సాక్షి, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్తగా 15 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలో కనీసం రెండు డివిజన్లు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 15 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతమున్న 51 డివిజన్లలో నాలుగు డివిజన్లు ప్రస్తుతం ఉన్న డివిజన్లలో కలిసిపోనున్నాయి. ఈ నాలుగు పోగా మిగిలిన 47తోపాటు కొత్తవి 15 కలిపి మొత్తం 62 డివిజన్లు కానున్నాయి.
విజయనగరం జిల్లాలో బొబ్బిలి, విశాఖపట్నం జిల్లాలో భీమునిపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. బాపట్ల జిల్లాలో ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా లేకపోవడంతో బాపట్ల, చీరాల డివిజన్ల ఏర్పాటును కొత్తగా ప్రతిపాదించారు. అలాగే ప్రకాశం జిల్లాలో కనిగిరి, నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, డోన్, అనంతపురం జిల్లాలో గుంతకల్, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, వైఎస్సార్ జిల్లాలో బద్వేలు, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి.
ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్లు సమీప డివిజన్లలో విలీనం కానున్నాయి. ఎటపాక.. రంపచోడవరం డివిజన్‌లో, కుకునూరు.. జంగారెడ్డిగూడెం డివిజన్‌లో, కనిగిరి.. కందుకూరు డివిజన్‌లో, ధర్మవరం.. కల్యాణదుర్గం, అనంతపురం డివిజన్లలో కలవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment