
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్ చేసి ఆహ్వానించారు.
