
నేడే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
జిల్లాల పునర్విభజన.. ఉద్యోగులకు 3.144 శాతం డీఏ..
* సుధీర్, చెల్లప్ప కమిషన్‌ల నివేదికలకు ఆమోదం
* జీఎస్టీ కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(డీఏ) 3.144 శాతం పెంపు, ముస్లింలు, గిరిజనులకు చెరో 12 శాతం రిజర్వేషన్లు, వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల నిర్వహణ తదితర కీలకాంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఎజెండాలోని 30 అంశాలపై చర్చించి ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
దసరా నుంచి కొత్త జిల్లాల ఏర్పాటును ఎజెండాలో ముఖ్య అంశంగా పెట్టారు. వస్తు సేవల పన్ను బిల్లు(జీఎస్టీ)ను ఆమోదించేందుకు రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాల తేదీలను సైతం ఈ భేటీలో ఖరారు చేయనున్నారు. అదే విధంగా గోదావరిపై సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకోనున్న అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. దీనితో పాటు ముస్లింలు, గిరిజనుల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై సుధీర్ కమిషన్, చెల్లప్ప కమిషన్ సమర్పించిన నివేదికలను కూడా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించనుంది.
నీటిపారుదల శాఖలో 150 ఏఈఈ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపనుంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తికి సంబంధించిన డ్రైవింగ్ లెసైన్స్‌ను రద్దు చేసేందుకు 12 పాయింట్ల ప్రతిపాదనలను ఆమోదించనుంది. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఫిషరీస్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి సవరించిన అంచనాలపై మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. అదే విధంగా దేవాలయాల ట్రస్ట్‌లలో సభ్యుల సంఖ్యను 9 నుంచి 15కు పెంచేందుకు వీలుగా దేవాదాయ చట్టానికి ప్రతిపాదించిన సవరణలతో పాటు రంగారెడ్డి జిల్లా తాండూర్‌లో ఐటీఐ కళాశాల ఏర్పాటుకు సంబధించిన ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.