
పౌరసరఫరాల సిబ్బంది సర్దుబాటు
సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో సిబ్బంది సర్దుబాటు ప్రక్రియ మొదలైంది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు కొత్తగా వచ్చేవి కలిపి మొత్తంగా 27 జిల్లాలకు అవసరమైన అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని సర్దుబా టు చేసేందుకు శాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా పౌరసర ఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ, తూనికలు- కొలతల శాఖలకు సంబంధించి జిల్లా స్థాయి అధికారులు మొదలు, కింది స్థాయి ఉద్యోగుల వరకు మార్పులు చేర్పులపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. అందుబాటులో ఉన్న సిబ్బందిని, అధికారులనే అన్ని జిల్లాలకూ సర్దుకోవాల్సి ఉందని ఆ శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల మొదటి వారంలోనే వీరికి పోస్టింగులు ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
పోస్టుల పేర్లు మార్పు...
ఇప్పటి దాకా జిల్లా స్థాయిలో ఉండే జిల్లా సరఫరాల అధికారులు(డీఎస్‌ఓ) ఇక నుంచి జిల్లా పౌరసరఫరాల అధికారులుగా (డీసీఎస్‌ఓ)గా మారనున్నారు. సహాయ సరఫరాల అధికారులు(ఏఎస్‌ఓ) సహాయ పౌరసరఫరా అధికారులు(ఏసీఎస్‌ఓ) అవుతారు. ప్రస్తుతం పదిమంది డీఎస్‌ఓలు అందుబాటులో ఉండ గా, మరో 17 మంది కోసం ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపుతున్నారు. జిల్లా పౌరసరఫరాల సంస్థకు జిల్లా అధికారులుగా ఉండే జిల్లా మేనేజర్ల(డీఎం)ను అదే పేరున పిలుస్తారు. కాకుంటే ప్రస్తుతం ముగ్గురు డీఎంలు మాత్రమే అందుబాటులో ఉన్నారు. గ్రేడ్-1 పోస్టుల్లో 12మంది సహాయక మేనేజర్లు ఉ న్నారు. వీరు కాకుండా మరో 12 మందికి పదోన్నతులిస్తారు.
డీఎం పోస్టుల్లో అసిస్టెంట్ మేనేజర్లకే పోస్టింగులిచ్చి, ఇన్‌చార్జి డీఎంలు గా పరిగణించాలని నిర్ణయించారు. అయితే ధాన్యం సేకరణ అధికంగా ఉండే జిల్లాలకు మూడు జెడ్‌ఎం పోస్టులను కేటాయించడం తోపాటు 10చోట్ల మేనేజర్లకు పోస్టింగులిచ్చి, మిగిలిన 14 జిల్లాల్లో అసిస్టెంట్ మేనేజర్లనే ఇన్‌చార్జి మేనేజర్లుగా నియమించనున్నారు.
ఇకనుంచి డీఎల్‌ఎంఓ...
జిల్లా తూనికలు కొలతల శాఖ (లీగల్ మెట్రాలజీ)కి జిల్లా స్థాయిలో ఇన్‌స్పెక్టర్లు అధికారులుగా ఉన్నారు. ఇకనుంచి వారి ని జిల్లా లీగల్ మెట్రలాజికల్ ఆఫీసర్ (డీఎల్‌ఎంఓ)గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం 14మంది జిల్లా స్థాయి ఇన్‌స్పెక్టర్లున్నారు. మిగిలిన చోట్ల ఇన్‌స్పెక్టర్లకే బాధ్యతలు అప్పజెబుతారు. కానీ వీరిని ఇన్‌స్పెక్టర్లుగానే పరిగణిస్తారు. మరో వైపు మండల స్థాయిలో ఉండే పౌరసరఫరాల స్టాక్ పాయింట్లు (ఎంఎల్‌ఎస్) వద్ద సిబ్బంది కొరత ఈ శాఖను తీవ్రంగా వేధిస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు రెవె న్యూ శాఖ నుంచి డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను డిప్యుటేషన్‌పై తీసుకునే ప్రక్రియను ఇకముందూ కొనసాగిస్తారు. వీరిని ఎంఎల్‌ఎస్ పాయింట్ల కు ఇన్‌చార్జులుగా వ్యవహరిస్తారు.