
ఠాణా.. హైరానా
⇒గందరగోళంగా పోలీస్‌స్టేషన్ల గెజిట్
⇒సిద్దిపేట జిల్లాలోని గ్రామాలు వేలేరు పీఎస్‌లోకి
⇒వేలేరు స్టేషన్ చిల్పూరు సర్కిల్‌లోకి
⇒ముల్కనూర్‌కు పీఎస్‌కు మొండిచేయి
భీమదేవరపల్లి: ఇంతకాలం ఎలాంటి అధికారం లేకుండా గడిపిన నూతన పోలీస్‌స్టేషన్లకు ప్రభుత్వం గెజిట్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయా పీఎస్‌ల ఎస్సైలకు ఎఫ్‌ఐఆర్ నమోదుకు అవకాశం వచ్చింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఈ గెజిట్ వ్యవహారం గజిబిజిగా, గందరగోళంగా మారింది. సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని రెండు రెవెన్యూ గ్రామాలు నూతన వేలేరు పీఎస్‌లోకి, ముల్కనూర్ ఠాణా పరిధిలోని మూడు రెవెన్యూ గ్రామాలు వేలేరు పీఎస్ లో కలుపుతూ వచ్చిన గెజి ట్‌పై సందిగ్ధత నెలకొంది.
జీఓ 38తో గెజిట్ జారీ
జిల్లాల పునర్విభజనలో భాగంగా రాష్ట్రంలో 92 నూతన పోలీస్‌స్టేషన్లు ఏర్పాటయ్యాయి. ఇందులో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లాలో ఐనవోలు, వేలేరు, జనగామ జిల్లాలోని తరిగొప్పుల, చిల్పూరు ఠాణాలు గతేడాది ఆక్టోబర్ 11న ప్రారంభమయ్యాయి. ఈ స్టేషన్ల ఎస్సైలకు ఇప్పటివరకు ఎలాంటి అధికారం లేకుండా కేవలం నామ్‌కేవాస్తుగానే ఉన్నారు. న్యాయస్థానం నుంచి ప్రభుత్వానికి ఠాణాల ఏర్పాటుపై గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో నూతన ఠాణాలకు ఎఫ్‌ఐఆర్ నమోదుతో పాటుగా పూర్తి అధికారాలు ఇస్తూ ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం జీఓఎంస్ 38 పేరుతో గెజిట్ జారీ చేసింది.
వేలేరులోకి రెండు మండలాల గ్రామాలు
నూతనంగా ఏర్పాటైన వేలేరు ఠాణాలో ధర్మసాగర్ మండలంలోని పీచర, మల్లికుదుర్ల, శోడషపల్లి, గుండ్లసింగారం, వేలేరు రెవెన్యూ గ్రామాలతో పాటుగా భీమదేవరపల్లి మండలంలోని ఎర్రబల్లి, కన్నారం గ్రామాలను కలిపారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి గెజిట్‌లో మాత్రం ఈ గ్రామాలతో పాటుగా భీమదేవరపల్లి మండలం ముల్కనూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తకొండ, మల్లారం, ముస్తఫాపూర్ గ్రామాలతో పాటుగా పూర్వపు భీమదేవరపల్లి మండలంలో ఉన్న కట్కూర్, చాపగానితండా గ్రామాలు పునర్విభిజనలో భాగంగా సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పీఎస్‌లో కలిపారు. అయినప్పటికి రెండు గ్రామాలను సైతం వేలేరు ఠాణాలో కలుపుతూ గెజిట్ రావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ముల్కనూర్‌కు మొండిచేయి...
కాగా, భీమదేవరపల్లి మండలం 20 గ్రామాలతో ఉండేది. పునర్విభజనలో మండలంలోని కన్నారం, ఎర్రబల్లి గ్రామాలు వేలేరు మం డలంలోకి, కట్కూరు, చాపగానితండాలు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో కలిశాయి. దీంతో భీమదేవరపల్లి మండలం 15 గ్రామాలకే పరిమితమయ్యాయి. ఇక ఇదే మండలంలో దివంగత ప్రధాని పీవీ నర్సింహరావు గ్రామం వంగరలో ఠాణా ఉంది. దీని పరిధిలో మాణిక్యాపూర్, వంగర, రత్నగిరి, రంగయపల్లి, రాంనగర్ గ్రామాలున్నాయి.
ఇక ముల్కనూర్ ఠాణాకు మిగిలింది 10 గ్రామాలే. అందులో కొత్తకొండ, మల్లారం, ధర్మారం, ముస్తఫాపూర్ గ్రామాలను వేలేరు పీఎస్‌లోకి కలుపుతూ గెజిట్ వెలువడడంతో ఇక ముల్క నూర్ పీఎస్‌కు కేవలం ఆరు గ్రామాలే మిగలనున్నాయి. వేలేరు ఠాణా ఇప్పటివరకు ఎల్కతుర్తి సర్కిల్‌పరిధిలో ఉండగా చిల్పూరు పీఎస్‌ని సర్కిల్ చేసి అందులో వేలేరు ఠాణాను కలపనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు వేలేరు ఠాణాను భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు తరలించనున్నట్లు సమాచారం. ఏది ఎమైనా పోలీస్‌స్టేషన్ల గెజిట్ అస్తవ్యస్తంగా మారిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.