
ద్రోహులకే మంత్రి పదవులా?: నాగం
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు తెలంగాణ ద్రోహులని తిట్టిపోసిన వారికే ఇప్పుడు కేసీఆర్ మంత్రిపదవులు ఎలా ఇచ్చారో ప్రజలకు చెప్పాలని బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా పాల్గొనని వాళ్లు, ఒక్కసారైనా తెలంగాణ జెండా పట్టనివాళ్లు, ఉద్యమకారులను అవమానపర్చిన వారిని మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిన అవసరం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ కోసం పోరాడిన సొంతపార్టీ ఎమ్మెల్యేలను కాదని వేరే పార్టీ నుంచి వచ్చిన తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులకు మంత్రి పదవులు ఇవ్వటం యావత్తు తెలంగాణ వాదులను అవమానపర్చడమేనన్నారు. సమర్థులైన హరీశ్వర్‌రెడ్డిలాంటి వారు ఓడిపోయినా మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని, వారిని కూడా పక్కనపెట్టి వేరే పార్టీ నుంచి వచ్చినవారికి పెద్దపీట వేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.