్వీనర్ సదానందం మాట్లాడుతూ గతంలో ఏర్పాటైన రాష్ట్రాల విషయంలో అనుసరించిన విధివిధానాలే తెలంగాణ విషయంలోనూ అనుసరించాలని అన్నారు. శాసనసభలో అనవసర రాద్ధాంతం చేస్తున్న వారిని సస్పెండ్ చేసి వెంటనే బిల్లుపై చర్చను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ నందకుమార్ యాదవ్, పరిగి మండల ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్, బీజేపీ తాలూకా కన్వీనర్ రాముయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రాంచందర్, విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాంలు, నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌వర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయారావు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు రామన్నమాదిగ, సత్యం, మోహనాచారి, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రాజధానిగా మూడేళ్లు చాలు
పరిగి, న్యూస్‌లైన్: హైదరాబాద్ నగరాన్ని మూడేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంచాలని, ఇదే తెలంగాణ ప్రజలు అంగీకరిస్తారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీశ్వర్‌రెడ్డి అన్నారు. పరిగిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా జేఏసీ, విద్యావంతుల వేదిక, టీఆర్ఎస్ సంయుక్తంగా జీఓఎంకు రాసిన లేఖ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ మూడు విభాగాలుగా విభజించబడి ఉందన్నారు. మొదటిది 1996 నుంచి ఉన్న నగర పాలక సంస్థ (ఎంసీహెచ్), రెండోది 2007 నుంచి ఉన్న గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ), మూడోది 2010 తరువాత ఏర్పాటు చేసిన (హెచ్ఎండీఏ) మెట్రో పాలిటన్ సిటీగా రూపాంతరం చెందిందన్నారు. 174 కిలో మీటర్ల పరిధితో నగర పాలక సంస్థగా ఉన్న హైదరాబాద్ ప్రాంతాన్ని మాత్రమే తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయాలని హరీశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. హెచ్ఎండీఏ పరిధిని ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రాంతం రెవెన్యూ, ఉద్యోగాలు, పాలనా పరంగా నష్టపోతుందన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాన్ని అనంతగిరి జిల్లాగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తూ వికారాబాద్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. తాండూర్‌ను మైనింగ్ జోన్‌గా గుర్తించటంతో పాటు అక్కడ కంది బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పేర్కొన్నారు. పాలమూరు ఎత్తిపోతల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు నిధులు మం జూరు చేసి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నగర శివారులోని రంగారెడ్డి పరిధిలో ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు. పరిగికి డిగ్రీ కళాశాల మంజూరు... పరిగికి ప్రభుత్వ డిగ్రీకళాశాల మంజూరైందని హరీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. త్వరలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభిస్తామన్నారు. పంటనష్టం సర్వేను సక్రమంగా నిర్వహించాలని, రచ్చబండ కార్యక్రమాన్ని అన్ని గ్రామా ల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ ఆంజనేయులు, విద్యావంతుల వేదిక నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, స్థానిక సర్పంచ్ విజయమాల, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
చంద్రబాబువన్నీ డ్రామాలే హరీశ్వర్‌రెడ్డి ధ్వజం
పరిగి, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చేటప్పుడు చంద్రబాబుకు తెలియదా తెలుగు ప్రజలు విడిపోతారని..? అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు తెలుగు ప్రజలు విడిపోతారంటూ తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగలటం ఆయనకే చెల్లిందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండలంలోని సయ్యద్‌పల్లిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. తెలంగాణ విషయంలో టీడీపీ, కాంగ్రెస్‌ల గిమ్మిక్కులను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణను అడ్డుకోవటం, జగన్‌ను బయటకు రాకుండా చూసేందుకే చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లి డ్రామాలాడారని విమర్శించారు. సీమాంధ్రకే సీఎంలా కిరణ్‌కుమార్‌రెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన వచ్చాక సీమాంధ్రలో సమావేశాలకు ఆయనే