జిల్లాలపై చర్చకు రా: డీకే అరుణ సవాల్
- రెండు రోజులు ఇందిరాపార్కు దగ్గరే ఉంటా..
- అల్లుడు, కూతురు, కొడుకు ఎవరొచ్చినా చర్చిస్తా..
- సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ సవాల్
సాక్షి, హైదరాబాద్: ‘రెండు రోజులపాటు ఇందిరాపార్కు దగ్గరే ఉంటా. జిల్లాల పునర్విభజనపై ఇక్కడకొచ్చి నిజాలు చెప్పడానికి దమ్ముంటే సీఎం కేసీఆర్ రావాలి. రాలేకపోతే ఆయన కొడుకో, కూతురో, అల్లుడో ఎవరు వస్తారో తేల్చుకోవాలి. ఎవరు వచ్చినా జిల్లాల ఏర్పాటులో అశాస్త్రీయత, ప్రజల ఇబ్బందులు, టీఆర్‌ఎస్ రాజకీయ స్వార్థం బయటపెడతా. ఎయిర్‌పోర్టులో కాదు సవాళ్లు.. అఖిలపక్షం పెడితే కేసీఆర్ అసలు రంగు బయటపెడతా’ అని మాజీ మంత్రి, గద్వాల శాసనసభ్యురాలు డీకే అరుణ ప్రకటించారు. గద్వాల, జనగామ జిల్లాల కోసం డీకే అరుణ, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద 48 గంటల నిరాహారదీక్షకు దిగారు.
సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలిలో సీఎల్పీ నేత షబ్బీర్‌అలీ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టివిక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు దీక్షకు సంఘీభావం తెలిపారు. డీకే అరుణ మాట్లాడుతూ.. జిల్లాల పునర్విభజనలో అశాస్త్రీయత, రాజకీయ కుటిలత్వాన్ని బయటపెడతానన్నా రు. జిల్లాల పునర్విభజనపై కేసీఆర్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. జిల్లాల ముసాయిదాలో చాలా అభ్యంతరాలను కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిందని, అయినా కాంగ్రెస్ పార్టీ ఆమోదం చెప్పిందనే లా ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.
మార్గదర్శకాలను ప్రశ్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం లేదన్నారు. ప్రజల అవసరాలు, శాస్త్రీయత, భౌగోళిక స్వరూపం, చారిత్రక నేపథ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోకుండా సీఎం ఒక రాజులా జిల్లాలను ముక్క లు చేస్తున్నారని, వాటిని సామంత రాజ్యాలుగా చేసి ఒక్కొక్కరికీ అప్పగించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. బంగారు తెలంగాణ మం త్రుల కోసమా.. ప్రజల కోసమా.. అని ప్రశ్నించారు. వీటిని ప్రశ్నిస్తే సీఎంగా ఉన్న కేసీఆర్ వీధి రౌడీలా సవాళ్లు విసురుతున్నారన్నారు.
కేవలం 30 లక్షల జనాభా ఉన్న మెదక్‌ను మూడు జిల్లాలు చేసిన కేసీఆర్.. ఆయన్ను ఎంపీగా గెలిపించిన పాలమూరుకు అన్యాయం చేస్తున్నారని అరుణ ఆరోపించా రు. మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు: భట్టి
రాష్ట్రంలోని ఎన్నో సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తారని భయపడుతున్న కేసీఆర్ నిత్యం వారిని పక్కదారి పట్టిస్తున్నారని భట్టివిక్రమార్క ఆరోపించారు. ప్రజల అవసరాలపై సోయితో పాలించకుంటే టీఆర్‌ఎస్‌కు శంకరగిరి మాన్యాలు తప్పవని మండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాత్రి పూట మూడు మాటలు చెప్పేవారి మాటలు నమ్మి కేసీఆర్ మోసపోతున్నారని, తలతిక్క పనులు చేస్తే మెడలు వంచే శక్తి ప్రజలకు ఉందని హెచ్చరించారు. మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో మంత్రి తలసాని ఓడిపోతారనే భయంతో సనత్‌నగర్‌లో ఇళ్లు కట్టించిన ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు.
కేసీఆర్ బుర్రకు వచ్చిందే నిర్ణయం: చాడ
సీఎం కేసీఆర్‌కు బుర్రలో ఏ ఆలోచన వస్తే అదే బాటలో నిర్ణయం తీసుకుంటున్నారని చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మండలాలు, రెవెన్యూ, జిల్లాల విభజనలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. జిల్లాల విభజనలో విధివిధానాలు శాస్త్రీయంగా ఉండాలని, ప్రజల అవసరాలు, మనోభావాలు, వనరులను దృష్టిలో పెట్టుకోకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారని విమర్శించారు. జిల్లాల విభజనలో దూరదృష్టి ఉండాలని సూచించారు.
మారకుంటే బొంద పెడతారు పొన్నాల లక్ష్మయ్య
ప్రజాస్వామ్య పునాదులపై ఏర్పా టైన తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నిరంకుశపాలన సాగిస్తున్నారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేసీఆర్ ప్రభుత్వం వెర్రి చేష్టలు చేస్తోందన్నారు. తీరు మార్చుకోకుంటే కేసీఆర్‌ను, టీఆర్‌ఎస్‌ను ప్రజలే బొంద పెడతారని హెచ్చరించారు. జనగామను జిల్లా చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు.
శాస్త్రీయతను గాలికొదిలేశారు జానా, షబ్బీర్
జిల్లాల పునర్విభజనపై శాస్త్రీయ ధృక్ఫథాన్ని, పద్ధతులను కేసీఆర్ గాలికి వదిలేశారని జానారెడ్డి, షబ్బీర్‌అలీ అన్నా రు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు గండి కొడుతున్నారని, గద్వాల, జనగామ ప్రజాభిప్రాయం మేరకు వాటిని జిల్లాలుగా ప్రకటించాలన్నారు. కేసీఆర్‌కు అబ ద్ధాలు చెప్పకుంటే నిద్రరాదని షబ్బీర్‌అలీ విమర్శించారు. అడ్డగోలుగా జిల్లాల విభజన చేస్తున్నారన్నారు. డీకే అరుణకు భయపడి ప్రభుత్వం గద్వాలను జిల్లా చేయకుండా అడ్డుకుంటోందన్నారు. జిల్లాల పునర్విభజనను సింగిల్ జడ్జి కమిషన్‌తో పూర్తి చేయాలన్నారు.