కొడంగల్‌లో 'కారు' చిచ్చు
కొడంగల్‌లో 'కారు' చిచ్చు
Published Mon, Oct 17 2016 3:01 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM
అఖిలపక్ష, నియోజకవర్గ సాధన నాయకుల మండిపాటు
ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీరుపై అసహనం
గ్రామాలకూ పాకిన నిరసన సెగలు
నియోజకవర్గంలో చెలరేగిన విభజన సెగలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా రాత్రికిరాత్రే అధికార పార్టీ నాయకులు తమ ప్రాంతాన్ని ఇష్టానుసారంగా చీల్చారని అఖిలపక్ష నాయకులు మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే తమ బతుకుల్లో చిచ్చు పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. విభజన‘కారు’లను చరిత్ర క్షమించదని హెచ్చరించారు. పునర్విభజనను నిరసిస్తూ గోకఫసల్‌వాద్‌లో ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. కొడంగల్‌లో ఆందోళనకారులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలు సైతం రోడ్డెక్కి ఆందోళన చేశారు.
కొడంగల్: జిల్లాల పునర్విభజనలో కొడంగల్‌కు తీరని అన్యాయం జరిగిందని నిరసిస్తూ అఖిలపక్షం, కొడంగల్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. పట్టణ మాజీ సర్పం చ్ రమేష్‌బాబు, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు సోమశేఖర్, అధ్యాపకుడు వేణుగోపాల్, దళిత సంఘం నాయకుడు రాజు, దస్తప్ప, శ్రీనివాస్ దీక్షలో కూర్చున్నారు. రంగారెడ్డి డీసీసీ అధికార ప్రతినిధి, బీసీ వెల్ఫేర్ లీగల్ సెల్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, ఎమ్‌ఐఎం తాలూకా అధ్యక్షుడు గుల్షన్, కోస్గి ఎంపీపీ ప్రతాప్‌రెడ్డి శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు శిబిరంలో కూర్చున్న వారికి తిరుపతిరెడ్డి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కొడంగల్‌కు జరిగిన అన్యాయాన్ని చరిత్ర క్షమించిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి కావాలని కొడంగల్‌కు నామరూపాల్లేకుండా చేస్తున్నారని నిట్టూర్చారు. తమ నియోజకవర్గాన్ని పాలమూరులో ఉంచాలని డిమాండ్ చేశారు. బషీర్, చంద్రప్ప, కరెంటు రాములు, సురేష్, మహ్మద్ యూసూ ఫ్, నందారం ప్రశాంత్, శ్యాంసుందర్ పాల్గొన్నారు.
ఆందోళన తీవ్రరూపం...
దౌల్తాబాద్: పునర్విభజన నేపథ్యంలో దౌల్తాబాద్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలపడంపై అఖిలపక్షం నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాలుస్తోంది. ఆదివారం ఆరో రోజు కొనసాగిన నిరసన కార్యక్రమాల్లో పలు ఉద్రిక్త సంఘటనలు చోటుచేసుకున్నాయి. గోకఫసల్‌వాద్‌లో కృష్ణ అనే వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి రెండు గంటలపాటు నిరసన తెలిపాడు. గ్రామానికి చెందిన యువకులు, విద్యార్థులు రోడ్డుపై ధర్నా, అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. చల్లాపూర్ నుంచి మండల కేంద్రం వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. కొడంగల్‌లో చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరానికి చేరుకుని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో రాస్తారోకో నిర్వహించారు. మండల కేంద్రంలోని నారాయణపేట–కొడంగల్ రహదారిపై ఆందోళన చేశారు. వందలాది మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, కోస్గి మండల టీడీపీ నాయకులు ప్రతాప్‌రెడ్డి, డీకే రాములు ఆందోళనకారులకు మద్దతు ప్రకటించారు. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. ఆరు రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా.. స్థానిక ఎమ్మెల్యే మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధర్నాకు ఆయన రాకుండా తన సోదరుడిని పంపించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిం చారు. వెంకట్‌రెడ్డి, వెంకట్రావు, మహిపాల్‌రెడ్డి, వెంకటయ్య, రెడ్డి శ్రీని వాస్, భీములు, మోహ నాయక్, విద్యావంతుల వేదిక కన్వీనర్ వెంకటేశ్, వీరన్న, హన్మిరెడ్డి ఉన్నారు.
న్యాయపోరాటం చేస్తాం..
కొడంగల్: తమ నియోజకవర్గానికి జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేస్తామని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి అన్నారు. పట్టణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కొడంగల్‌పై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా రాత్రికిరాత్రే తమ నియోజకవర్గాన్ని చీల్చారని ఆవేదన వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు హన్మంత్‌రెడ్డి, ప్రశాంత్, మహ్మద్ యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement