TS Hyderabad Assembly Constituency: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో.. హరీశ్వర్‌రెడ్డి అంతిమ వీడ్కోలు!
Sakshi News home page

ప్రజల కడసారి చూపులతో.. హరీశ్వర్‌రెడ్డి అంతిమ వీడ్కోలు!

Published Sun, Sep 24 2023 3:28 AM | Last Updated on Sun, Sep 24 2023 8:05 AM

- - Sakshi

వికారాబాద్‌: ఆయన ప్రజల నుంచి పుట్టిన నాయకుడు.. చివరి శ్వాస వరకు ప్రజాశ్రేయస్సు కోసమే తపించిన నేత.. రాష్ట్ర స్థాయిలో పరిగి నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టిన మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శుక్రవారం రాత్రి గుండె పోటుతో కన్నుమూశారు. ఐదు పర్యాయాలుగా ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఉమ్మడి రాష్ట్రంలో డిప్యూటీ స్పీకర్‌గా ఎదిగారు. ఆయన కడసారి చూపు కోసం అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో పరిగి వీధులు జనసంద్రాన్ని తలపించాయి.

రాజకీయ నేపథ్యం..
1947 మార్చి 18న పరిగి గ్రామంలో జన్మించారు హరీశ్వర్‌రెడ్డి. వార్డు మెంబర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1972 నుంచి 1977 వరకు ఉప సర్పంచ్‌గా, 1977– 83 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోపరిగి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగి కాంగ్రెస్‌ అభ్యర్థి అహ్మద్‌ షరీఫ్‌ చేతిలో 56 ఓట్ల స్వ ల్ప తేడాతో ఓటమి చెందారు. అనంతరం ఆయన టీడీపీలో చేరి 1985 మధ్యంతర ఎన్నికల్లో షరీఫ్‌పై 32,512 ఓట్ల మెజార్టీతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు.

1986–88 వరకు ఆగ్రో ఇండసీ్ట్రస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా, 1988–89 వరకు టీటీడీ బోర్డు మెంబర్‌గా పనిచేశారు. 1990 ఎన్నికల్లో కమతం రామ్‌రెడ్డి చేతిలో ఓటమి పాలైన కొప్పుల 1994, 1999, 2004, 2009 వరకు వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1997 నుంచి 2003 వరకు రాష్ట్ర ఆర్థిక సంస్థ అధ్యక్షుడిగా, 2003 నవంబర్‌ 14 వరకు ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2012 నవంబర్‌ 15న టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరి పొ లిట్‌ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు.

2014 ప్రత్యేక రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.రామ్మెహన్‌రెడ్డి చేతిలో 5,163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించారు. సీఎం కేసీఆర్‌తో అత్యంత సన్నిహితుల్లో హరీశ్వర్‌రెడ్డి ఒకరు. తను అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడంతో టీఆర్‌ఎస్‌ టికెట్‌ను పెద్ద కుమారుడు మహేశ్‌రెడ్డికి కేటాయించారు. ఆయన ప్రస్తుతం పరిగి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

ప్రజాదరణ పొందిన నాయకుడు..
కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రజాదరణ పొందిన నాయకుడు. నిత్యం ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరిస్తూ మంచి పేరు ప్రతిష్టలు గడించారు. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది నిరుపేదలకు సేవలందించారు.

పరిగి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం శ్రమించారు. ప్రజలను అన్న, తమ్మి, కాకా అంటూ వరుసలతో పిలుస్తూ కుటుంబ సభ్యుడిగా కలిసిపోయిన మహా నాయకుడు హరీశ్వర్‌రెడ్డి. ఏచిన్న కార్యమైనా.. ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి వారికి తన వంతుగా సాయమందిస్తూ ఉండేవారు. ఆయన లేడనే వార్తను ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖుల రాకతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement