Reorganization of districts
-
జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయ సేకరణ
-
ఈ నెలాఖరులోపు తుది నోటిఫికేషన్: విజయ్ కుమార్
సాక్షి, విజయవాడ: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజాభిప్రాయసేకరణ గడువు గురువారంతో ముగియనున్నట్లు ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు 7,500 సలహాలు కలెక్టర్లకు అందజేశారు. ఒక్క విజయనగరం జిల్లా నుంచే 4,500 సలహాలు, సూచనలు వచ్చాయి. తర్వాత అధికంగా కృష్ణా జిల్లా నుంచి సూచనలు అందాయి. అన్నిజిల్లాల సమీక్షలు ఈ రోజుతో ముగిశాయి. వీటన్నిటిని పరిశీలించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద తుది నిర్ణయం జరుగుతుంది. మార్చి నెలాఖరులోపు తుది నోటిఫికేషన్ ఇస్తాం. కొత్త జిల్లాలకు అధికారులు, ఉద్యోగుల విభజన పూర్తి చేస్తాం. మొత్తం 60 అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు వచ్చాయని' ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ వెల్లడించారు. చదవండి: (ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) -
అభివృద్ధి కోసమే మరిన్ని జిల్లాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయంపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. అభివృద్ధిపై మరింతగా దృష్టి పెట్టడం కోసం జిల్లాల పునర్విభజన ఉపకరిస్తుందని చెప్పారు. తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారని, ఆ మేరకు నేడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం నిర్ణయానికి వాడవాడలా మద్దతు లభిస్తోందన్నారు. నిర్ణయం వెలువడిన మొదటి రోజే ప్రజాచైతన్యం వెల్లువెత్తిందని అన్నారు. రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా మహిళా చైతన్యం కనిపించిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు ర్యాలీలు చేశారన్నారు. మహిళలు తొలినుంచీ సీఎం జగన్ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచీ అగ్రప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. తాను ఉమ్మడి ఏపీలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఓ నివేదికను అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కోరినట్లు చెప్పారు. ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. జనాభా పెరుగుతుండటం, బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభావశీలమైన పరిపాలన కోసం కొత్త జిల్లాల రూపకల్పన ఉపయోగపడుతుందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ ప్రయోజనాలను అందించడంపై దృష్టి పెడుతోందన్నారు. అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని ప్రజలంతా గుర్తించి వారి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంబరపడుతున్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు ఏ ప్రభుత్వానికైనా సహజమన్నారు. 100 శాతం అందరినీ మెప్పించటం ఎవరికైనా సవాలేనన్నారు. కానీ అందర్నీ మెప్పించేందుకు సీఎం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు. -
వరంగల్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను వరంగల్, హన్మకొండ జిల్లాలుగా రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పునర్వ్యవస్థీకరణలో భాగంగా రెండు జిల్లాల సరిహద్దులతోపాటు వాటి పరిధిలోని రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల్లో మార్పులు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి విజ్ఞప్తులతోపాటు పరిపాలన సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల ఏర్పాటు ప్రభావం ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీలపై, పాలకవర్గాలపై ఏమాత్రం ఉండదని స్పష్టం చేసింది. కొత్త పాలకవర్గాలు ఏర్పాటయ్యే వరకు ప్రస్తుత జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీల పాలక వర్గాలు కొనసాగుతాయని, పాత జిల్లాల ప్రాతిపదికనే వీటి అధికార పరిధి అమల్లో ఉంటుందని తెలిపింది. హన్మకొండ జిల్లా స్వరూపం... వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని వరంగల్ రెవెన్యూ డివిజన్లోని హన్మకొండ, ఖాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వెలేర్, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమలాపూర్, వరంగల్ రూరల్ జిల్లా.. పరకాల రెవెన్యూ డివిజన్లోని పరకాల, నడికుడ, దామెర, ఆత్మకూరు, శాయంపేట మండలాలతో కొత్తగా హన్మకొండ జిల్లా ఏర్పాటైంది. వరంగల్ జిల్లా స్వరూపం..: వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వరంగల్, ఖిలా వరంగల్, వరంగల్ రూరల్ జిల్లా.. వరంగల్ రూరల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సంగెం, గీసుగొండ, వర్ధన్నపేట, పర్వతగిరి, రాయపర్తి, నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ మండలాలతో కొత్త వరంగల్ జిల్లా ఏర్పాటైంది. -
ఓరుగల్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు జిల్లాల నామస్వరూపాలు మారనున్నాయి. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల కూర్పు, పేర్లను త్వరలో రాష్ట్ర ప్రభుత్వం మార్చబోతోంది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ రెండు జిల్లాలను మళ్లీ పునర్వ్యవస్థీకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ కార్యక్రమాలు సక్రమంగా, వేగంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2016 అక్టోబర్ 11న జిల్లాల పునర్వ్యవస్థీకరణ నిర్వహించి వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలతో సహా రాష్ట్రంలో 21 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 10 నుంచి 31కు పెరిగింది. ఇటీవల కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయడంతో మొత్తం జిల్లాల సంఖ్య 33కు చేరింది. అయితే స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలను మళ్లీ పునర్విభజించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ తూర్పు, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ప్రజలు తమకు వరంగల్ రాజధానిగా ఉండాలని కోరుకుంటున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ప్రజలందరికీ వరంగల్ నగరంతోనే సంబంధాలున్నాయి. చదువులు, వ్యాపారాలు, వైద్యం, ఇతర అవసరాల కోసం వారు నిత్యం వరంగల్ వస్తుంటారు. వరంగల్ రాజధానిగానే చాలా ఏళ్లపాటు జీవనం సాగింది. ఇది ఇలాగే కొనసాగాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. వరంగల్‌లోనే రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, ఎంజీఎం ఆస్పత్రి, కేఎంసీ, ఎనుమాముల మార్కెట్ ఉన్నాయి. విమానాశ్రయం కూడా పునరుద్ధరణ జరిగే అవకాశం ఉంది. కాబట్టి వరంగల్ రూరల్ జిల్లాకు వరంగల్‌ను రాజధానిగా చేయాలనే డిమాండ్ స్థానికంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని కూడా వరంగల్ రూరల్ జిల్లాలో కలిపి వరంగల్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేరుకు వరంగల్ అయినప్పటికీ వరంగల్‌లో ఒక్క ప్రభుత్వ కార్యాలయమూ లేకపోవడం వల్ల ఇక్కడ అభివృద్ధి కుంటుపడుతున్నది. కాకతీయల కాలం నుంచి వరంగల్ రాజధానిగా వెలుగొందింది. కాబట్టి వరంగల్ రాజధానిగా ఒక జిల్లా ఉండటం సముచితమని ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి, వరంగల్–హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, ప్రజల సౌకర్యార్థం, ప్రజాభీష్టం మేరకు వరంగల్, హన్మకొండ జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. వరంగల్ జిల్లా కార్యాలయాలన్నీ వరంగల్ తూర్పు నియోజకవర్గంలోనే ఏర్పాటు కానున్నాయి. హన్మకొండ జిల్లాగా వరంగల్ అర్బన్... వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ మాదిరిగానే హన్మకొండకు కూడా చారిత్రక ప్రాధాన్యం ఉంది. హన్మకొండ నగరం కాకతీయుల తొలి రాజధాని. కానీ నేడు హన్మకొండ పేరే కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. హన్మకొండకు ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా హన్మకొండ కూడా ఒక జిల్లాగా ఉండాలని, వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ రాజధానిగా ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. వరంగల్ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు వరంగల్ పేరును, హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాకు హన్మకొండ పేరును పెట్టాలని కోరారు. దీనివల్ల వరంగల్, హన్మకొండ నగరాలకున్న ప్రాధాన్యత, చారిత్రక గుర్తింపును పునరుద్ధరించినట్లు అవుతుందని భావించి సీఎం కేసీఆర్ సైతం సానుకూలంగా స్పందించారు. రెండు చోట్లా ప్రభుత్వ కార్యాలయాలు రావడం వల్ల నగరం నాలుగు దిక్కులా అభివృద్ధి చెందుతుందని, వరంగల్ నగరానికి వచ్చే వలసలు కూడా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది. యథాతథంగా జీవీఎంసీ! వరంగల్, హన్మకొండ జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ వరంగల్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)ను మాత్రం యథాతథంగా అదే పేరుతో కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ప్రస్తుతం 5 జిల్లాల్లో విస్తరించింది. ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి నగరాలు సైతం అనేక జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. వరంగల్ నగరం పరిధిలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కాబట్టి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని జిల్లాలు వచ్చినా నష్టం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. -
ఠాణా.. హైరానా
⇒గందరగోళంగా పోలీస్స్టేషన్ల గెజిట్ ⇒సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు వేలేరు పీఎస్‌లోకి ⇒వేలేరు స్టేషన్ చిల్పూరు సర్కిల్‌లోకి ⇒ముల్కనూర్‌కు పీఎస్‌కు మొండిచేయి భీమదేవరపల్లి: ఇంతకాలం ఎలాంటి అధికారం లేకుండా గడిపిన నూతన పోలీస్స్టేషన్లకు ప్రభుత్వం గెజిట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా పీఎస్‌ల ఎస్సైలకు ఎఫ్ఐఆర్ నమోదుకు అవకాశం వచ్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఈ గెజిట్ వ్యవహారం గజిబిజిగా, గందరగోళంగా మారింది. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెండు రెవెన్యూ గ్రామాలు నూతన వేలేరు పీఎస్‌లోకి, ముల్కనూర్ ఠాణా పరిధిలోని మూడు రెవెన్యూ గ్రామాలు వేలేరు పీఎస్ లో కలుపుతూ వచ్చిన గెజి ట్‌పై సందిగ్ధత నెలకొంది. జీఓ 38తో గెజిట్ జారీ జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో 92 నూతన పోలీస్స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఐనవోలు, వేలేరు, జనగామ జిల్లాలోని తరిగొప్పుల, చిల్పూరు ఠాణాలు గతేడాది ఆక్టోబర్ 11న ప్రారంభమయ్యాయి. ఈ స్టేషన్ల ఎస్సైలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారం లేకుండా కేవలం నామ్కేవాస్తుగానే ఉన్నారు. న్యాయస్థానం నుంచి ప్రభుత్వానికి ఠాణాల ఏర్పాటుపై గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నూతన ఠాణాలకు ఎఫ్ఐఆర్ నమోదుతో పాటుగా పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం జీఓఎంస్ 38 పేరుతో గెజిట్ జారీ చేసింది. వేలేరులోకి రెండు మండలాల గ్రామాలు నూతనంగా ఏర్పాటైన వేలేరు ఠాణాలో ధర్మసాగర్ మండలంలోని పీచర, మల్లికుదుర్ల, శోడషపల్లి, గుండ్లసింగారం, వేలేరు రెవెన్యూ గ్రామాలతో పాటుగా భీమదేవరపల్లి మండలంలోని ఎర్రబల్లి, కన్నారం గ్రామాలను కలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి గెజిట్‌లో మాత్రం ఈ గ్రామాలతో పాటుగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకొండ, మల్లారం, ముస్తఫాపూర్ గ్రామాలతో పాటుగా పూర్వపు భీమదేవరపల్లి మండలంలో ఉన్న కట్కూర్, చాపగానితండా గ్రామాలు పునర్విభిజనలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పీఎస్‌లో కలిపారు. అయినప్పటికి రెండు గ్రామాలను సైతం వేలేరు ఠాణాలో కలుపుతూ గెజిట్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముల్కనూర్‌కు మొండిచేయి... కాగా, భీమదేవరపల్లి మండలం 20 గ్రామాలతో ఉండేది. పునర్విభజనలో మండలంలోని కన్నారం, ఎర్రబల్లి గ్రామాలు వేలేరు మం డలంలోకి, కట్కూరు, చాపగానితండాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కలిశాయి. దీంతో భీమదేవరపల్లి మండలం 15 గ్రామాలకే పరిమితమయ్యాయి. ఇక ఇదే మండలంలో దివంగత ప్రధాని పీవీ నర్సింహరావు గ్రామం వంగరలో ఠాణా ఉంది. దీని పరిధిలో మాణిక్యాపూర్, వంగర, రత్నగిరి, రంగయపల్లి, రాంనగర్ గ్రామాలున్నాయి. ఇక ముల్కనూర్ ఠాణాకు మిగిలింది 10 గ్రామాలే. అందులో కొత్తకొండ, మల్లారం, ధర్మారం, ముస్తఫాపూర్ గ్రామాలను వేలేరు పీఎస్‌లోకి కలుపుతూ గెజిట్ వెలువడడంతో ఇక ముల్క నూర్ పీఎస్‌కు కేవలం ఆరు గ్రామాలే మిగలనున్నాయి. వేలేరు ఠాణా ఇప్పటివరకు ఎల్కతుర్తి సర్కిల్‌పరిధిలో ఉండగా చిల్పూరు పీఎస్‌ని సర్కిల్ చేసి అందులో వేలేరు ఠాణాను కలపనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు వేలేరు ఠాణాను భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు తరలించనున్నట్లు సమాచారం. ఏది ఎమైనా పోలీస్స్టేషన్ల గెజిట్ అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ముందస్తుకు పోతే కేసీఆర్‌కూ బాబు గతే
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సాక్షి, హైదరాబాద్: సర్వేల వాపును చూసి బలుపని భ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పొరపాటున ముందస్తు ఎన్నికలకు వెళితే గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం మఖ్దూం భవన్లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో పార్టీ నిర్మాణంపై సీపీఐ పార్టీ దృష్టి సారించిందని చెప్పారు. నవంబర్ 3 నుంచి 23 వరకు జిల్లాల వారీగా నిర్మాణ మహాసభలు నిర్వహించి, నవంబర్ 28 నుంచి 30 వరకు వరంగల్‌లో రాష్ట్ర పార్టీ నిర్మాణ మహాసభలను నిర్వహించాలని కార్యదర్శివర్గ సమావేశం నిర్ణయించిందన్నారు. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదమేర్పడిందని, కృష్ణా జలాలపై హక్కులను సాధించుకునేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
కొడంగల్‌లో 'కారు' చిచ్చు
అఖిలపక్ష, నియోజకవర్గ సాధన నాయకుల మండిపాటు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీరుపై అసహనం గ్రామాలకూ పాకిన నిరసన సెగలు నియోజకవర్గంలో చెలరేగిన విభజన సెగలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా రాత్రికిరాత్రే అధికార పార్టీ నాయకులు తమ ప్రాంతాన్ని ఇష్టానుసారంగా చీల్చారని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే తమ బతుకుల్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన‘కారు’లను చరిత్ర క్షమించదని హెచ్చరించారు. పునర్విభజనను నిరసిస్తూ గోకఫసల్వాద్లో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొడంగల్‌లో ఆందోళనకారులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేశారు. కొడంగల్: జిల్లాల పునర్విభజనలో కొడంగల్‌కు తీరని అన్యాయం జరిగిందని నిరసిస్తూ అఖిలపక్షం, కొడంగల్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పట్టణ మాజీ సర్పం చ్ రమేష్‌బాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్, అధ్యాపకుడు వేణుగోపాల్, దళిత సంఘం నాయకుడు రాజు, దస్తప్ప, శ్రీనివాస్ దీక్షలో కూర్చున్నారు. రంగారెడ్డి డీసీసీ అధికార ప్రతినిధి, బీసీ వెల్ఫేర్ లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, ఎమ్ఐఎం తాలూకా అధ్యక్షుడు గుల్షన్, కోస్గి ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరంలో కూర్చున్న వారికి తిరుపతిరెడ్డి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్‌కు జరిగిన అన్యాయాన్ని చరిత్ర క్షమించిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కావాలని కొడంగల్‌కు నామరూపాల్లేకుండా చేస్తున్నారని నిట్టూర్చారు. తమ నియోజకవర్గాన్ని పాలమూరులో ఉంచాలని డిమాండ్ చేశారు. బషీర్, చంద్రప్ప, కరెంటు రాములు, సురేష్, మహ్మద్ యూసూ ఫ్, నందారం ప్రశాంత్, శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఆందోళన తీవ్రరూపం... దౌల్తాబాద్: పునర్విభజన నేపథ్యంలో దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపడంపై అఖిలపక్షం నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. ఆదివారం ఆరో రోజు కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో పలు ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. గోకఫసల్వాద్లో కృష్ణ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి రెండు గంటలపాటు నిరసన తెలిపాడు. గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు రోడ్డుపై ధర్నా, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చల్లాపూర్ నుంచి మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. కొడంగల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరానికి చేరుకుని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని నారాయణపేట–కొడంగల్ రహదారిపై ఆందోళన చేశారు. వందలాది మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, కోస్గి మండల టీడీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, డీకే రాములు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఆరు రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధర్నాకు ఆయన రాకుండా తన సోదరుడిని పంపించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. వెంకట్‌రెడ్డి, వెంకట్రావు, మహిపాల్‌రెడ్డి, వెంకటయ్య, రెడ్డి శ్రీని వాస్, భీములు, మోహ నాయక్, విద్యావంతుల వేదిక కన్వీనర్ వెంకటేశ్, వీరన్న, హన్మిరెడ్డి ఉన్నారు. న్యాయపోరాటం చేస్తాం.. కొడంగల్: తమ నియోజకవర్గానికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా రాత్రికిరాత్రే తమ నియోజకవర్గాన్ని చీల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు హన్మంత్‌రెడ్డి, ప్రశాంత్, మహ్మద్ యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ పాలన.. ఇక ఆసక్తికరం
మూడు నెలలకోసారి అందరూ కలవాల్సిందే.. ఇక నుంచి సమావేశాలకు నలుగురు కలెక్టర్లు రావాలి.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు హాజరు కరీంనగర్ జెడ్పీ నుంచే నాలుగు జిల్లాల పర్యవేక్షణ వైద్యబిల్లులు, జీపీఎఫ్ రుణాలకు తప్పని ఇబ్బందులు ఉమ్మడి కరీంనగర్ నాలుగు జిల్లాలైనా... ఆ నాలుగు జిల్లాల అధికారులు, ప్రజాప్రతినిధులు మరో రెండున్నర సంవత్సరాల పాటు మూడు నెలలకోసారి కలిసే అవకాశం ఉంది. అందరూ కలిస్తే ఆ రోజు జిల్లా పరిషత్ పాలన ఆసక్తికరంగా మారనుంది. జిల్లాల పునర్విభజన జరిగినా జిల్లా పరిషత్ పాలనలో మాత్రం మరో రెండున్నరేళ్లు అంతగా మార్పు ఉండదు. కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సిబ్బందిని అలాగే ఉంచి ఒకే జెడ్పీ సీఈవోతో నాలుగు జిల్లాలను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు. ఇది కూడా కొన్ని చిక్కులను తెచ్చిపెట్టనుందనే ప్రచారం ఉన్నా... ముఖ్యంగా పాలనపై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ సాగుతోంది. ఈ నెల 11 నుంచి జిల్లాల విభజన అమల్లోకి రాగా... నాలుగు జిల్లాల్లో జెడ్పీపాలన తీరు తెన్నులు ఎలా ఉంటాయనేది అసక్తికరంగా మారింది. సాక్షి, కరీంనగర్ : ఏ జిల్లాలోనైనా గ్రామీణ ప్రాంతాలే అధికంగా ఉంటాయి. అందుకే ఈ గ్రామీణ ప్రాంతాలను పర్యవేక్షించే జిల్లా పరిషత్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ప్రత్యేకంగా జెడ్పీ అధ్యక్షులను నియమించి వారికి సహాయ మంత్రి హోదా కల్పిస్తారు. వీరి అధ్యక్షతన జిల్లా పరిధిలోని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో కలిసి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశాలను మినీ అసెంబ్లీ సమావేశాలుగా పిలుస్తారంటే వీటి ప్రాధాన్యం అంతటిది. అయితే జిల్లాల విభజన జరిగినా జెడ్పీ సమావేశాలను సుమారు మరో రెండున్నరేళ్లు కరీంనగర్‌లోనే నిర్వహించనున్నారు. ప్రస్తు తం జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించినా... ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించే జెడ్పీ సర్వసభ్య సమావేశాలకు, స్థాయి సంఘ సమావేశాలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా కరీంనగర్‌కు రావాల్సిందే. సభ్యుల ప్రాంతాలు వేరే జిల్లాలో ఉన్నా సమావేశాలకు మాత్రం కరీంనగర్‌కు రావాలి. కలెక్టర్లు లేదా జేసీలు తప్పనిసరి.. కీలక ప్రజాప్రతినిధులంతా హాజరయ్యే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి సాధారణంగా అధికారయం త్రాంగం తరపున జిల్లా కలెక్టర్ హాజరవుతారు. ఒకవేళ కలెక్టర్ రాని పరిస్థితులలో జాయింట్ కలెక్టర్ హాజరవుతారు. నాలుగు జిల్లాలు ఏర్పడటంతో కరీం నగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు నలుగురు జెడ్పీ సమావేశ వేదికపై ఆసీనులు కావాల్సిందే. అన్ని ప్రభుత్వ శాఖల జిల్లాస్థాయి అధికారులు జెడ్పీ సమావేశానికి రావల్సిందే. జిల్లాలో దాదాపు 50కిపైగా ప్రధాన శాఖలుండగా, అనుబంధ శాఖలన్నింటిని కలిపి ఒకే శాఖగా మార్చడంతో నాలు గు జిల్లాల అధికారులంతా హాజరుకావాల్సి ఉంటుం ది. దీంతో జెడ్పీ సమావేశాలకు స్థలం సరిపోయే పరిస్థితి కన్పించడం లేదు. సమావేశాల్లో అజెండా వారిగా ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు సభావేదికపైకి ఎక్కి సమాధానాలు ఇస్తుం టారు. ఇకనుంచి నాలుగు జిల్లాలకు సంబంధించి నలుగురు చొప్పున అధికారులు వేదికపైకి ఎక్కి ఏ జిల్లా సభ్యుడు ప్రశ్ని అడిగితే ఆ జిల్లాకు చెందిన అధికారి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిసే రోజు... ఉమ్మడి కరీంనగర్ నుంచి విడిపోయిన నాలుగు జిల్లాల ప్రజాప్రతినిధులు కలిసేది ఆ ఒక్కరోజే. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం దానికి వేదిక. కరీంనగర్ జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలుగా ఏర్పడగా... ఈ జిల్లాకు చెందిన సుమారు పదకొండు మండలాలు భూపాలపల్లి, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాలకు వెళ్లాయి. ఈ ఏడు జిల్లా ల్లో ఉన్న 57 మంది జెడ్పీటీసీ సభ్యులు జెడ్పీ సమావేశానికి హాజరవుతారు. అదేవిధంగా జగిత్యాల జిల్లాకు చెందిన జెడ్పీ చైర్మన్ తుల ఉమ అధ్యక్షతన జరిగే సమావేశానికి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రాజేం దర్, కేటీఆర్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు కల్వకుంట్ల కవిత, బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్, ఐదుగురు ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, స్వామిగౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, భానుప్రసాద్‌రావు, సంతోష్‌కుమార్, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వొడితెల సతీష్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, బొడిగె శోభ, రసమయి బాలకిషన్, సోమారపు సత్యనారాయణ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, పుట్ట మధు హాజరుకానున్నారు. జిల్లా విడిపోయిన తర్వా త మూడు నెలలకోసారి జరిగే సమావేశం మహామహుల హాజరుతో కలర్ఫుల్గా కనిపించనుంది. వైద్యబిల్లులు, జీపీఎఫ్ రుణాలకు ఇబ్బందే... జెడ్పీ దస్త్రాలపై జెడ్పీ అధ్యక్షుడి సంతకంతోపాటు చాలా ఫైళ్లపై జిల్లా కలెక్టర్ ఆమోదం తప్పనిసరి కావడంతో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకు పంపే దస్త్రాలలో కొంత ఇబ్బందులు తప్పవు. ఎక్కడి జిల్లాలో అక్కడి సభ్యులతో జెడ్పీ సమావేశం నిర్వహిస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నా... అలా చేస్తే పాలకవర్గంలో సరిపడా కోరం ఉండదు. కనుక ఇది సాధ్యపడదు. ఎందుకంటే కోరం ఉంటెనే జెడ్పీ సమావేశం నిర్వహించాలి. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో జెడ్పీ సీఈవో ఉండాల్సిందే. అయితే నాలుగు జిల్లాలకు ఒకే సీఈవో హాజరు కాలేరు కనుక తక్కిన మూడు జిల్లాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారని భావిస్తున్నారు. సీఈవో మాత్రం నాలుగు జిల్లాలకు ఒక్కరే ఉంటారు. పంచాయతీ రాజ్ ఉద్యోగులకు వైద్యబిల్లులు రూ.50 వేలలోపు ఉంటే జెడ్పీ సీఈవో మంజూరీ చేస్తారు. దాటితే కలెక్టర్ ఆమోదిం చాక జెడ్పీ సీఈవో ఆ బిల్లు మంజూరీ చేస్తారు. జిల్లావ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయాలు జెడ్పీ పాఠశాలల బోధనేతర సిబ్బంది, ఆర్‌డబ్లు్యఎస్, పీఆర్ ఇంజనీరింగ్ విభాగాల కార్యాలయాల్లో 1500–2000 మంది పంచాయతీరాజ్ ఉద్యోగులున్నారు. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల ఉద్యోగులకు వైద్యబిల్లులు చెల్లింపులలో ఇబ్బందులు తప్పవు. -
అర్ధరాత్రి తర్వాత కొత్త జిల్లాల ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జారీ చేసింది. హైదరాబాద్ మినహాయిస్తే...రాష్ట్రంలోని మిగిలిన 9 జిల్లాలను 30 కొత్త జిల్లాలుగా పునర్విభజిస్తూ జిల్లాల వారీగా తుది ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్ చంద్ర జారీ చేశారు. ఆ వెంటనే కొత్త జిల్లాలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, కొత్తగా ఏర్పడిన 6 పోలీసు కమిషనరేట్లకు పోలీసు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు మూకుమ్మడిగా ఉత్తర్వులు జారీ చేశాయి. -
‘కొత్త’ కమిటీలపై పార్టీల కసరత్తు
జిల్లాల స్వరూపం మార్పుతో రద్దు కానున్న ప్రస్తుత కమిటీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో తదనుగుణంగా కొత్త జిల్లాల్లో కమిటీల ఏర్పాటుపై అన్ని రాజకీయ పార్టీలు తలమునకలయ్యాయి. మొత్తంగా 31 జిల్లాలు ఏర్పడవచ్చన్న ప్రభుత్వ సంకేతాలతో పార్టీ వ్యవస్థలను మార్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పాత జిల్లాల స్వరూపం, పరిధి మారనున్నందున ప్రస్తుతమున్న అన్ని పార్టీల జిల్లా కమిటీలు రద్దు కానున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ, సీపీఎంలు కొత్త జిల్లాల్లో పార్టీ కార్యదర్శులను, బీజేపీ, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు జిల్లాల పార్టీ అధ్యక్షులను కొత్తగా నియమించుకోవాల్సి ఉంది. దీనిపై ఆయా పార్టీల నేతలు ఏమన్నారంటే... నెలాఖరుకల్లా కమిటీలు కొత్త జిల్లాల ఏర్పాటునకు అనుగుణంగా ఈ నెలాఖరులోగా కొత్త జిల్లాల పార్టీ అధ్యక్షులు, కార్యవర్గాలను నియమించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రస్తుతం ఎంపిక కసరత్తు సాగుతోంది. కొత్త జిల్లాలు, వాటి భౌగోళిక స్వరూపం తదితరాలను పరిశీలించి కమిటీల నియామకం పూర్తి చేస్తాం. - ఎల్.రమణ, టీటీడీపీ అధ్యక్షుడు నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో... ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల మొదట్లో కొత్త జిల్లాల కమిటీలు వేస్తాం. కొత్త జిల్లాల ప్రకటన వెలువడ్డాక ఈ నెల 15, 16, 17 తేదీల్లో పాత జిల్లాల కార్యవర్గ సమావేశాలల్లో ఆయా అంశాలపై చర్చిస్తాం. జిల్లాల నైసర్గిక స్వరూపం, పరిధిని బట్టి కొత్త కమిటీలను ఏర్పాటుచేస్తాం. కొత్త వారికి అవకాశమిస్తాం. - కె.లక్ష్మణ్, బీజేపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సూచనలకు అనుగుణంగా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించి ఆయన సూచనలు, సలహాలకు అనుగుణంగా జిల్లాల కమిటీల్లో మార్పులు చేస్తాం. కొత్త జిల్లాలనుబట్టి నూతన జిల్లాల కమిటీలను ఏర్పాటు చేసుకుంటాం. పార్టీ అవసరాలకు అనుగుణంగా సంస్థాగత మార్పులతోపాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కమిటీల్లో మార్పులు చేస్తాం. - గట్టు శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు నవంబర్ 22కల్లా సిద్ధం వచ్చే నెల 22 నాటికి కొత్త జిల్లాలన్నింటికీ కొత్త కమిటీలు వేస్తాం. అప్పటివరకు ప్రస్తుత జిల్లాల కమిటీల కార్యదర్శులే వారి పరిధిలో ఏర్పడే జిల్లాలకు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. పార్టీ జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రస్తుతం గ్రామ, మండల, జిల్లా, రాష్ర్టస్థాయి నిర్మాణ మహాసభలు నిర్వహిస్తున్నాం. - చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ కార్యదర్శి అధికారికంగా వెల్లడయ్యాకే... కొత్త జిల్లాల ఏర్పాటును అధికారికంగా ప్రకటించాక వాటి పరిధి ఇతర అంశాలపై చర్చించి కొత్త కమిటీలపై నిర్ణయిస్తాం. ప్రభుత్వం మొదట పేర్కొన్నట్లుగా 27 జిల్లాలకు కమిటీలను ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ జిల్లాల సంఖ్యలో మార్పుచేర్పుల నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నాం. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం కార్యదర్శి -
జనాభాలో ఫస్ట్... విస్తీర్ణంలో లాస్ట్
జిల్లాల పునర్విభజన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమిది * విస్తీర్ణపరంగా అగ్రస్థానంలో నల్లగొండ * జనాభాలో అతి చిన్న జిల్లాగా సిరిసిల్ల సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరమే అత్యధిక జనాభా గల జిల్లాగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా 39.43 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (25.51 లక్షలు), మేడ్చల్(మల్కాజిగిరి) (25.51 లక్షలు) ఉన్నాయి. అతి తక్కువ జనాభా గల జిల్లాగా రాజన్న (సిరిసిల్ల) జిల్లా ఏర్పాటు కానుంది. జనాభాపరంగా మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్.. విస్తీర్ణంలో మాత్రం 217 చదరపు కిలోమీటర్ల పరిధితో చిన్న జిల్లాగా మిగలనుంది. నల్లగొండ జిల్లా 6,862.78 చ.కి.మీ. విస్తీర్ణంతో అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. భూపాలపల్లి(జయశంకర్ జిల్లా) 6,175.21 చ.కి.మీ. పరిధితో రెండోస్థానంలో, రంగారెడ్డి జిల్లా (5,005.98 చ.కి.మీ.) మూడో స్థానంలో నిలిచింది. -
అలంపూర్‌ను వనపర్తిలో కలపొద్దు
హైపవర్ కమిటీకి ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌ల వినతి సాక్షి, హైదరాబాద్: రెండు నదుల మధ్య ఉన్న అలంపూర్, గద్వాల (నడిగడ్డ) నియోజకవర్గాలను యథాతథంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, రాజకీయ ప్రయోజనాల కోసం అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో చేర్చితే చారిత్రక తప్పిదమవుతుందని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సభ్యులకు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌కు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, జోగులాంబ జిల్లా కోసం ఉద్యమాలు చేసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయితే అలంపూర్ నియోజకవర్గంతోపాటు కొత్తగా ఏర్పాటు కానున్న ఉండవల్లి మండలాన్ని వనపర్తిలో కలుపుతున్నారని వచ్చిన వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దేవాలయం ఉన్న అలంపూర్ లేకుండా జోగులాంబ జిల్లా ఏర్పాటు చారిత్రక తప్పిదమవుతుందన్నారు. తప్పిదాలకు తావులేకుండా గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాకు సరైన రూపం ఇవ్వాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించామన్నారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ, అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారనే వార్తలతో.. జోగులాంబ జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్న సంతోషం నాలుగు రోజుల్లో మటుమాయమైందన్నారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను సంపూర్ణంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, అలా చేయని పక్షంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసినట్లవుతుందని అన్నారు. -
కొత్తగా 82 పోలీస్స్టేషన్లు: నాయిని
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 82 పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే పోలీసు కమిషనరేట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లను, రామగుండం, మంచిర్యాల పట్టణాలను కలిపి మరో కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన జిల్లాలకు సిబ్బంది సర్దుబాటు, నూతన స్టేషన్లు తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 118 కొత్త మండలాలు ఏర్పడుతున్నాయని, వాటికి అనుగుణంగా 82 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే 23 సర్కిళ్లు, 22 సబ్ డివిజన్ల ఆవశ్యకత ఉందన్నారు. కొత్త కమిషనరేట్లుగా కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేటలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే మంచిర్యాల, రామగుండం ప్రాంతాలు పెద్దవిగా ఉండటం చేత రెండు పట్టణాలను కలిపి కమిషనరేట్ చేయాల్సిన అవసరముందన్నారు. అనంతరం హోం మంత్రి నాయిని మాట్లాడుతూ పెద్ద జిల్లాలకు సీనియర్ అధికారులను, చిన్న జిల్లాలకు కింది స్థాయి అధికారులను కేటాయించాలని డీజీపీకి సూచించారు. హోంశాఖకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందుకే కొత్త వాహనాలు, స్టేషన్ల నిర్వహణ ఖర్చులతో పాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, వరంగల్ కమిషనర్ సుధీర్‌బాబులతో పాటు సీనియర్ అధికారులు, జిల్లాల ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు. -
పౌరసరఫరాల సిబ్బంది సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు కొత్తగా వచ్చేవి కలిపి మొత్తంగా 27 జిల్లాలకు అవసరమైన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సర్దుబా టు చేసేందుకు శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పౌరసర ఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, తూనికలు- కొలతల శాఖలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు మొదలు, కింది స్థాయి ఉద్యోగుల వరకు మార్పులు చేర్పులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని, అధికారులనే అన్ని జిల్లాలకూ సర్దుకోవాల్సి ఉందని ఆ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారంలోనే వీరికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పోస్టుల పేర్లు మార్పు... ఇప్పటి దాకా జిల్లా స్థాయిలో ఉండే జిల్లా సరఫరాల అధికారులు(డీఎస్ఓ) ఇక నుంచి జిల్లా పౌరసరఫరాల అధికారులుగా (డీసీఎస్ఓ)గా మారనున్నారు. సహాయ సరఫరాల అధికారులు(ఏఎస్ఓ) సహాయ పౌరసరఫరా అధికారులు(ఏసీఎస్ఓ) అవుతారు. ప్రస్తుతం పదిమంది డీఎస్ఓలు అందుబాటులో ఉండ గా, మరో 17 మంది కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థకు జిల్లా అధికారులుగా ఉండే జిల్లా మేనేజర్ల(డీఎం)ను అదే పేరున పిలుస్తారు. కాకుంటే ప్రస్తుతం ముగ్గురు డీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గ్రేడ్-1 పోస్టుల్లో 12మంది సహాయక మేనేజర్లు ఉ న్నారు. వీరు కాకుండా మరో 12 మందికి పదోన్నతులిస్తారు. డీఎం పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్లకే పోస్టింగులిచ్చి, ఇన్చార్జి డీఎంలు గా పరిగణించాలని నిర్ణయించారు. అయితే ధాన్యం సేకరణ అధికంగా ఉండే జిల్లాలకు మూడు జెడ్ఎం పోస్టులను కేటాయించడం తోపాటు 10చోట్ల మేనేజర్లకు పోస్టింగులిచ్చి, మిగిలిన 14 జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్లనే ఇన్చార్జి మేనేజర్లుగా నియమించనున్నారు. ఇకనుంచి డీఎల్‌ఎంఓ... జిల్లా తూనికలు కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ)కి జిల్లా స్థాయిలో ఇన్స్పెక్టర్లు అధికారులుగా ఉన్నారు. ఇకనుంచి వారి ని జిల్లా లీగల్ మెట్రలాజికల్ ఆఫీసర్ (డీఎల్‌ఎంఓ)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం 14మంది జిల్లా స్థాయి ఇన్‌స్పెక్టర్లున్నారు. మిగిలిన చోట్ల ఇన్స్పెక్టర్లకే బాధ్యతలు అప్పజెబుతారు. కానీ వీరిని ఇన్‌స్పెక్టర్లుగానే పరిగణిస్తారు. మరో వైపు మండల స్థాయిలో ఉండే పౌరసరఫరాల స్టాక్ పాయింట్లు (ఎంఎల్ఎస్) వద్ద సిబ్బంది కొరత ఈ శాఖను తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రెవె న్యూ శాఖ నుంచి డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను డిప్యుటేషన్‌పై తీసుకునే ప్రక్రియను ఇకముందూ కొనసాగిస్తారు. వీరిని ఎంఎల్ఎస్ పాయింట్ల కు ఇన్చార్జులుగా వ్యవహరిస్తారు. -
జిల్లాలపై చర్చకు రా: డీకే అరుణ సవాల్
- రెండు రోజులు ఇందిరాపార్కు దగ్గరే ఉంటా.. - అల్లుడు, కూతురు, కొడుకు ఎవరొచ్చినా చర్చిస్తా.. - సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సవాల్ సాక్షి, హైదరాబాద్: ‘రెండు రోజులపాటు ఇందిరాపార్కు దగ్గరే ఉంటా. జిల్లాల పునర్విభజనపై ఇక్కడకొచ్చి నిజాలు చెప్పడానికి దమ్ముంటే సీఎం కేసీఆర్ రావాలి. రాలేకపోతే ఆయన కొడుకో, కూతురో, అల్లుడో ఎవరు వస్తారో తేల్చుకోవాలి. ఎవరు వచ్చినా జిల్లాల ఏర్పాటులో అశాస్త్రీయత, ప్రజల ఇబ్బందులు, టీఆర్ఎస్ రాజకీయ స్వార్థం బయటపెడతా. ఎయిర్‌పోర్టులో కాదు సవాళ్లు.. అఖిలపక్షం పెడితే కేసీఆర్ అసలు రంగు బయటపెడతా’ అని మాజీ మంత్రి, గద్వాల శాసనసభ్యురాలు డీకే అరుణ ప్రకటించారు. గద్వాల, జనగామ జిల్లాల కోసం డీకే అరుణ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 48 గంటల నిరాహారదీక్షకు దిగారు. సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో సీఎల్పీ నేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజనలో అశాస్త్రీయత, రాజకీయ కుటిలత్వాన్ని బయటపెడతానన్నా రు. జిల్లాల పునర్విభజనపై కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. జిల్లాల ముసాయిదాలో చాలా అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందని, అయినా కాంగ్రెస్ పార్టీ ఆమోదం చెప్పిందనే లా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు. మార్గదర్శకాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ప్రజల అవసరాలు, శాస్త్రీయత, భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం ఒక రాజులా జిల్లాలను ముక్క లు చేస్తున్నారని, వాటిని సామంత రాజ్యాలుగా చేసి ఒక్కొక్కరికీ అప్పగించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ మం త్రుల కోసమా.. ప్రజల కోసమా.. అని ప్రశ్నించారు. వీటిని ప్రశ్నిస్తే సీఎంగా ఉన్న కేసీఆర్ వీధి రౌడీలా సవాళ్లు విసురుతున్నారన్నారు. కేవలం 30 లక్షల జనాభా ఉన్న మెదక్‌ను మూడు జిల్లాలు చేసిన కేసీఆర్.. ఆయన్ను ఎంపీగా గెలిపించిన పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని అరుణ ఆరోపించా రు. మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు: భట్టి రాష్ట్రంలోని ఎన్నో సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారని భయపడుతున్న కేసీఆర్ నిత్యం వారిని పక్కదారి పట్టిస్తున్నారని భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రజల అవసరాలపై సోయితో పాలించకుంటే టీఆర్ఎస్కు శంకరగిరి మాన్యాలు తప్పవని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాత్రి పూట మూడు మాటలు చెప్పేవారి మాటలు నమ్మి కేసీఆర్ మోసపోతున్నారని, తలతిక్క పనులు చేస్తే మెడలు వంచే శక్తి ప్రజలకు ఉందని హెచ్చరించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని ఓడిపోతారనే భయంతో సనత్‌నగర్‌లో ఇళ్లు కట్టించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ బుర్రకు వచ్చిందే నిర్ణయం: చాడ సీఎం కేసీఆర్‌కు బుర్రలో ఏ ఆలోచన వస్తే అదే బాటలో నిర్ణయం తీసుకుంటున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మండలాలు, రెవెన్యూ, జిల్లాల విభజనలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాల విభజనలో విధివిధానాలు శాస్త్రీయంగా ఉండాలని, ప్రజల అవసరాలు, మనోభావాలు, వనరులను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల విభజనలో దూరదృష్టి ఉండాలని సూచించారు. మారకుంటే బొంద పెడతారు పొన్నాల లక్ష్మయ్య ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పా టైన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశపాలన సాగిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం వెర్రి చేష్టలు చేస్తోందన్నారు. తీరు మార్చుకోకుంటే కేసీఆర్‌ను, టీఆర్ఎస్ను ప్రజలే బొంద పెడతారని హెచ్చరించారు. జనగామను జిల్లా చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. శాస్త్రీయతను గాలికొదిలేశారు జానా, షబ్బీర్ జిల్లాల పునర్విభజనపై శాస్త్రీయ ధృక్ఫథాన్ని, పద్ధతులను కేసీఆర్ గాలికి వదిలేశారని జానారెడ్డి, షబ్బీర్‌అలీ అన్నా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గండి కొడుతున్నారని, గద్వాల, జనగామ ప్రజాభిప్రాయం మేరకు వాటిని జిల్లాలుగా ప్రకటించాలన్నారు. కేసీఆర్‌కు అబ ద్ధాలు చెప్పకుంటే నిద్రరాదని షబ్బీర్‌అలీ విమర్శించారు. అడ్డగోలుగా జిల్లాల విభజన చేస్తున్నారన్నారు. డీకే అరుణకు భయపడి ప్రభుత్వం గద్వాలను జిల్లా చేయకుండా అడ్డుకుంటోందన్నారు. జిల్లాల పునర్విభజనను సింగిల్ జడ్జి కమిషన్‌తో పూర్తి చేయాలన్నారు. -
'కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు'
హైదరాబాద్: తెలంగాణలో జిల్లాల పునర్విభజన ఏక పక్షంగా జరుగుతోందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్నారు. 371డి ఆర్టికల్ జోనల్ విధానాన్ని విస్మరించడం సరికాదని తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇబ్బంది కలగకుండా జిల్లాల ఏర్పాటు జరగాలని సూచించారు. గద్దాల, జనగామ, ఎల్లంపల్లి, రామగుండంను జిల్లా కేంద్రాలుగా చేయాలన్నారు. 15 రోజుల్లో మరోసారి ఆల్ పార్టీ మీటింగ్ హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలని చాడ వెంకటరెడ్డి తెలిపారు. -
సీఎం సమాధానం చెప్పాలి
♦ అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని ఎందుకు పిలవలేదు: గట్టు ♦ రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాల విభజన ♦ కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ ♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమాధానం చెప్పాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని ఆహ్వానించనందుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘నిశ్శబ్ద నిరసన’ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము చూస్తూ కూర్చోబోమని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపున్న పార్టీని, ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ‘టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటూ ఎర్రబెల్లి దయాక ర్రావు చట్టసభలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. అలాంటి టీడీపీని అఖిలపక్ష భేటీకి ఎలా పిలిచారు? టీఆర్ఎస్కు టీడీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి? ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విలీనం చేసుకోవడం.. ఆ పార్టీ లేదంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఎనలేని గౌరవమని తరచూ చెప్పే సీఎం ఆ రాజ్యాంగాన్నే ఎందుకు ఉల్లఘిస్తున్నారు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలి... అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని పిలవనందుకు క్షమాపణ చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. త్వరలో తాము కోర్టులో వేసే పిటిషన్‌కు ప్రభుత్వమే కదులుతుందని చెప్పారు. కేసీఆర్ మోసపు, అహంకార పాలనను సాగనివ్వమని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ కుటుంబ పాలనకు అంతం పలకాలని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలంతా తొలుత బోట్‌క్లబ్ నుంచి ప్రదర్శనగా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని.. అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, జె.మహేందర్‌రెడ్డి, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె.అమృతసాగర్ (మహిళా విభాగం), బండారి వెంకట రమణ (సేవాదళ్), బి.శ్రీవర్దన్‌రెడ్డి (ఐటీ విభాగం), నర్ర భిక్షపతి (ట్రేడ్ యూనియన్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (డాక్టర్స్ విభాగం), జిల్లాల అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్), ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), నాడెం శాంతికుమార్ (వరంగల్), తుమ్మలపల్లి భాస్కర్‌రావు (నల్లగొండ), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి (రంగారెడ్డి), అక్కెనపల్లి కుమార్ (కరీంనగర్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), ఇతర నాయకులు శ్యామల (గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు), డాక్టర్ మవీన్, పి.బాలక్రిష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, రహీమ్ షరీఫ్ పాల్గొన్నారు. పలువురు నేతల అరెస్ట్ నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పొలీసులు అరెస్టు చేశారు. గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కార్యకర్తలు, నాయకులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి డిచార్జ్ అయ్యారు. ఇక నేతలు కె.శివకుమార్, కె.అమృతసాగర్, ఎం.శ్యామల, భగవంత్‌రెడ్డి, కేసరి సాగర్, హిరాణిరెడ్డి, మేరి, విష్ణుప్రియ, ఇందిరారెడ్డి, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఎంతకాలం మోసం చేస్తారు? బీడు భూములకు నీరు, లక్ష ఉద్యోగాలు అని హామీలు గుప్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు నీరివ్వలేదని, ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పూటకో మాట, వారానికో ప్రకటన చేస్తూ ప్రజల్ని ఎంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు. మండలాల ప్రాతిపదికన జిల్లాల విభజన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం మేరకు జరిగే విభజనను మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ ప్రాతిపదికన టీఆర్ఎస్లో చేర్చుకున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. -
నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
-
జిల్లాల పునర్విభజనపై నేడే అఖిలపక్షం
సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో అంకానికి తెరలేస్తోంది. ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీల సూచనలు తీసుకునేందుకు శనివారం సచివాలయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీతోపాటు ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయా రాజకీయ పక్షాలు తమ ఎజెండాల తో ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. కాగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందకపోవడంతో నిరసన తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. మార్గదర్శకాల కోసం పట్టుపట్టనున్న కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు, ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాల కోసం జరగాలని స్పష్టం చేయనుంది. మార్గదర్శకాలను ప్రకటించి, వాటి అమల్లో రాజకీయాలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంత్రాంగం ఏమిటో చెప్పాలని కోరనుంది. ముఖ్యంగా మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా అమలుచేయడానికి జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజల సౌలభ్యమే.. అంటున్న బీజేపీ కొత్తగా జిల్లాల ప్రతిపాదనల్లో ఆయా జిల్లాల జనాభా, భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, జిల్లా కేంద్రానికి దూరం, చారిత్రక నేపథ్యం, వనరులు, నీటివసతి వంటివాటిపై ప్రజల అభిప్రాయాలను, సౌలభ్యాన్ని ప్రశ్నిం చడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. జిల్లాల ఏర్పాటు కృత్రిమంగా, రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం కాకుండా చూడాలని.. ప్రజా ప్రయోజనాలు అంతిమంగా ఉండాలని పట్టుబట్టనుంది. వరంగల్ పట్టణాన్ని రెండుగా విభజిస్తూ... హన్మకొండను మరో జిల్లాగా చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంటోంది. చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ను విడదీయడాన్ని వ్యతిరేకించే యోచనలో ఉంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలను కలిపే విషయంలో, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను వికారాబాద్‌లో కాకుండా శంషాబాద్‌లో కలపాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది. అసంపూర్తిగా సమాచారం ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పంపించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. హైద రాబాద్ జిల్లా సమాచారమే లేదు. ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అసెంబ్లీ నియోజకవర్గాలను ముక్కలుగా చేయొద్దు. జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలి. శాస్త్రీయంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌ను బట్టి మా పార్టీ స్పందన ఉంటుంది..’’ - చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి ‘‘కొన్ని మండలాల ఏర్పాటు ప్రతిపాదనలు సమగ్రం గా లేవు. గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేకంగా కౌన్సిల్ ఉండాలి. జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదన, వాస్తవ ప్రతిపాదనల్లో తేడాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కలసి ఉండాలని చెబుతున్న ప్రభుత్వం.. వరంగల్, హన్మకొండలను ఎలా విడదీస్తోంది? అఖిలపక్షంలో వచ్చే ప్రతిపాదనలు, అభిప్రాయాలకు అనుగుణంగా మా వాదన వినిపిస్తాం..’’ - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాజకీయ లబ్ధికోసమే.. ‘‘కేవలం రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు అనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాల విభజన ఉండాలి..’’ - ఎల్.రమణ, టీ టీడీపీ అధ్యక్షుడు -
నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
జిల్లాల పునర్విభజన.. ఉద్యోగులకు 3.144 శాతం డీఏ.. * సుధీర్, చెల్లప్ప కమిషన్ల నివేదికలకు ఆమోదం * జీఎస్టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) 3.144 శాతం పెంపు, ముస్లింలు, గిరిజనులకు చెరో 12 శాతం రిజర్వేషన్లు, వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎజెండాలోని 30 అంశాలపై చర్చించి ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటును ఎజెండాలో ముఖ్య అంశంగా పెట్టారు. వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)ను ఆమోదించేందుకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాల తేదీలను సైతం ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. అదే విధంగా గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు ముస్లింలు, గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ సమర్పించిన నివేదికలను కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది. నీటిపారుదల శాఖలో 150 ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన డ్రైవింగ్ లెసైన్స్‌ను రద్దు చేసేందుకు 12 పాయింట్ల ప్రతిపాదనలను ఆమోదించనుంది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన అంచనాలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అదే విధంగా దేవాలయాల ట్రస్ట్‌లలో సభ్యుల సంఖ్యను 9 నుంచి 15కు పెంచేందుకు వీలుగా దేవాదాయ చట్టానికి ప్రతిపాదించిన సవరణలతో పాటు రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు సంబధించిన ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. -
జిల్లాల పునర్విభజన పేరుతో కేసీఆర్ నాటకాలు
వరంగల్‌ను విడగొట్టాలనే ఆలోచన రావడం దురదృష్టకరం ∙బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పరకాల : జిల్లాల పునర్విభజన పేరుతో సీఎం కేసీఆర్ మూడు నాలుగు నెలల నుంచి నాటకాలు ఆడుతున్నా రని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలన సౌలభ్యం కోసం జిల్లాలను ఏర్పాటు చేస్తే మంచిదేకానీ.. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ట్రైసిటీగా కొనసాగుతున్న కాజీపేట, హన్మకొండ, వరంగల్ పట్టణాలను విడగొట్టాలనే ఆలోచన రావడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్‌కు కరీంనగర్, కరీంనగర్లో ఉన్న ఈటెల రాజేందర్‌కు హన్మకొండను అప్పగించడం కోసమే సీఎం కేసీఆర్ చారిత్రాత్మకమైన వరంగల్‌ను విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును బీజేపీ వ్యతిరేకిస్తుందని, అవసరమైతే ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు దిగుతుందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభమైన తిరంగ యాత్ర సెప్టెంబర్ 17వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. యాత్రలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరకాల అమరధామంకు రానున్నారని ఆయన పేర్కొన్నారు. -
‘మహా’ విభజన
♦ కొత్త జిల్లాలపై ప్రభుత్వం స్పష్టత ♦ వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి ♦ హైదరాబాద్, సికింద్రాబాద్‌లో శివార్లు ♦ ప్రతిపాదనలపై టీఆర్ఎస్ నేతల అసంతృప్తి ♦ జిల్లా యూనిట్‌గా విభజనకు పట్టు ♦ మూడు జిల్లాలు చేయాలని తీర్మానం ♦ పునర్విభజనలో మార్పులకు అవకాశం కొత్త జిల్లాలపై ప్రభుత్వ అంతరంగం బయటపడింది. జిల్లాల పునర్విభజనపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ప్రస్తుత జిల్లాను వికారాబాద్ కేంద్రంగా కొనసాగించేందుకు లైన్‌క్లియర్ చేసిన సర్కారు.. శివార్లలోని పది నియోజకవర్గాలను హైదరాబాద్, కొత్తగా ఏర్పాటుచేస్తున్న సికింద్రాబాద్ జిల్లాల్లో కలిపేందుకు మొగ్గు చూపింది. బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో జిల్లాల విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా, మండల, రెవెన్యూ డివిజన్ల విభజనకు సంబంధించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని తెలుసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ పరిశీలనలోని జిల్లాల మ్యాపులను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అందజేసింది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై అధికారపార్టీ ప్రతినిధులు పెదవి విరిచారు. జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియను చేపట్టాలనే తమ అభ్యర్థనను పట్టించు కోకపోవడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత జిల్లాను మూడు ముక్కలుగా విభజించాలని, జిల్లాలోని ప్రాంతాలను ప్రతిపాదిత సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావుకు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా విభజన అంశం ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేదు. పునర్విభజనపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తాజా జాబితాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లా విభజనపై స్పష్టత రాకపోవడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని కేశవరావు స్పష్టం చేశారు. కొడంగల్ మనదరికే.. రంగారెడ్డి జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్ (మహబూబ్‌నగర్)ను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అధికారయంత్రాంగం ఈ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌ను మాత్రమే ప్రతిపాదించ గా.. తాజాగా ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు మిగిలిన కోస్గి మండలాన్ని కూడా విలీనం చేయాలని సూచించారు. జిల్లా కేంద్రంగా ఇబ్రహీంపట్నం ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మ హర్దశ పట్టనుంది. హైదరాబాద్ జిల్లాకు కేంద్రంగా ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. యాకుత్పు రా, మలక్‌పేట, చార్మినార్, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, అంబర్‌పేట, గో షామహల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీ నగ ర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో కలిపి హైదరాబాద్ జిల్లా ను ప్రతిపాదించారు. ఇవేకాకుండా పొ రుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా క ల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లోని మాడ్గుల, ఆమన్‌గల్ మండలాలు రానున్నాయి. గచ్చిబౌలి కేంద్రంగా లష్కర్ జిల్లా సికింద్రాబాద్ కొత్త జిల్లాగా అవతరించనుంది. ఈ మేరకు సీసీఎల్ఏ రూపొందించిన మ్యాపును టీఆర్ఎస్ ప్రతినిధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ జిల్లా పరిధిలోకి రంగారెడ్డి జిల్లా ఉత్తర భాగాన ఉన్న ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సనత్‌నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పటాన్చెరు (రామచంద్రరావు మండలం) రానున్నాయి. ఈ జిల్లా కేంద్రంగా ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన గచ్చిబౌలిని ప్రతిపాదించారు. కొత్త మండలాలకు పచ్చజెండా కొత్తగా ఎనిమిది మండలాల ప్రతిపాదనలకు టీఆర్ఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కోట్‌పల్లి, ఎల్బీనగర్, మేడిపల్లి, దుండిగల్, గండిపేట, జ వహర్‌నగర్, మీర్పేట్, పెద్దఅంబర్పే ట్ మండలాల ఏర్పాటుకు ఓకే చెప్పారు. కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు.. వాటి పరిధిలోకి వచ్చే మండలాల ప్రతిపాదనలు.. రంగారెడ్డి జల్లా : జిల్లా కేంద్రం వికారాబాద్ : చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్‌పేట , షాబాద్, శంకర్పల్లి, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, యాలాల, బంట్వారం, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్, వికారాబాద్ హైదరాబాద్ జిల్లా : జిల్లా కేంద్రం ఇబ్రహీంపట్నం: హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆమన్‌గల్, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, అంబర్పేట్, ఆసిఫ్‌నగర్, బహదుర్‌పురా, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, సైదాబాద్ సికింద్రాబాద్ జిల్లా : జిల్లా కేంద్రం గచ్చిబౌలి : మల్కాజిగిరి, ఘట్కేసర్, కీసర, మేడ్చల్, శామీర్‌పేట్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, అమీర్‌పేట్, బాలానగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి. ఎవరేమన్నారంటే.. జిల్లాలోనే పునర్విభజన ప్రస్తుత జిల్లా పరిధిలోనే విభజన జరగాలి. ఇతర జిల్లాలో రంగారెడ్డి జిల్లాను విలీనం చేసే ప్రక్రియ సరికాదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎంపీ ఏకాభిప్రాయం సాధించాం వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొన సాగనుంది. ఈ జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్ మండలాలను కలపడానికి అంగీకరించాం. ఆ జిల్లా ప్రతినిధుల విజ్ఞాపన మేరకు కోస్గి మండలాన్ని కూడా అక్కున చేర్చుకుంటున్నాం. - పి.నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మూడుగా విభజించాలి జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలి. మూడు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనలకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ , సికింద్రాబాద్‌లో శివారు ప్రాంతాలను విలీనం చేయడం సహేతుకంగా లేదు. ఈ ముసాయిదాను సవరించాలని నివేదించాం. - మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే -
విడిపోతూ...
రూపురేఖలు కోల్పోతున్న భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలు ముంపు మండలాల పేరిట.... తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సందర్భంగా పోలవరం ముంపు మండలాల పేరిట భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండల పరిధిలోని 70 గ్రామాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. జిల్లాలపునర్విభజనతో... భద్రాచలం నియోజకవర్గపరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలను వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ బోయే భూపాలపల్లి జిల్లాలో కలపాలంటూ ఆ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు నివేదించారు. నియోజకవర్గాల పునర్విభజనతో... ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలుండగా, 2009లో నియోజకవర్గాల పునర్విభజన పేరిట గుండాల మండలాన్ని పినపాకలో, కారేపల్లి మండలాన్ని వైరా నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు. జిల్లాల పునర్విభజనతో... కొత్తగా ఏర్పడబోయే మహబూబాబాద్ జిల్లాలోకి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే జరిగితే ఇల్లెందు నియోజకవర్గంలో మిగిలేవి కామేపల్లి, టేకులపల్లి మాత్రమే. సాక్షిప్రతినిధి, ఖమ్మం : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతోంది. ఇల్లెందు నుంచి మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నుంచి రెండు మండలాలను భూపాలపల్లిలోకి కలపాలన్న ప్రతిపాదనలతో వీటిపైనే అందరి దృష్టి నెలకొంది. నియోజకవర్గ కేంద్రంతో సహా ఇల్లెందు రూపురేఖలే మారిపోనున్నారుు. జిల్లాలోనే ఒకప్పుడు ఎనిమిది మండలాలతో, భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం మూడు మండలాలకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్లతో ఈ మండలాలను జిల్లాలోనే ఉంచుతారా..? లేక కొత్త జిల్లాల్లో కలుపుతారా..? అన్న దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భౌగోళిక వైభవాన్ని కోల్పోనున్న భద్రాచలం.. ఐటీడీఏ పరిధిలోకి వచ్చే 24 మండలాల్లో భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లోని మండలాలే కీలకం. ఈ మండలాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు, స్థానిక గిరిజన తెగలు ఎక్కువగా నివసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. దీంతో ఆపార అటవీ సంపద, కొన్ని ఆదివాసీ జాతులను జిల్లా కోల్పోయింది. రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. మూడు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీలోకి వెళ్లడంతో నియోజకవర్గ జనాభా తగ్గింది. ఇప్పుడు వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లిలో కలపాలన్న పరిస్థితులతో ఇప్పటికే స్వరూపాన్ని కోల్పోయిన భద్రాచలం నియోజకవర్గం భౌగోళిక వైశాల్యం మరింత తగ్గనుంది. ఇక ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న గుండాలను ఇల్లెందు నియోజకవర్గం నుంచి.. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పినపాకలో కలిపారు. మళ్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోకి ఇల్లెందు, గార్ల, బయ్యారం మండలాలను కలపాలని వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అయితే ఇల్లెందు నియోజకవర్గాన్ని అంతా కొత్తగూడెం జిల్లా పరిధిలోనే ఉంచాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2009కి ముందు ఇల్లెందు.. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలున్నాయి. పునర్విభజనతో ఇల్లెందు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని పినపాక, కారేపల్లి మండలాన్ని వైరాలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలోకి కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇల్లెందు నియోజకవర్గ మొత్తం వైశాల్యం 1518.91 చదరపు కిలోమీటర్లు. మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలో కలిపితే ఈ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారనుంది. నియోజకవర్గ కేంద్రం ఇల్లెందునే మహబూబాబాద్‌లో కలపాలని సోమవారం రాజధానిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ మండలాలు మినహాయిస్తే ఈ నియోజకవర్గంలో టేకులపల్లి, కామేపల్లి మండలాలు మిగలనున్నాయి. వీటి వైశాల్యం 591.56 చదరపు కిలోమీటర్లు, జనాభా 67,980 మంది. ముంపు మండలాలతో మొదలై.. ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ముంపు మండలాలు విలీనం కాకముందు భద్రాచలం నియోజకవర్గ జనాభా 3,27,945. భద్రాచలం మండలంలోని 70 గ్రామాలు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని 277 గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలాల నుంచి 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరిలోకి వెళ్లింది. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో 1,96,417 మంది జనాభా ఉన్నారు. తాజాగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. వాజేడు మండలంలో 24,816 మంది, వెంకటాపురం మండలంలో 31,765 మంది జనాభా ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ మండలాలను కలిపితే భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాలు ఉండనున్నాయి. వాజేడు, వెంకటాపురం మండలాల జనాభాను మినహాయిస్తే భద్రాచలం నియోజకవర్గ జనాభా 1,39,836 మంది. -
నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్..
సాక్షిప్రతినిది, నిజామాబాద్ : జిల్లాల పునర్విభజనపై సోమవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశంలో.. మన జిల్లా విభజనకు సంబంధించి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా చేసిన పలు ప్రతిపాదనలకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం. అయితే జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, భౌగోళిక పరిస్థితులు, ఆయా మండలాల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాలకు సంబంధించి కలెక్టర్ రూపొందించిన నివేదికపై మాత్రం సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్ఏ కమిషనర్ రేమండ్ పీటర్లు నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కలెక్టర్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ అంశాలకు సంబంధించి వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు చేశారు. కొత్త మండలాల ఏర్పాటు, డివిజన్ల ఏర్పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విన్నపాలు, ప్రజాప్రతినిధులు, సూచనలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను కలెక్టర్ సీఎస్‌కు అందించారు. జిల్లా పునర్విభజనలో భాగంగా ఏర్పడే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాకు చెందిన మండలాలు ఇతర జిల్లాల్లో కలిపే తదితర అంశాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ నివేదికలను పరిశీలించిన సీఎస్ మాత్రం నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. తొలి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు సమర్పించిన నివేదికలపై కూడ అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే పునర్విభజన కొనసాగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్లకు తెలిపినట్లు సమాచారం. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, 10 మండలాల ఏర్పాటుపై మాత్రం స్పష్టత వచ్చినట్లు తెలిసింది. జిల్లా ఏర్పాటులో భాగంగా మొదట అనుకున్న ప్రకారం కామారెడ్డిలో నాలుగు నియోజక వర్గాలు, నిజామాబాద్‌లో 5 నియోజక వర్గాలు ఉండే విధంగా కలెక్టర్ నివేదించడంపై సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే జూలై 5న మరోమారు జిల్లా కలెక్టర్లతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. కలెక్టర్ సూచించిన నివేదికలను పరిశీలించి ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్ మరికొన్ని విన్నపాలను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ల నివేదికల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. కలెక్టర్లతో సమావేశం ముగియగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకువచ్చే ఉత్తర్వులు జారీ చేస్తారన్న చర్చ సాగుతోంది. ముగిసిన మొదటి రోజు సమావేశం.. హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల మొదటిరోజు సమావేశం ముగియగా.. ఎలాంటి నిర్ణయాలు మాత్రం వెలువడ లేదు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన అధికారులు...‘పునర్విభజన ప్రక్రియలో ముందుకు సాగండి’ అని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు ఇక పునర్విభజన ప్రతిపాదనలపై ఏమీ మాట్లాడకుండా కొత్తగా ఏర్పడే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల్లో భవనాల నిర్మాణం, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు, అధికారులు, ఉద్యోగుల విభజనపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జిల్లాకు సంబంధించి భౌగోళిక పరిస్థితులు, జనాభా, భూగర్భవనరులు, రేఖాచిత్రాలు, ఉద్యోగుల విభజన పలు అంశాలపై వారు మరింత దృష్టి పెట్టనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకురావడం , కార్యాలయాలు, ఉద్యోగుల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను వేగవంతం చేసే అవకాశం కూడ ఉంది. వీటన్నింటితో మారోసారి జులై 5 సమావేశం అనంతరం వీటికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారన్న చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగానే కలెక్టర్లు కూడా విభజన అంశాల్లో మరింత వేగం పెంచి ప్రాంతాలు విభజన కొత్త మండలాలు, రెవెన్యూ మండలాల, కార్యాలయాలను ప్రారంభించడం వంటి ముఖ్యమైన అంశాలను ఒక కొలిక్కి తీసుకు రావాల్సి ఉంది. దసరా కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు మరింత వేగంగా జరుగనున్నాయి. వచ్చే నెలలో సమావేశం తర్వాత పునర్విభజనపై పూర్తి స్పష్టత రానుంది. నిజామాబాద్ మండలాన్ని నిజామాబాద్ అర్బన్, రూరల్‌గా, బోధన్ మండలాన్ని అర్బన్, రూరల్‌గా, ఆర్మూర్ మండలాన్ని ఆర్మూర్, ఆలూర్గా, కామారెడ్డిని కామారెడ్డి, దేవునిపల్లిగా విభజించనున్నారు. వర్ని మండలంలోని రుద్రూర్ను మండల కేంద్రం చేయనున్నారు. అలాగే దోమకొండలోని బీబీపేట, భిక్కనూరులోని రాజంపేట, సదాశివనగర్ మండలంలోని రామారెడ్డిని మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డిచ్పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి మరో మండలం చేసే అవకాశాలున్నాయి. -
ఒకటి.. రెండయ్యేను..!
♦ తెలంగాణలో వేగంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు ♦ తాత్కాలిక జిల్లా కార్యాలయం ♦ మొత్తం 46 మండలాలకు తాజా ప్రతిపాదన ♦ మైనారిటీ గురుకుల భవన సముదాయం ఖాయం ♦ ప్రభుత్వానికి ముసాయిదా సమర్పణ ♦ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేపు కొలిక్కి.. ♦ రేపు మరోసారి సీఎం కేసీఆర్‌తో కలెక్టర్ భేటీ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రజల సౌకర్యం, పరిపాలన సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు విషయమై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర సమచారాన్ని తయారు చేసి ప్రభుత్వానికి ముసాయిదాను నివేదించారు. ఈ నెల 8న జిల్లాల నుంచి వెళ్లిన ముసాయిదాలపై చర్చించిన సీఎం కేసీఆర్, చీఫ్ సెక్రెటరీ తదితర ఉన్నతాధికారులు సోమవారం మరోసారి కలెక్టర్లతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఏయే మండలాలు.. ఏఏ జిల్లాలో కలపాలి ? కొత్తగా ఏర్పడనున్న మండలాల సమగ్ర స్వరూపం, మ్యాపులు తదితర వివరాలను తాజాగా శనివారం జిల్లా అధికారులు సీఎం పేషీకి పంపినట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడున్న 36 మండలాలకు తోడు మరో 10 మండలాలను అదనంగా పెంచి... 25 మండలాలతో నిజామాబాద్, 21 మండలాలతో కామారెడ్డి జిల్లాల కొనసాగింపునకు సంబంధించిన వివరాలను అందులో చేర్చినట్లు తెలిసింది. కామారెడ్డిలోని మైనార్టీ గురుకుల భవనంలో తాత్కాలికంగా జిల్లా కేంద్ర కార్యాలయాలను ఏర్పాటును ఖాయం చేశారు. కాగా తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ఇతర జిల్లాల అధికారుల మల్లగుల్లాలు ఓ పక్కన కొలిక్కి రాకపోగా.. జిల్లాలో ఈ ప్రక్రియ ముగింపు దశకు చేరగా, తెలంగాణలో మన అధికారులు మొదటిస్థానంలో ఉన్నారు. రెండు రోజుల్లో వివరాలు.. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల అంశంపై వివాదాలకు తెరపడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు ఈ ప్రతిపాదనలకు ఒకే చెప్పడంతో 20న జరిగే కలెక్టర్ల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన వెలువడనుంది. మొదట బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని కొందరు ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో గత నెల 27న కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్ యోగితారాణా తదితరులు ఆర్అండ్బీ గెస్టుహౌస్‌లో సమావేశం అయ్యారు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తుది నిర్ణయం జరగలేదని, ప్రజలు అపోహ పడవద్దని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ డాక్టర్ యోగితారాణాలు ప్రకటనలు విడుదల చేశారు. కొత్తగా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలన్న నిర్ణయంతో ప్రభుత్వం ఉందని, పాత డివిజన్లను రద్దు చేసే సమస్యే లేదని కూడ పేర్కొన్నారు. దీంతో అందరూ శాంతించడంతో కొత్త మండలాలు, డివిజన్ల ప్రతిపాదనల ముసాయిదాను తాజాగా అధికారులు ప్రభుత్వానికి పంపగా.. సోమవారం చర్చకు రానుంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లాకు తోడు కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటు అవుతుండగా... నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బోధన్, బాల్కొండ నియోజకవర్గాలు, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్, ఎల్లారెడ్డిలతో కామారెడ్డి జిల్లా ఏర్పడుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్‌లకు తోడు ఇటీవలే ఆర్మూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడగా బాన్సువాడ కూడ రెవెన్యూ డివిజన్ కానుంది. ఈ రెవెన్యూ డివిజన్ల పరిధిలో 10-11 మండలాలకు కొత్తగా ఏర్పడుతున్నాయి. కొత్త జిల్లా కామారెడ్డిలో ప్రభుత్వ కార్యాలయాలిలా.. అక్టోబర్ 11 దసరా నుంచి జిల్లా కార్యాలయాలు పనిచేయాల్సి ఉన్నందున్న కామారెడ్డిలో అన్ని ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక జిల్లా కార్యాలయాలకు జాయింట్ కలెక్టర్ ఎ.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని మైనార్టీ గురుకుల భవనాన్ని ఖరారు చేయగా కలెక్టర్ డాక్టర్ యోగితారాణా, మంత్రి, విప్ తదితరులు ఫైనల్ చేశారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న 19 గదులు, మొదటి అంతస్తులో ఉన్న 18 గదులతో పాటు, ఆ భవనం పక్కన ఉన్న రెండు డార్మెటరీలను కార్యాలయాల వసతికై ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వ కార్యాలకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేటాయింపుల వివరాలు కూడ ప్రభుత్వానికి పంపినట్లు తాజా నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అదనపు కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయాలతో పాటు సంక్షేమ, కార్పొరేషన్లకు గ్రౌండ్‌ఫ్లోర్‌లో వసతి కల్పించనున్నారు. అదే విధంగా డీ ఆర్డీఏ, మెప్మా, డీఈవో, ఆర్వీఎం, డీవీఈవో, ఆర్ఐవో కార్యాలయాలను కూడ గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఇవ్వనున్నారు. మొదటి అంతస్తులో ఆర్అండ్బీ, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్, నీటిపారుదల, ఇంజినీరింగ్ విభాగాలు, జిల్లా పరిషత్, డీపీవో, గనులు, భూగర్భజలాలు, కాలుష్య నివారణ, పరిశ్రమల శాఖలకు కేటాయించనున్నారు. తాత్కాలికంగా కేటాయించే ఈ గదులలో అధికారులకు ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేస్తారు. అలాగే వ్యవసాయ, పట్టు పరిశ్రమ, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, మార్కెటింగ్, పాడి పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, మార్కెట్ విభాగాలను మార్కెట్‌యార్డు నందు ఏర్పాటు చే యాలని నిర్ణయించారు. ఒక డార్మెటరీలో సమాచార పౌరసంబంధాల శాఖ విభాగాలు, జిల్లా ఉపాధి కల్పన, సైనిక సంక్షేమం, కార్యాలయాలు, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన అన్ని విభాగాలకు మరో డార్మెటరీలో ఏర్పాట్లు చేశారు. జిల్లా స్థాయిలో ఉండే దాదాపు 80 ప్రభుత్వశాఖలకు కొత్తగా ఏర్పడే కామారెడ్డి జిల్లాలో తాత్కాలిక వసతులు కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. -
ఉద్యోగులెందరు?
♦ సమాచారం కోరిన సర్కారు ♦ జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతం ♦ కొత్త జిల్లాలకు అవసరమైన సిబ్బంది కూడా.. ♦ నయా జిల్లాలకు 1,000-1,300 ఉద్యోగులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ముఖచిత్రం దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడే జిల్లాలు, మండలాలు, డివిజన్లకు ఏ మేరలో ఉద్యోగులు అవసరమవుతారనే లెక్కలపై ఆరా తీస్తోంది. ఈ మేరకు శనివారం సాయంత్రంలోగా నిర్దేశిత నమూనాలో శాఖల వారీగా సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమాండ్ పీటర్ శుక్రవారంఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రస్తుత కేడర్ స్ట్రెంత్, పనిచేస్తున్న సంఖ్య, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వివరాలతో నివేదిక తయారు చేసింది. అలాగే ప్రతిపాదిత జిల్లాలకు అవసరమయ్యే స్టాఫ్, అదనంగా ఎంత మందిని సర్దుబాటు చేయాలో పేర్కొంటూ సీసీఎల్ఏకు ప్రతిపాదనలు పంపింది. ఉద్యోగులు 34,426 జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంది. ఈ వివరాలను ఉద్యోగుల కుల, రిజర్వేషన్ల ప్రకారం విభజించి ప్రత్యేక నివేదిక తయారు చేసింది. ఈనేపథ్యంలో జిల్లాలో 34,426 మంది ఉద్యోగులున్నారు. వీరిలో పురుషులు 19,392, మహిళలు 15,034 మంది ఉన్నారు. అయితే ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఇందులో 38 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. శనివారం సాయంత్రంలోగా ఉద్యోగుల సంఖ్య, రిజర్వేషన్ల వారీగా మహిళలు, పురుషుల సంఖ్య కొలిక్కి రానుంది. ఇదిలావుండగా, కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాల పరిధిలో ప్రస్తుత ఉద్యోగులకు అదనంగా సగటున 1000-1300 మంది ఉద్యోగులు అవసరమని సర్కారు భావిస్తోంది. కలెక్టరేట్లో 300, జిల్లా పరిషత్‌లో 100, మిగతా జిల్లా ఉన్నత విభాగాల్లో(హెచ్ఓడీ) 900 మేర అవసరమవుతారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగులను భర్తీ చేయడం కష్టమని భావిస్తున్న సర్కారు.. కొన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. తద్వారా కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటోంది. -
లోగుట్టు.. సీఎంకెరుక!
♦ జిల్లాల పునర్విభజనలో గోప్యత ♦ సీఎం, కలెక్టర్ కనుసన్నల్లో ప్రతిపాదిత జిల్లాలు ♦ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు ♦ ముసాయిదాల సమర్పణకు మరో ఐదు రోజులు జిల్లాల పునర్విభజనపై యంత్రాంగం గుట్టుగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎన్ని ముక్కలు కానుంది? ప్రతిపాదిత జిల్లా కేంద్రాలేవీ? ప్రస్తుత జిల్లాలో కలిసే పొరుగు జిల్లా ప్రాంతాలేంటి? హైదరాబాద్‌లో విలీనమయ్యే మండలాలేవీ? అనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అత్యంత గోప్యతను ప్రదర్శిస్తోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో అన్నీతానై వ్యవహరిస్తున్న కలెక్టర్ రఘునందన్‌రావు.. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ఇతరత్రా అంశాలపై కలెక్టరేట్లో ఏ ఒక్క అధికారితోనూ చర్చించడం లేదు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై చిన్న సమాచారం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ స్థాయిలోనే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన అంశంపై చర్చిస్తున్నందున జిల్లాస్థాయిలో ముసాయిదాలు తయారు చేయాల్సిన అవసరంలేదనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఐదు అంశాల ఆధారంగా జిల్లాల ముసాయిదాలను పంపాలని సీసీఎల్ఏ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా కసరత్తు పూర్తిచేయలేదు. ప్రతిపాదిత జిల్లాల మ్యాపుల రూపకల్పనలో కిందిస్థాయి అధికారులపై ఆధారపడలేదు. ఇవి కూడా ప్రైవేటు సంస్థల్లో డిజైన్ చేయించారంటే.. జిల్లాల పునర్విభజనలో యంత్రాంగం ఎంత రహస్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత వారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం ఈనెల 20వ తేదీలోపు జిల్లాల ముసాయిదాలను సీసీఎల్ఏకు పంపాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఇప్పటివరకు వీటి పై ఎలాంటి అధ్యయనం జరగలేదు. ఇతర జిల్లాల్లో మాత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ప్రజాప్రతినిధులతో జిల్లాల విభజనపై చర్చోపచ ర్చలు జరుగుతున్నా.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరగకపోవడం గమనార్హం. సమావేశంపై సస్పెన్స్ కొత్త జిల్లాల ఏర్పాటులో చిక్కుముడిగా మారిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై ప్రత్యేకంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాల ప్రతిపాదనలు పంపే గడువుకు మరో ఐదు రోజులే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకు సీఎం సమావేశంపై జిల్లా యం త్రాంగంలో స్పష్టత రాలేదు. అయితే, జిల్లాల పునర్విభజనపై మొదట్నుంచి జిల్లా యంత్రాంగం సీసీఎల్ఏ డెరైక్షన్‌లో నడుచుకుంటోంది. ఈ క్రమంలోనే జిల్లాల సరిహద్దులు, భౌగోళిక స్వరూపంపై అక్కడికక్కడే ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తోందని అధికారవర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పునర్వ్యవస్థీరణపై కలెక్టర్ ‘మిస్టర్ కూల్’గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై స్పష్టత వచ్చినందున.. మిగతా ప్రాంతాలను ఎక్కడ కల పాలి? ఎన్ని జిల్లాలు ఏర్పాటుచేస్తే బాగుంటుంది? ఏ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే అం శంపై సీఎం స్థాయిలో రోడ్‌మ్యాప్ ఇప్పటికే ఖరారైనందున.. దానికి అనుగుణం గా మ్యాపులను తయారు చేయాల్సివుంటుందని, అంతదానికి హైరానా పడాల్సి న అవ సరంలేదనే అభిప్రాయాన్ని ఉన్నతస్థాయి అధికారులు వ్యక్తం చేస్తున్నారు. -
ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం : గట్టు
హైదరాబాద్: తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని టీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ...కొంతమంది పార్టీ వీడినా క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శాస్త్రీయవిధానం అవలంభించాలని గట్టు సూచించారు. రాష్ట్రంలో పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. తమ పార్టీ వీడి టీఆర్ఎస్లో చేరిన నేతలు ఇప్పుడు అవమానాలకు గురవుతున్నారన్నారు. ఈ నెల 18 నుంచి 28 వరకు వైఎస్సార్సీపీ అన్ని మండల శాఖల నియామకాలు పూర్తి చేస్తామని గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. -
రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
తూప్రాన్‌లో అఖిల పక్షం ఆందోళన బంద్.. రాస్తారోకో తూప్రాన్: జిల్లాల పునర్విభజన సందర్భంగా తూప్రాన్ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. మండలంలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని రహదారిపై గ్రామ పంచాయతీ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. డివిజన్ సాధన సమితి కన్వీనర్, సీనియర్ పాత్రికేయుడు సీఆర్.జానకిరాములు మాట్లాడుతూ తూప్రాన్ మండలాన్ని కొత్తగా ఏర్పడే 80 కి.మీ. దూరంలోని సిద్దిపేటలో కలపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 40 కి.మీ. దూరంలో ఉన్న మెదక్‌లో కలిపితే తమకు మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే పోలీస్, విద్యుత్ డివిజన్ కార్యాలయాలు మండలంలో ఉన్నాయని అలాగే రెవెన్యూ డివిజన్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాధన సమితి నాయకులు చక్రవర్తి, కిష్టారెడ్డి, ఆంజాగౌడ్, తాటి విఠల్, చందు, రహిం, వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు. -
జిల్లాల పునర్విభజనపై కలెక్టర్ల సమావేశం
హైదరాబాద్: తెలంగాణలో కొత్త జిల్లాల పునర్విభజనపై సీఎం కేసీఆర్ కసరత్తు ముమ్మరం చేశారు. రేపటి నుంచి రెండ్రోజుల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశంకానున్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో జరిగే ఈ సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటు, ముసాయిదా ప్రతిపాదనలపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రధానంగా చర్చిస్తారు. -
ఇలా విభజిద్దాం!
♦ జిల్లాల పునర్విభజనపై మార్గద ర్శకాలు జారీ ♦ ఆఫ్ సెంచరీకి చేరనున్న మండలాల సంఖ్య ♦ జిల్లా పరిధిలోనే ప్రతిపాదిత జిల్లాలు ♦ మ్యాపులు, సమాచారాన్ని కోరిన ప్రభుత్వం జిల్లాల పునర్విభజనపై రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. వీటికి అనుగుణంగా కొత్త జిల్లాల ప్రతిపాదనలను పంపాలని నిర్దేశించింది. కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు సహా ప్రతిపాదిత జిల్లాల సమగ్ర సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ జిల్లా యంత్రాంగానికి లేఖ రాశారు. గత నెల 23న జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదిత జిల్లాల బ్లూప్రింట్‌ను తయారు చేయాలని స్పష్టం చేశారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : నయా జిల్లాల ఏర్పాటుపై కృతనిశ్చయంతో ఉన్న సర్కారు.. జూన్ 2న ప్రతిపాదిత జిల్లాలను ప్రకటించాలని తొలుత భావించింది. అయితే, జిల్లాల విభజనలో శాస్త్రీయత పాటించకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి.. సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాతే జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని సూచనలు చేసింది. నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్ల స్థానే 153 పెరుగుతున్నందున వాటికి అనుగుణంగా కొత్తగా 24 లేదా 25 జిల్లాలు ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. జిల్లాను పరిధిలోనే కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఒక మండలం పరిధిలోకి పక్క మండలం, ఒక నియోజకవర్గంలోకి సరిహద్దు సెగ్మెంట్లోని మండలాన్ని కలిపేందుకు వెసులుబాటు కల్పించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పక్క జిల్లాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలనుకుంటే అది ప్రభుత్వ స్థాయిలో తీసుకునే విధానపర నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని అధికారవర్గాలు అంటున్నాయి. లక్షకో మండలం కొత్త మండలాలపై రెవెన్యూ యంత్రాంగం మళ్లీ కసరత్తు చేస్తోంది. వాస్తవానికి జిల్లాలో ప్రస్తుతం ఉన్న 37 మండలాలకు అదనంగా మరో 12 న్యూ మండలాలను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అయితే, తాజాగా లక్ష జనాభాకో మండ లం ఉండేలా చూడాలని ప్రభుత్వం నిర్దేశించింది. దీంతో ఇప్పుడున్న జిల్లాలో మండలాల సంఖ్య 50పైగా దాటనుంది. ఈ మేరకు మండలాల పునర్విభజనపై రెవెన్యూ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విభజనకు ‘పంచ’సూత్రాలు రెవెన్యూ పునర్వ్యవస్థీకరణలో ఐదు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ప్రస్తుత జిల్లా జనాభా/ ప్రతిపాదిత జిల్లా జనాభా/ డివిజన్/ మండల జనాభాను పంపాలని ఆదేశించింది. అలాగే మ్యాపుల తయారీలోనూ ఇదే తరహా ఫార్ములాను వినియోగించాలని సూచించింది. ప్రతిపాదిత జిల్లా లేదా రెవెన్యూ డివిజన్లో ఏయే మండలాలను కలుపుతున్నారు? ఏయే అసెంబ్లీ సెగ్మెంట్లు ఆ డివిజన్ పరిధిలోకి వస్తున్నాయో విశదీకరించాలి. ప్రతిపాదిత జిల్లా/ డివిజన్/ మండల నైసర్గిక స్వరూపాన్ని కూడా పొందుపరచాలని ఆర్డీఓలను ఆదేశిస్తూ జిల్లా క లెక్టర్ రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అంతేకాకుండా అవసరమైన ఉద్యోగుల సంఖ్య, ఆర్థికంగా పడే ప్రభావం, నీటి పన్ను, ఓటీసీ తదితర రాబడిపై కూడా సమాచారాన్ని నివేదించాలని స్పష్టం చేశారు. -
రాజకీయాలపై విభజన రేఖ!
జిల్లాల పునర్విభజన సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలపండిన ప్రజాప్రతినిధులు.. రాజకీయ దిగ్గజాల తలరాత మారనుంది. జూన్ 2 రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన నయా జిల్లాలకు ముహూర్తం ఖరారు చేయనుండడంతో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేతల భవితవ్యంపై సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు తొలిస్థానం ఉంటుందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ముఖ్యనాయకుల హవాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి నామినేటెడ్ పోస్టుపై కన్నేశారు. విభజనతో ఆయన కూడా పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారు. మారనున్న రాజకీయ సమీకరణాలతో ఆయన ఆశించిన పోస్టు దక్కించుకోవడం సస్పెన్స్‌గా మారనుంది. తూర్పు ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటు కానుండడంతో ఇబ్రహీంపట్నం జిల్లా కేంద్రంగా అవతరిస్తే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాభవం మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, క్యామ మల్లేశ్, టీఆర్ఎస్ సారథి నాగేందర్గౌడ్ల పరిధి నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతిని ధుల ప్రాబల్యం తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తనదైనశైలిలో రాణిస్తూ.. జిల్లాను ఒంటిచేత్తో నడిపిస్తున్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి విభజన రేఖ కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. తూర్పు, ఉత్తర ప్రాంతంలోనూ ప్రభావం చూపుతున్న మంత్రి.. కేవలం పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాండూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేందర్ జిల్లాల ఏర్పాటుతో పక్క జిల్లాల్లో జోక్యం చేసుకునే అవకాశం అంతంతమాత్రమే కానుండడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయన గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. ఒకవేళ జిల్లాలు ఏర్పాటు చేసినా.. ఆయా జిల్లాల్లో మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టకపోతే మా త్రం ఆయన హవాకు ఢోకా ఉండదు. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఎవరికైనా మంత్రివర్గంలో చోటుకల్పిస్తే.. అమాత్యుని ప్రాభవం తగ్గిపోవడం తథ్యం. చైర్‌పర్సన్‌కు తప్పని తిప్పలు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డికి కూడా ఈ పరిణామం కొత్త సమస్యలు సృష్టించనుంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న యాలాల మండలం కూడా ప్రతిపాదిత పశ్చిమ జిల్లాలో ఉండడంతో ఆమె ప్రభావం తగ్గనుంది. కానీ, జిల్లా పరిషత్ పాలకమండలిపదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే.. ఆమె హవాకు ఢోకా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి సబిత సుదీర్ఘకాలం చేవెళ్ల రాజకీయాలను శాసించారు. మహేశ్వరం, మహేశ్వరం నియోజకవర్గాలపై పట్టు సాధించారు. విభజన నేపథ్యంలో ఈ సెగ్మెంట్లు వేర్వేరు జిల్లాల్లో చేరితే ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కానుంది. ఇక సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేశారు. విభజన నేపథ్యంలో ఇక ఆయన అక్కడి రాజకీయాలపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వైరివర్గాలన్నీ ఒకే జిల్లాకు.. జిల్లాల డీలిమిటేషన్ గ్రూపు రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది. రాజకీయ ఉద్ధండులు ఉన్న వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర అభిప్రాయబేధాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి మహేందర్‌రెడ్డికి కొంత కాలంగా పొసగడంలేదు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో కూడా దాదాపుగా ఇంతే. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా ఈ ఇరువురికి అంత సఖ్యత లేదు. ఇలా ఎవరికివారూ తలపండిన నేతలు కావడం.. వారంతా ఒకే జిల్లాకు పరిమితం కానుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. - జిల్లాల విభజనతో ఉత్తర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో కూడా కేబినెట్ బెర్తులపై ఆశలు చిగురిస్తున్నాయి. - జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు జిల్లాలవారీగా కేటాయించే అవకాశం ఉండడం కూడా ఆశావహులను ఊహలపల్లకీలో ఊరేగింపజేస్తున్నాయి. - ప్రతిపాదిత తూర్పు, ఉత్తర జిల్లాల్లో శివారు నేతలే ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది. -
కొత్త జిల్లాలపై ప్రకంపనలు
♦ తెరపైకి వస్తున్న కొత్తకొత్త డిమాండ్లు ♦ ఆందోళనలకు సిద్ధమవుతున్న నాయకులు ♦ సమన్యాయం పాటించాలని వినతులు ♦ ‘పట్నం’ను జిల్లా కేంద్రం చేయాల్సిందే తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించిన జిల్లా కేంద్రాల ఏర్పాటుపై వివిధ ప్రాంతాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉన్న డిమాండ్లతో పాటు కొత్తగా తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమబాట పట్టారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమన్యాయం చేయాలని కోరుతున్నారు. - సాక్షి, నెట్వర్క ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రం గారెడ్డి అన్నారు. జేఎసీ అధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న నియోజకవర్గాన్ని 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలో కలుపుతామని సరికాదన్నారు. ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఆయా నియోజకవర్గాలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకరిస్తే మేమంతా మద్దతుగా నిలుస్తామని చెప్పారు. జిల్లా కేంద్రం కోసం మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ప్రభుత్వ సీఎస్, కలెక్టర్‌కు మరోసారి విన్నవిస్తామని తెలిపారు. అయినా నిర్ణయాన్ని మార్చుకోకుంటే లక్షమందితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీటీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జేఏసీని ఎమ్మెల్యే కలగూర గంపతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు అమృతసాగర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు ఇబ్రహీంపట్నంకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఎసీ జిల్లా చైర్మన్ చల్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రాచర్ల వెంకటేశ్వర్లు, కృపేష్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమ రంగారెడ్డిలో కలపొద్దు మొయినాబాద్ : వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపనివ్వమని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశమైన అఖిలపక్ష నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పశ్చిమ రంగారెడ్డిలో మొయినాబాద్‌ను కలపొద్దనే డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. మొదట ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే 111 జీఓతో నష్టపోయిన మొయినాబాద్‌ను వికారాబాద్‌లో కలిపితే జరిగే నష్టాలను తెలియజేస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మండలాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పశ్చిమ రంగారెడ్డిలో కలిపితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, పాషా, సుధాకర్ యాదవ్, ఎంపీటీసీలు మాధవరెడ్డి, గణేష్‌గౌడ్, యాద య్య, కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, మాజీ ఎంపీపీ కండిక రమేష్ పాల్గొన్నారు. జిల్లా కేంద్రం కోసం.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం చేవెళ్ల : పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చేవెళ్లను జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చేవెళ్లకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విచిత్రమైన భౌగోళిక పరిస్థితి నుంచి విడగొట్టి గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలను కలుపుతూ చేవెళ్లను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రెండు మూడు దశాబ్దాలుగా ఉందని తెలిపారు. నగరానికి ఆనుకుని ఉండడం, హైదరాబాద్ - బీజాపూర్ రహదారిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జాతీయ రహదారిగా అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కర్నాటక రాష్ట్రానికి కూడా చేవెళ్ల మీదుగా రహదారి ఉండడం వంటి అంశాలు జిల్లా కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు సైతం దగ్గరలో ఉండడం కూడా కలిసొచ్చే అంశంగా పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేస్తే మొయినాబాద్ లాంటి హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న మండలాలకు దూరమవుతుందని, అంతేకాకుండా ఆ మండల ప్రజలు సైతం వికారాబాద్ జిల్లాలో కలవడానికి అంగీకరించడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి, ఆలూరు సొసైటీ వైస్ చైర్మన్ మాధవగౌడ్, ముడిమ్యాల పీఏసీఎస్ డెరైక్టర్ ఎన్.మాధవరెడ్డి, దశరథ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజించాలి టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విఠల్ వికారాబాద్ రూరల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వికారాబాద్ కేంద్రంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా, ఈస్ట్ మండలాలను కలుపుకుని తూర్పు రంగారెడ్డి జిల్లాగా మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజిస్తే సముచితంగా ఉంటుందన్నారు. అలా కాకుండా రంగారెడ్డి జిల్లాలోని మండలాలను వీడదీసి ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ ప్రాంత ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోందన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో 50 శాతం పైగా నాన్ లోకల్ వారు ఉన్నారని, వారిని జిల్లా నుంచి ఇప్పటి వరకు పంపించకపోవడంతో స్థానిక గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదన్నారు. జిల్లాల విభజన పేరుతో ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరారు. వెంటనే పునర్విభజనపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని కోరారు. ‘సైబరాబాద్‌లోనే కలపాలి’ మొయినాబాద్ రూరల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కాకుండా సైబరాబాద్‌లోనే కలపాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్‌ను 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలపాలని చూడడం తగదన్నారు. ఇలా స్తే మండల ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మొయినాబాద్‌ను సైబరాబాద్‌లో కలపడం వల్ల అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పశ్చిమ రంగారెడ్డిలో కాకుండా సైబరాబాద్‌లో కలపాలన్నారు. -
తీన్మార్
⇒ మెతుకుసీమలో మూడు జిల్లా కేంద్రాలు పక్కా..! ⇒ ఘనపురం ప్రాజెక్ట్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ⇒ పంచాయతీకి రూ.15 లక్షలు, మండల కేంద్రానికి రూ.25లక్షలు ⇒ ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు ⇒ ఆనందోత్సాహాల్లో జిల్లా వాసులు మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా మెతుకుసీమను విభజించి మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బుధవారం మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచేందుకు హెలీకాఫ్టర్ ద్వారాఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం మెదక్‌లో జరిగిన అధికారులు, ప్రజాప్రతినిధులు సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్ ప్రాంత ప్రజలు కోరిక మేరకు త్వరలోనే మెదక్ కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ నియోజకవర్గాలను 13 నియోజకవర్గాలుగా విభజించి మెతుకుసీమను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటలు కేంద్రాలుగా మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తామన్నారు. అయితే మెదక్‌ను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటే ఈ ప్రాంత నాయకులంతా మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపాలన్నారు. గుంట భూమి మునగనివ్వం శతాధిక వయస్సు గల ఘనపురం ప్రాజెక్ట్ అద్భుతమైన కట్టడమని సీఎం కేసీఆర్ అన్నారు. ఆంధ్ర పాలకుల హయాంలో పూడికకు గురైనప్పటికీ వారు పట్టించుకోక పోవడం వల్ల ఆయకట్టు రైతులకు ఏమాత్రం ప్రయోజనం కలుగలేదన్నారు. ఆనకట్ట ఎత్తు పెంపునకు, కాల్వల ఆధునీకరణ కోసం రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నామని, రెండు రోజుల్లో జీఓకూడా విడుదల చేస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ వరకు పనులు పూర్తయ్యేలా చూస్తామన్నారు. ఏరియల్ సర్వే ద్వారా కాల్వలోని ప్రతి ఇంచు జాగను పరిశీలించామన్నారు. గుంట భూమి మునగకుండా ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంచుతామన్నారు. మంజీరానదిపై 7 చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. పంచాయతీకి రూ.15 లక్షలు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధికి రూ.15 లక్షలు, మండల కేంద్రానికిరూ.25 లక్షలు, మెదక్ పట్టణానికి రూ.కోటి తమ ప్రత్యేక నిధుల ద్వారా మంజూరు చేస్తామని ప్రకటించారు. ఆయా అభివృద్ధి పనులను స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలకే అప్పజెప్పాలన్నారు. మెదక్ పట్టణంలో షాదిఖానాకోసం రూ.కోటి నిధులు మంజూరు చేస్తామన్నారు. అలాగే పట్టణంలో డబుల్ డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్లను ఆధునీకరిస్తామని, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. తన బిడ్డలాంటి డిప్యూటీ స్పీకర్ పద్మ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, మరోసారి వచ్చినప్పుడు మున్సిపాలిటీలో సమావేశం నిర్వహించి అభివృద్ధి చర్యలు చేపడుతానన్నారు. ప్రతి ఇంటికి తాగునీరందిస్తామని, లేకుంటే ఓట్లు అడగబోమని స్పష్టంచేశారు. ఈ బాధ్యతను స్థానిక సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 40వేల మొక్కలు నాటాలన్నారు. తద్వారా కరువును పారదోలవచ్చన్నారు. చిన్నశంకరంపేట మండలంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఒక్కరోజులోనే కొత్త ట్రాన్స్ఫార్మర్ బిగించాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు సుధాకర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, మదన్‌రెడ్డి, చింత ప్రభాకర్ , గూడెం మహిపాల్‌రెడ్డి, పంచాయతీరాజ్ కమిషనర్ రేమండ్ పీటర్, సీఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్, జేసీ శరత్, ఆర్డీఓ మెంచు నగేష్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, కేసీఆర్ రాజకీయ కార్యదర్శి సుభాష్‌రెడ్డి, నరేంద్రనాథ్, ఐఏఎస్ అధికారులు, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.