
రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
తూప్రాన్‌లో అఖిల పక్షం ఆందోళన బంద్.. రాస్తారోకో
తూప్రాన్: జిల్లాల పునర్విభజన సందర్భంగా తూప్రాన్ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన బంద్ విజయవంతమైంది. మండలంలోని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన అనంతరం పట్టణంలోని రహదారిపై గ్రామ పంచాయతీ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. డివిజన్ సాధన సమితి కన్వీనర్, సీనియర్ పాత్రికేయుడు సీఆర్.జానకిరాములు మాట్లాడుతూ తూప్రాన్ మండలాన్ని కొత్తగా ఏర్పడే 80 కి.మీ. దూరంలోని సిద్దిపేటలో కలపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. 40 కి.మీ. దూరంలో ఉన్న మెదక్‌లో కలిపితే తమకు మేలు జరుగుతుందన్నారు.
ఇప్పటికే పోలీస్, విద్యుత్ డివిజన్ కార్యాలయాలు మండలంలో ఉన్నాయని అలాగే రెవెన్యూ డివిజన్‌తో పాటు అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సాధన సమితి నాయకులు చక్రవర్తి, కిష్టారెడ్డి, ఆంజాగౌడ్, తాటి విఠల్, చందు, రహిం, వెంకటేశ్‌యాదవ్ పాల్గొన్నారు.