దగ్గరుండి అనుమతులిప్పించడం ఇందుకు ఉదాహరణ అని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా.. తెలంగాణ కోసం కష్టపడిన వారే అధికారంలో ఉంటేనే ఈ ప్రాంత పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. లేనిపక్షంలో మునుపటివలెనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉం టుందన్నారు. ఆంధ్ర ప్రాంత మంత్రులను చూసి తెలంగాణ మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వారు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే మన మంత్రులు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందంటూ జెండాలు ఎగురవేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణతోనే సాగునీరు సాధ్యం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలంగాణ ఏర్పాటుతోనే పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమని టీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. చేవెళ్ల ప్రాణహితతో పశ్చిమ జిల్లాకు నీరు రావటం కష్టమన్నారు. వచ్చిన తెలంగాణను దొంగల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అప్రమత్తంగా ఉండాలి: నాగేందర్ గౌడ్ జిల్లాలో టీఆర్ఎస్ను మరింత పటిష్టం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ ప్రకటించినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొందరు తొందరపడి పార్టీని వీడుతున్నారని, ఉద్యమం చేసేందుకు ఓపిక లేకే వెళ్లిపోతున్నారని విమర్శించారు. సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, పరిగి సర్పంచ్ విజయమాల, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, టీఎంయూ జాయింట్ సెక్రటరీ హన్మంతు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు యా దయ్య, పరిగి మండల అధ్యక్షుడు క్లెమెంట్, జిల్లా నాయకులు గౌస్, యేసుదాస్, కళ్యాణ్‌రావు, సర్పంచులు భాస్కర్, లింగమ్మ, నియోజకవర్గ నాయకులు బషీర్, బాబ్జీ, అనూష, ముకుంద్‌శేఖర్, బాబా, హన్మంతురెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తు మనదే..!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘కాంగ్రెస్‌లో విలీనమయ్యే అంశాన్ని పక్కనపెట్టండి. పార్టీ బలోపేతంపై దృష్టి సారించండి. తెలంగాణలో టీఆర్ఎస్కే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సర్వేలు కూడా ఇవే చెబుతున్నాయి. అందరికీ అవకాశాలు వస్తాయి. సమష్టిగా పనిచేయండి’ అని ఆ పార్టీ నేత, పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంటులో ‘టీ’ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే కాంగ్రెస్‌లో విలీనమయ్యే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినందున.. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. పన్నెండేళ్లుగా పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించామని, ఆర్థికంగా కూడా చితికిపోయామని, ఈ సమయంలో పార్టీని విలీనం చేస్తే తమ భవిష్యత్తు ఏమిటని పలువురు ఇన్చార్జులు హరీశ్వర్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించామనే ఖుషీ కంటే.. కాంగ్రెస్‌లో కలిపితే మన పరిస్థితేంటనేదే తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడుతున్నటు ్ల ముందస్తు సంకేతాలు వచ్చిన ప్పటికీ ఆయనను నిలువరించే ప్రయత్నం అధినాయకత్వం చేయకపోవడం సరైంది కాదని వికారాబాద్ నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విలీనమైతే మా సీట్లకు ఢోకాలేదని సీనియర్లు భావిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని.. కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోవాలని సూచించారు. కేసీఆర్ వెంటే నేను..! తెలంగాణ బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్‌ను నమ్మలేం. యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యంలేదు. ‘నేను కూడా పార్టీని వీడుతున్నట్లు ఊహ గానాలు వస్తున్నాయి. ఇది నిజం కాదు. పార్టీని ఎవరు వీడినా నేను మాత్రం వీడను. కేసీఆర్‌తోనే కలిసి సాగుతా..’ అని హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనమే. ఇలాంటి సమయంలో పార్టీని కాంగ్రెస్‌లో కలిపే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు. సెంటిమెంట్‌ను అనుకూలంగా మలుచుకొని ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ క్రెడిట్ మనదేనని, కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించే దిశగా నడుంబిగించాలన్నారు.