సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన తుది ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జారీ చేసింది. హైదరాబాద్ మినహాయిస్తే...రాష్ట్రంలోని మిగిలిన 9 జిల్లాలను 30 కొత్త జిల్లాలుగా పునర్విభజిస్తూ జిల్లాల వారీగా తుది ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రదీప్ చంద్ర జారీ చేశారు.
ఆ వెంటనే కొత్త జిల్లాలకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్ కలెక్టర్లు, కొత్తగా ఏర్పడిన 6 పోలీసు కమిషనరేట్లకు పోలీసు కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే సమయంలో ఆర్డర్ టు సర్వ్ పద్ధతిలో కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయిస్తూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు మూకుమ్మడిగా ఉత్తర్వులు జారీ చేశాయి.