కొత్త జిల్లాలపై ప్రకంపనలు | strikes for new districs | Sakshi
Sakshi News home page

కొత్త జిల్లాలపై ప్రకంపనలు

Published Sun, May 15 2016 3:56 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

కొత్త జిల్లాలపై ప్రకంపనలు - Sakshi

కొత్త జిల్లాలపై ప్రకంపనలు

తెరపైకి వస్తున్న కొత్తకొత్త డిమాండ్లు
ఆందోళనలకు సిద్ధమవుతున్న నాయకులు
సమన్యాయం పాటించాలని వినతులు
‘పట్నం’ను జిల్లా కేంద్రం చేయాల్సిందే

తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల పునర్విభజన నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రభుత్వం సూత్రప్రాయంగా ప్రకటించిన జిల్లా కేంద్రాల ఏర్పాటుపై వివిధ ప్రాంతాల ప్రజలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. గత కొన్నేళ్లుగా ఉన్న డిమాండ్‌లతో పాటు కొత్తగా తమ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలంటూ ఉద్యమబాట పట్టారు. అన్ని ప్రాంతాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమన్యాయం చేయాలని కోరుతున్నారు.  - సాక్షి, నెట్‌వర్‌‌క

ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని, లేకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రం గారెడ్డి అన్నారు. జేఎసీ అధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న నియోజకవర్గాన్ని 115 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరిలో కలుపుతామని సరికాదన్నారు. ఈ ప్రాంతంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలోనే ఆయా నియోజకవర్గాలు ఉంటాయన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి సహకరిస్తే మేమంతా మద్దతుగా నిలుస్తామని చెప్పారు. జిల్లా కేంద్రం కోసం మంత్రి మహేందర్‌రెడ్డితో పాటు ప్రభుత్వ సీఎస్, కలెక్టర్‌కు మరోసారి విన్నవిస్తామని తెలిపారు.

అయినా నిర్ణయాన్ని మార్చుకోకుంటే లక్షమందితో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. టీటీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొంగర విష్ణువర్థన్‌రెడ్డి మాట్లాడుతూ జేఏసీని ఎమ్మెల్యే కలగూర గంపతో పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు అమృతసాగర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని అర్హతలు ఇబ్రహీంపట్నంకు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జేఎసీ జిల్లా చైర్మన్ చల్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కంబాలపల్లి గురునాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు రాచర్ల వెంకటేశ్వర్లు, కృపేష్, కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.

పశ్చిమ రంగారెడ్డిలో కలపొద్దు
మొయినాబాద్ : వికారాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో మొయినాబాద్ మండలాన్ని ఎట్టి పరిస్థితుల్లో కలపనివ్వమని అఖిలపక్షం నేతలు పేర్కొన్నారు. శనివారం మొయినాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సమావేశమైన అఖిలపక్ష నాయకులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. పశ్చిమ రంగారెడ్డిలో మొయినాబాద్‌ను కలపొద్దనే డిమాండ్‌తో సాగుతున్న ఉద్యమంలో అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 16 నుంచి ప్రత్యక్ష కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. మొదట ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.

ఇప్పటికే 111 జీఓతో నష్టపోయిన మొయినాబాద్‌ను వికారాబాద్‌లో కలిపితే జరిగే నష్టాలను తెలియజేస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మండలాన్ని ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా పశ్చిమ రంగారెడ్డిలో కలిపితే సహించేది లేదన్నారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ చంద్రలింగంగౌడ్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు మల్లేష్‌యాదవ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొత్త నర్సింహారెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు గున్నాల గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కొమ్మిడి వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌లు నవీన్‌కుమార్, పాషా, సుధాకర్ యాదవ్, ఎంపీటీసీలు మాధవరెడ్డి, గణేష్‌గౌడ్, యాద య్య, కోఆప్షన్ సభ్యుడు అహ్మద్, మాజీ ఎంపీపీ కండిక రమేష్ పాల్గొన్నారు.

జిల్లా కేంద్రం కోసం.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
చేవెళ్ల : పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న చేవెళ్లను జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం చేస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు పడాల వెంకటస్వామి అన్నారు. శనివారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చేవెళ్లకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విచిత్రమైన భౌగోళిక పరిస్థితి నుంచి విడగొట్టి గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలను కలుపుతూ చేవెళ్లను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ రెండు మూడు దశాబ్దాలుగా ఉందని తెలిపారు. నగరానికి ఆనుకుని ఉండడం, హైదరాబాద్ - బీజాపూర్ రహదారిని కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే జాతీయ రహదారిగా అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, కర్నాటక రాష్ట్రానికి కూడా చేవెళ్ల మీదుగా రహదారి ఉండడం వంటి అంశాలు జిల్లా కేంద్రంగా ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయన్నారు.

అంతేకాకుండా వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాలకు సైతం దగ్గరలో ఉండడం కూడా కలిసొచ్చే అంశంగా పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేస్తే మొయినాబాద్ లాంటి హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న మండలాలకు దూరమవుతుందని, అంతేకాకుండా ఆ మండల ప్రజలు సైతం వికారాబాద్ జిల్లాలో కలవడానికి అంగీకరించడం లేదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి పి.గోపాల్‌రెడ్డి, ఆలూరు సొసైటీ వైస్ చైర్మన్ మాధవగౌడ్, ముడిమ్యాల పీఏసీఎస్ డెరైక్టర్ ఎన్.మాధవరెడ్డి, దశరథ తదితరులు పాల్గొన్నారు.

 రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజించాలి టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విఠల్
వికారాబాద్ రూరల్ : జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వికారాబాద్ కేంద్రంగా పశ్చిమ రంగారెడ్డి జిల్లాగా, ఈస్ట్ మండలాలను కలుపుకుని తూర్పు రంగారెడ్డి జిల్లాగా మాత్రమే ఏర్పాటు చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు యు.విఠల్, ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, రెవెన్యూ పరంగా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని రంగారెడ్డిని రెండు జిల్లాలుగా విభజిస్తే సముచితంగా ఉంటుందన్నారు. అలా కాకుండా రంగారెడ్డి జిల్లాలోని మండలాలను వీడదీసి ఐదు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఈ ప్రాంత ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోందన్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో 50 శాతం పైగా నాన్ లోకల్ వారు ఉన్నారని, వారిని జిల్లా నుంచి ఇప్పటి వరకు పంపించకపోవడంతో స్థానిక గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు అవకాశాలు దక్కడం లేదన్నారు. జిల్లాల విభజన పేరుతో ప్రజలు, ఉద్యోగ ఉపాధ్యాయుల మధ్య విభేదాలు సృష్టించవద్దని కోరారు. వెంటనే పునర్విభజనపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని బహిర్గతం చేయాలని కోరారు.

‘సైబరాబాద్‌లోనే కలపాలి’
మొయినాబాద్ రూరల్ : జిల్లాల పునర్విభజనలో భాగంగా మొయినాబాద్ మండలాన్ని వికారాబాద్‌లో కాకుండా సైబరాబాద్‌లోనే కలపాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గ సభ్యుడు కంజర్ల ప్రకాశ్ డిమాండ్ చేశారు. శనివారం హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌కు కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొయినాబాద్‌ను 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్‌లో కలపాలని చూడడం తగదన్నారు. ఇలా స్తే మండల ప్రజలకు ఇబ్బందులు తప్పవన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మొయినాబాద్‌ను సైబరాబాద్‌లో కలపడం వల్ల అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని పశ్చిమ రంగారెడ్డిలో కాకుండా సైబరాబాద్‌లో కలపాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement