జిల్లాల పునర్విభజన సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలపండిన ప్రజాప్రతినిధులు.. రాజకీయ దిగ్గజాల తలరాత మారనుంది. జూన్ 2 రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన నయా జిల్లాలకు ముహూర్తం ఖరారు చేయనుండడంతో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేతల భవితవ్యంపై సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు తొలిస్థానం ఉంటుందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ముఖ్యనాయకుల హవాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి నామినేటెడ్ పోస్టుపై కన్నేశారు. విభజనతో ఆయన కూడా పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారు. మారనున్న రాజకీయ సమీకరణాలతో ఆయన ఆశించిన పోస్టు దక్కించుకోవడం సస్పెన్స్‌గా మారనుంది.
తూర్పు ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటు కానుండడంతో ఇబ్రహీంపట్నం జిల్లా కేంద్రంగా అవతరిస్తే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాభవం మరింత పెరిగే అవకాశం ఉంది.
బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, క్యామ మల్లేశ్, టీఆర్‌ఎస్ సారథి నాగేందర్‌గౌడ్‌ల పరిధి నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కానుంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతిని ధుల ప్రాబల్యం తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తనదైనశైలిలో రాణిస్తూ.. జిల్లాను ఒంటిచేత్తో నడిపిస్తున్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి విభజన రేఖ కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది.
తూర్పు, ఉత్తర ప్రాంతంలోనూ ప్రభావం చూపుతున్న మంత్రి.. కేవలం పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాండూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేందర్ జిల్లాల ఏర్పాటుతో పక్క జిల్లాల్లో జోక్యం చేసుకునే అవకాశం అంతంతమాత్రమే కానుండడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయన గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. ఒకవేళ జిల్లాలు ఏర్పాటు చేసినా.. ఆయా జిల్లాల్లో మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టకపోతే మా త్రం ఆయన హవాకు ఢోకా ఉండదు. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఎవరికైనా మంత్రివర్గంలో చోటుకల్పిస్తే.. అమాత్యుని ప్రాభవం తగ్గిపోవడం తథ్యం.
చైర్‌పర్సన్‌కు తప్పని తిప్పలు..
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డికి కూడా ఈ పరిణామం కొత్త సమస్యలు సృష్టించనుంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న యాలాల మండలం కూడా ప్రతిపాదిత పశ్చిమ జిల్లాలో ఉండడంతో ఆమె ప్రభావం తగ్గనుంది. కానీ, జిల్లా పరిషత్ పాలకమండలిపదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే.. ఆమె హవాకు ఢోకా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి సబిత సుదీర్ఘకాలం చేవెళ్ల రాజకీయాలను శాసించారు. మహేశ్వరం, మహేశ్వరం నియోజకవర్గాలపై పట్టు సాధించారు. విభజన నేపథ్యంలో ఈ సెగ్మెంట్లు వేర్వేరు జిల్లాల్లో చేరితే ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కానుంది. ఇక సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేశారు. విభజన నేపథ్యంలో ఇక ఆయన అక్కడి రాజకీయాలపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
వైరివర్గాలన్నీ ఒకే జిల్లాకు..
జిల్లాల డీలిమిటేషన్ గ్రూపు రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది. రాజకీయ ఉద్ధండులు ఉన్న వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర అభిప్రాయబేధాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి మహేందర్‌రెడ్డికి కొంత కాలంగా పొసగడంలేదు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో కూడా దాదాపుగా ఇంతే. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా ఈ ఇరువురికి అంత సఖ్యత లేదు. ఇలా ఎవరికివారూ తలపండిన నేతలు కావడం.. వారంతా ఒకే జిల్లాకు పరిమితం కానుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
- జిల్లాల విభజనతో ఉత్తర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో కూడా కేబినెట్ బెర్తులపై ఆశలు చిగురిస్తున్నాయి.
- జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు జిల్లాలవారీగా కేటాయించే అవకాశం ఉండడం కూడా ఆశావహులను ఊహలపల్లకీలో ఊరేగింపజేస్తున్నాయి.
- ప్రతిపాదిత తూర్పు, ఉత్తర జిల్లాల్లో శివారు నేతలే ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది.