భవిష్యత్తు మనదే..!
భవిష్యత్తు మనదే..!
Published Sun, Aug 18 2013 2:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘కాంగ్రెస్‌లో విలీనమయ్యే అంశాన్ని పక్కనపెట్టండి. పార్టీ బలోపేతంపై దృష్టి సారించండి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కే ఉజ్వల భవిష్యత్తు ఉంది. సర్వేలు కూడా ఇవే చెబుతున్నాయి. అందరికీ అవకాశాలు వస్తాయి. సమష్టిగా పనిచేయండి’ అని ఆ పార్టీ నేత, పరిగి ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్‌రెడ్డి శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పార్లమెంటులో ‘టీ’ బిల్లు ఆమోదం పొందిన తర్వాతే కాంగ్రెస్‌లో విలీనమయ్యే అంశాన్ని పరిశీలిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించినందున.. ఈ అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా గ్రామస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. పన్నెండేళ్లుగా పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించామని, ఆర్థికంగా కూడా చితికిపోయామని, ఈ సమయంలో పార్టీని విలీనం చేస్తే తమ భవిష్యత్తు ఏమిటని పలువురు ఇన్‌చార్జులు హరీశ్వర్‌ను ప్రశ్నించారు. ప్రత్యేక రాష్ట్రం సాధించామనే ఖుషీ కంటే.. కాంగ్రెస్‌లో కలిపితే మన పరిస్థితేంటనేదే తమకు ఆందోళన కలిగిస్తోందన్నారు. మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీని వీడుతున్నటు ్ల ముందస్తు సంకేతాలు వచ్చిన ప్పటికీ ఆయనను నిలువరించే ప్రయత్నం అధినాయకత్వం చేయకపోవడం సరైంది కాదని వికారాబాద్ నియోజకవర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ విలీనమైతే మా సీట్లకు ఢోకాలేదని సీనియర్లు భావిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని.. కష్టకాలంలో వెన్నంటి నిలిచిన కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పార్టీ నడుచుకోవాలని సూచించారు.
కేసీఆర్ వెంటే నేను..!
తెలంగాణ బిల్లు పెట్టేవరకు కాంగ్రెస్‌ను నమ్మలేం. యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యంలేదు. ‘నేను కూడా పార్టీని వీడుతున్నట్లు ఊహ గానాలు వస్తున్నాయి. ఇది నిజం కాదు. పార్టీని ఎవరు వీడినా నేను మాత్రం వీడను. కేసీఆర్‌తోనే కలిసి సాగుతా..’ అని హరీశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మనమే. ఇలాంటి సమయంలో పార్టీని కాంగ్రెస్‌లో కలిపే ప్రసక్తేలేదని ఆయన స్పష్టంచేశారు. సెంటిమెంట్‌ను అనుకూలంగా మలుచుకొని ప్రజల్లోకి చొచ్చుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ క్రెడిట్ మనదేనని, కాంగ్రెస్ మెడలు వంచి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని అన్నారు. సాధారణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించే దిశగా నడుంబిగించాలన్నారు.
Advertisement
Advertisement