టీఆర్‌ఎస్‌లో నిరసన గళం!
జెండా పండుగ సందర్భంగా బయటపడిన విభేదాలు
మూడు గ్రామాల్లో అదే పరిస్థితి
గీసుకొండ : మండలంలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యాన జరుగుతున్న జెండా పండుగ సందర్భంగా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలంలోని కొమ్మాల, విశ్వనాథపురం, నందనాయక్ తండాల్లో శని, ఆదివారాల్లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యాన జెండా పండుగ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతల్లో నెలకొన్న అసంతృప్తి బహిర్గతమైంది. తమకు సమాచారం అందించకుండానే జెండా ఎలా పండుగ నిర్వహించడం సరికాదని.. ముఖ్య ప్రజాప్రతినిధులకు చెప్పకుండానే ఏకపక్షంగా నిర్వహించడంపై కొమ్మాల టీఆర్‌ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో జెండా పండుగను అక్కడ వాయిదావేశారు. ఇక ఆదివారం విశ్వనాథపురంలో జెండా పండుగకు వచ్చిన టీఆర్‌ఎస్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులను స్థానిక నాయకులు, కార్యకర్తలు నిలదీశారు.
పదవులు లేవు. పనులు లేవు, స్థాని క ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదు.. కలవడానికి వెళ్లినా పట్టించుకోవడం లేదని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే స్వయంగా వారం రోజుల్లో వచ్చి సమస్యలను పరిష్కరిస్తారని నాయకులు చెప్పడంతో స్థానికులు శాంతించారు. అలాగే, నందనాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో జెండా పండుగ కొత్త సమస్యలకు తెర తీసినట్లయింది. కాగా, జెండా పండుగపై గ్రామాల్లోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్‌లో క్రియాశీలకంగా పని చేసిన వారికి గుర్తింపు లేకపోవడంతో వారు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.