సీఎం సమాధానం చెప్పాలి
♦ అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీని ఎందుకు పిలవలేదు: గట్టు
♦ రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాల విభజన
♦ కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్
♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన
సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమాధానం చెప్పాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీని ఆహ్వానించనందుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘నిశ్శబ్ద నిరసన’ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము చూస్తూ కూర్చోబోమని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపున్న పార్టీని, ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ‘టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటూ ఎర్రబెల్లి దయాక ర్‌రావు చట్టసభలో టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. అలాంటి టీడీపీని అఖిలపక్ష భేటీకి ఎలా పిలిచారు? టీఆర్‌ఎస్‌కు టీడీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి? ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విలీనం చేసుకోవడం.. ఆ పార్టీ లేదంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఎనలేని గౌరవమని తరచూ చెప్పే సీఎం ఆ రాజ్యాంగాన్నే ఎందుకు ఉల్లఘిస్తున్నారు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.
క్షమాపణ చెప్పాలి...
అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీని పిలవనందుకు క్షమాపణ చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. త్వరలో తాము కోర్టులో వేసే పిటిషన్‌కు ప్రభుత్వమే కదులుతుందని చెప్పారు. కేసీఆర్ మోసపు, అహంకార పాలనను సాగనివ్వమని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ కుటుంబ పాలనకు అంతం పలకాలని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ నేతలంతా తొలుత బోట్‌క్లబ్ నుంచి ప్రదర్శనగా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని.. అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, జె.మహేందర్‌రెడ్డి, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె.అమృతసాగర్ (మహిళా విభాగం), బండారి వెంకట రమణ (సేవాదళ్), బి.శ్రీవర్దన్‌రెడ్డి (ఐటీ విభాగం), నర్ర భిక్షపతి (ట్రేడ్ యూనియన్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (డాక్టర్స్ విభాగం), జిల్లాల అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్), ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), నాడెం శాంతికుమార్ (వరంగల్), తుమ్మలపల్లి భాస్కర్‌రావు (నల్లగొండ), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి (రంగారెడ్డి), అక్కెనపల్లి కుమార్ (కరీంనగర్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), ఇతర నాయకులు శ్యామల (గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు), డాక్టర్ మవీన్, పి.బాలక్రిష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, రహీమ్ షరీఫ్ పాల్గొన్నారు.
పలువురు నేతల అరెస్ట్
నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పొలీసులు అరెస్టు చేశారు. గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కార్యకర్తలు, నాయకులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి డిచార్జ్ అయ్యారు. ఇక నేతలు కె.శివకుమార్, కె.అమృతసాగర్, ఎం.శ్యామల, భగవంత్‌రెడ్డి, కేసరి సాగర్, హిరాణిరెడ్డి, మేరి, విష్ణుప్రియ, ఇందిరారెడ్డి, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ నేతలు తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు.
ఎంతకాలం మోసం చేస్తారు?
బీడు భూములకు నీరు, లక్ష ఉద్యోగాలు అని హామీలు గుప్పించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు నీరివ్వలేదని, ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పూటకో మాట, వారానికో ప్రకటన చేస్తూ ప్రజల్ని ఎంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు. మండలాల ప్రాతిపదికన జిల్లాల విభజన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం మేరకు జరిగే విభజనను మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ ప్రాతిపదికన టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.