
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చారిత్రక నిర్ణయంపై ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చెప్పారు. అభివృద్ధిపై మరింతగా దృష్టి పెట్టడం కోసం జిల్లాల పునర్విభజన ఉపకరిస్తుందని చెప్పారు. తాడేపల్లిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ప్రతి పార్లమెంట్ స్థానాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తానని గతంలో ప్రకటించారని, ఆ మేరకు నేడు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
సీఎం నిర్ణయానికి వాడవాడలా మద్దతు లభిస్తోందన్నారు. నిర్ణయం వెలువడిన మొదటి రోజే ప్రజాచైతన్యం వెల్లువెత్తిందని అన్నారు. రెండో రోజు రాష్ట్రవ్యాప్తంగా మహిళా చైతన్యం కనిపించిందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ మహిళలు ర్యాలీలు చేశారన్నారు. మహిళలు తొలినుంచీ సీఎం జగన్ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచీ అగ్రప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందేనన్నారు. తాను ఉమ్మడి ఏపీలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఓ నివేదికను అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి అందించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయాలని కోరినట్లు చెప్పారు.
ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. జనాభా పెరుగుతుండటం, బలహీన వర్గాలకు సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందించడానికి ప్రభావశీలమైన పరిపాలన కోసం కొత్త జిల్లాల రూపకల్పన ఉపయోగపడుతుందని చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజలకు వివిధ ప్రయోజనాలను అందించడంపై దృష్టి పెడుతోందన్నారు. అభివృద్ధి, పరిపాలన సౌలభ్యం కోసం సీఎం జగన్ నూతన జిల్లాలను ఏర్పాటు చేశారని ప్రజలంతా గుర్తించి వారి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారని ఈ ప్రాంత ప్రజలు ఎంతో సంబరపడుతున్నారన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటులో కొన్ని ఇబ్బందులు ఏ ప్రభుత్వానికైనా సహజమన్నారు. 100 శాతం అందరినీ మెప్పించటం ఎవరికైనా సవాలేనన్నారు. కానీ అందర్నీ మెప్పించేందుకు సీఎం జగన్ శాయశక్తులా కృషి చేస్తున్నారని తెలిపారు.