‘మహా’ విభజన | trs leaders desoppointed with district Reorganization | Sakshi
Sakshi News home page

‘మహా’ విభజన

Published Thu, Jun 30 2016 1:44 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

‘మహా’ విభజన - Sakshi

‘మహా’ విభజన

కొత్త జిల్లాలపై ప్రభుత్వం స్పష్టత
వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో శివార్లు
ప్రతిపాదనలపై టీఆర్‌ఎస్ నేతల అసంతృప్తి
జిల్లా యూనిట్‌గా విభజనకు పట్టు
మూడు జిల్లాలు చేయాలని తీర్మానం
పునర్విభజనలో మార్పులకు అవకాశం

కొత్త జిల్లాలపై ప్రభుత్వ అంతరంగం బయటపడింది. జిల్లాల పునర్విభజనపై స్పష్టమైన సంకేతాలిచ్చింది. ప్రస్తుత జిల్లాను వికారాబాద్ కేంద్రంగా కొనసాగించేందుకు లైన్‌క్లియర్ చేసిన సర్కారు.. శివార్లలోని పది నియోజకవర్గాలను హైదరాబాద్, కొత్తగా ఏర్పాటుచేస్తున్న సికింద్రాబాద్ జిల్లాల్లో కలిపేందుకు మొగ్గు చూపింది. బుధవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో జిల్లాల విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా, మండల, రెవెన్యూ డివిజన్ల విభజనకు సంబంధించి ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని తెలుసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ పరిశీలనలోని జిల్లాల మ్యాపులను ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు అందజేసింది.

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం రూపొందించిన ముసాయిదాపై అధికారపార్టీ ప్రతినిధులు పెదవి విరిచారు. జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియను చేపట్టాలనే తమ అభ్యర్థనను పట్టించు కోకపోవడంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత జిల్లాను మూడు ముక్కలుగా విభజించాలని, జిల్లాలోని ప్రాంతాలను ప్రతిపాదిత సికింద్రాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో విలీనం చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యుడు, ఎంపీ కేశవరావుకు అందజేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లా విభజన అంశం ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేదు. పునర్విభజనపై ఏకాభిప్రాయం రాకపోవడంతో తాజా జాబితాలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. జిల్లా విభజనపై స్పష్టత రాకపోవడంతో ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతానని కేశవరావు స్పష్టం చేశారు.

కొడంగల్ మనదరికే..
రంగారెడ్డి జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్ (మహబూబ్‌నగర్)ను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, అధికారయంత్రాంగం ఈ నియోజకవర్గ పరిధిలోని కొడంగల్, బొంరాస్‌పేట్, దౌల్తాబాద్‌ను మాత్రమే ప్రతిపాదించ గా.. తాజాగా ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు మిగిలిన కోస్గి మండలాన్ని కూడా విలీనం చేయాలని సూచించారు.

 జిల్లా కేంద్రంగా ఇబ్రహీంపట్నం
ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి మ హర్దశ పట్టనుంది. హైదరాబాద్ జిల్లాకు కేంద్రంగా ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. యాకుత్‌పు రా, మలక్‌పేట, చార్మినార్, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, చాంద్రాయణగుట్ట, ముషీరాబాద్, అంబర్‌పేట, గో షామహల్, ఇబ్రహీంపట్నం, ఎల్‌బీ నగ ర్, రాజేంద్రనగర్, మహేశ్వరం నియోజకవర్గాలతో కలిపి హైదరాబాద్ జిల్లా ను ప్రతిపాదించారు. ఇవేకాకుండా పొ రుగున ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా క ల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్‌లోని మాడ్గుల, ఆమన్‌గల్ మండలాలు రానున్నాయి. 

 గచ్చిబౌలి కేంద్రంగా లష్కర్ జిల్లా
సికింద్రాబాద్ కొత్త జిల్లాగా అవతరించనుంది. ఈ మేరకు సీసీఎల్‌ఏ రూపొందించిన మ్యాపును టీఆర్‌ఎస్ ప్రతినిధులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ జిల్లా పరిధిలోకి రంగారెడ్డి జిల్లా ఉత్తర భాగాన ఉన్న ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, సనత్‌నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, పటాన్‌చెరు (రామచంద్రరావు మండలం) రానున్నాయి. ఈ జిల్లా కేంద్రంగా ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందిన గచ్చిబౌలిని ప్రతిపాదించారు.

కొత్త మండలాలకు పచ్చజెండా
కొత్తగా ఎనిమిది మండలాల ప్రతిపాదనలకు టీఆర్‌ఎస్ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. కోట్‌పల్లి, ఎల్‌బీనగర్, మేడిపల్లి, దుండిగల్, గండిపేట, జ వహర్‌నగర్, మీర్‌పేట్, పెద్దఅంబర్‌పే ట్ మండలాల ఏర్పాటుకు ఓకే చెప్పారు.

 కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు..

 వాటి పరిధిలోకి వచ్చే మండలాల ప్రతిపాదనలు..
రంగారెడ్డి జల్లా :   జిల్లా కేంద్రం వికారాబాద్ : చేవెళ్ల, మొయినాబాద్, నవాబ్‌పేట , షాబాద్, శంకర్‌పల్లి, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్, కొడంగల్, కోస్గి, దోమ, గండేడ్, కుల్కచర్ల, పరిగి, పూడూరు, బషీరాబాద్, పెద్దేముల్, తాండూరు, యాలాల, బంట్వారం, ధారూరు, మర్పల్లి, మోమిన్‌పేట్, వికారాబాద్

 హైదరాబాద్ జిల్లా :  జిల్లా కేంద్రం ఇబ్రహీంపట్నం: హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆమన్‌గల్, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, అంబర్‌పేట్, ఆసిఫ్‌నగర్, బహదుర్‌పురా, బండ్లగూడ, చార్మినార్, గోల్కొండ, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, సైదాబాద్

 సికింద్రాబాద్ జిల్లా : జిల్లా కేంద్రం గచ్చిబౌలి : మల్కాజిగిరి, ఘట్‌కేసర్, కీసర, మేడ్చల్, శామీర్‌పేట్, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ఉప్పల్, అమీర్‌పేట్, బాలానగర్, ఖైరతాబాద్, మారేడ్‌పల్లి, సికింద్రాబాద్, షేక్‌పేట్, తిరుమలగిరి.

 ఎవరేమన్నారంటే..

 జిల్లాలోనే పునర్విభజన
ప్రస్తుత జిల్లా పరిధిలోనే విభజన జరగాలి. ఇతర జిల్లాలో రంగారెడ్డి జిల్లాను విలీనం చేసే ప్రక్రియ సరికాదు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం.  - కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎంపీ

 ఏకాభిప్రాయం సాధించాం
వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొన సాగనుంది. ఈ జిల్లా పరిధిలోకి పక్కనే ఉన్న కొడంగల్, బొమ్మరాసిపేట్, దౌల్తాబాద్ మండలాలను కలపడానికి అంగీకరించాం. ఆ జిల్లా ప్రతినిధుల విజ్ఞాపన మేరకు కోస్గి మండలాన్ని కూడా అక్కున చేర్చుకుంటున్నాం.
- పి.నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ

 మూడుగా విభజించాలి
జిల్లా యూనిట్‌గా విభజన ప్రక్రియ చేపట్టాలి. మూడు జిల్లాలుగా విభజించాలనే ప్రతిపాదనలకు కట్టుబడి ఉన్నాం. హైదరాబాద్ , సికింద్రాబాద్‌లో శివారు ప్రాంతాలను విలీనం చేయడం సహేతుకంగా లేదు. ఈ ముసాయిదాను సవరించాలని నివేదించాం.
- మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement