విడిపోతూ... | shape changing in recognizing of distics in badrachalam and illendu | Sakshi
Sakshi News home page

విడిపోతూ...

Published Wed, Jun 22 2016 2:48 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

విడిపోతూ...

విడిపోతూ...

రూపురేఖలు కోల్పోతున్న
భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలు

ముంపు మండలాల పేరిట....
తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు సందర్భంగా పోలవరం ముంపు మండలాల పేరిట భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండల పరిధిలోని 70 గ్రామాలను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు.

జిల్లాలపునర్విభజనతో...
భద్రాచలం నియోజకవర్గపరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలలను వరంగల్ జిల్లా నుంచి కొత్తగా ఏర్పడ బోయే భూపాలపల్లి జిల్లాలో కలపాలంటూ ఆ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు నివేదించారు.

నియోజకవర్గాల పునర్విభజనతో...
ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలుండగా, 2009లో నియోజకవర్గాల పునర్విభజన పేరిట   గుండాల మండలాన్ని పినపాకలో, కారేపల్లి మండలాన్ని వైరా నియోజకవర్గంలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు.

జిల్లాల పునర్విభజనతో...
కొత్తగా ఏర్పడబోయే మహబూబాబాద్ జిల్లాలోకి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదే జరిగితే ఇల్లెందు నియోజకవర్గంలో మిగిలేవి కామేపల్లి, టేకులపల్లి మాత్రమే.

సాక్షిప్రతినిధి, ఖమ్మం : కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఇల్లెందు, భద్రాచలం నియోజకవర్గాలపై జోరుగా చర్చ సాగుతోంది. ఇల్లెందు నుంచి మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నుంచి రెండు మండలాలను భూపాలపల్లిలోకి కలపాలన్న ప్రతిపాదనలతో వీటిపైనే అందరి దృష్టి నెలకొంది. నియోజకవర్గ కేంద్రంతో సహా ఇల్లెందు రూపురేఖలే మారిపోనున్నారుు. జిల్లాలోనే ఒకప్పుడు ఎనిమిది మండలాలతో, భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న భద్రాచలం మూడు మండలాలకే పరిమితం అయ్యే అవకాశాలున్నాయి. ప్రజాప్రతినిధులు, ప్రజల డిమాండ్లతో ఈ మండలాలను జిల్లాలోనే ఉంచుతారా..? లేక కొత్త జిల్లాల్లో కలుపుతారా..? అన్న దానిపై  ముఖ్యమంత్రి కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 భౌగోళిక వైభవాన్ని కోల్పోనున్న

 భద్రాచలం..
ఐటీడీఏ పరిధిలోకి వచ్చే 24 మండలాల్లో భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాల్లోని మండలాలే కీలకం. ఈ మండలాల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన ఆదివాసీలు, స్థానిక గిరిజన తెగలు ఎక్కువగా నివసిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా భద్రాచలం నియోజకవర్గ పరిధిలోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో కలిపారు. దీంతో ఆపార అటవీ సంపద, కొన్ని ఆదివాసీ జాతులను జిల్లా కోల్పోయింది. రాష్ట్ర విభజనకు ముందు భద్రాచలం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గం. మూడు మండలాలు పూర్తిగా, భద్రాచలం మండలంలోని కొన్ని గ్రామాలు ఏపీలోకి వెళ్లడంతో నియోజకవర్గ జనాభా తగ్గింది.

ఇప్పుడు వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లిలో కలపాలన్న పరిస్థితులతో ఇప్పటికే స్వరూపాన్ని కోల్పోయిన భద్రాచలం నియోజకవర్గం భౌగోళిక వైశాల్యం మరింత తగ్గనుంది. ఇక ఆదివాసీలు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఇల్లెందు నియోజకవర్గానిది ఇదే పరిస్థితి. రాష్ట్రంలోనే అతిపెద్ద మండలంగా ఉన్న గుండాలను ఇల్లెందు నియోజకవర్గం నుంచి.. నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా పినపాకలో కలిపారు. మళ్లీ ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలోకి ఇల్లెందు, గార్ల, బయ్యారం మండలాలను కలపాలని వరంగల్ జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అయితే ఇల్లెందు నియోజకవర్గాన్ని అంతా కొత్తగూడెం జిల్లా పరిధిలోనే ఉంచాలని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

 2009కి ముందు ఇల్లెందు..
నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఇల్లెందు నియోజకవర్గంలో ఇల్లెందు, గార్ల, బయ్యారం, టేకులపల్లి, గుండాల, కారేపల్లి మండలాలున్నాయి. పునర్విభజనతో ఇల్లెందు నియోజకవర్గంలోని గుండాల మండలాన్ని పినపాక, కారేపల్లి మండలాన్ని వైరాలో కలిపారు. అప్పట్లో సుజాతనగర్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న కామేపల్లిని ఇల్లెందులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గం నుంచి గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను మహబూబాబాద్ జిల్లాలోకి కలపాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు.

ఇల్లెందు నియోజకవర్గ మొత్తం వైశాల్యం 1518.91 చదరపు కిలోమీటర్లు. మూడు మండలాలు మహబూబాబాద్ జిల్లాలో కలిపితే ఈ నియోజకవర్గ స్వరూపం పూర్తిగా మారనుంది. నియోజకవర్గ కేంద్రం ఇల్లెందునే మహబూబాబాద్‌లో కలపాలని సోమవారం రాజధానిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ సీఎస్‌కు అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈ మండలాలు మినహాయిస్తే ఈ నియోజకవర్గంలో టేకులపల్లి, కామేపల్లి మండలాలు మిగలనున్నాయి. వీటి వైశాల్యం 591.56 చదరపు కిలోమీటర్లు, జనాభా 67,980 మంది.

 ముంపు మండలాలతో మొదలై..
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ముంపు మండలాలు విలీనం కాకముందు భద్రాచలం నియోజకవర్గ జనాభా 3,27,945. భద్రాచలం మండలంలోని 70 గ్రామాలు, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లోని 277 గ్రామాలను ఏపీలో విలీనం చేశారు. దీంతో ఈ మండలాల నుంచి 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరిలోకి వెళ్లింది. ప్రస్తుతం భద్రాచలం నియోజకవర్గంలో 1,96,417 మంది జనాభా ఉన్నారు.

తాజాగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలు కొనసాగుతున్నాయి. వాజేడు మండలంలో 24,816 మంది, వెంకటాపురం మండలంలో 31,765 మంది జనాభా ఉన్నారు. భూపాలపల్లి జిల్లాలో ఈ మండలాలను కలిపితే భద్రాచలం నియోజకవర్గంలో దుమ్ముగూడెం, చర్ల, భద్రాచలం మండలాలు ఉండనున్నాయి. వాజేడు, వెంకటాపురం మండలాల జనాభాను మినహాయిస్తే భద్రాచలం నియోజకవర్గ జనాభా 1,39,836 మంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement