సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం భర్త ఫోటోను మార్చి వేరొకరి ఫోటోతో ఓ మహిళ చిత్రాన్ని ప్రచురించినందుకు గాను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి డి.కె.అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పథకాల ప్రచారంలో భాగంగా భర్త ఫోటో మారి పత్రికల్లో ప్రచురితమయిన కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన నాయకుల పద్మావతి కుటుంబంతో కలసి అరుణ గురువారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయికైనా దిగజారుతుందనేందుకు ఇది తార్కాణమన్నారు.
రుణాలిస్తామని ఫోటోలు తీసుకెళ్లి వాటిని సంబంధం లేని అనేక పథకాల్లో ఉపయోగించడం దారుణమన్నారు. సెంటు భూమి లేని ఈ కుటుంబానికి రైతుబంధు కింద మేలు కలిగిందని, రైతు బీమా వచ్చిందని చెప్తూ పచ్చి అబద్ధాలను ప్రభుత్వం ఎలా ప్రచారం చేసుకుంటుందో గమనించాలన్నారు. తన భర్త స్థానంలో వేరొక వ్యక్తిని మార్చి పత్రికల్లో ప్రచురించడం భారత స్త్రీకి జరిగిన ఘోరమైన అవమానంగా భావించాలన్నారు. పద్మను మానసిక క్షోభకు గురిచేసినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని, యాడ్ ఏజెన్సీపై చర్యలతో సరి అంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
బాధిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇవ్వాలని, రైతు బంధు, రైతుబీమాతో పాటు అన్ని ప్రభు త్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.అలాగే టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న మోసానికి పరాకాష్టే ఈ ఘటన అని అన్నారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబం తమను ఆశ్రయించిందని, వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పారు.
గోడు వెళ్లబోసుకున్న పద్మ దంపతులు
విలేకరుల సమావేశంలో పాల్గొన్న పద్మ దంపతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో ఉన్నప్పుడు రెండేళ్ల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఈ ఫోటోలు తీసుకుని వెళ్లారని చెప్పారు. పద్మ మాట్లాడుతూ గుడుంబా తాగని తన భర్త ఫోటో పెట్టి అప్పుడు పరువుతీశారని, ఇప్పుడు తన పక్కన మరో వ్యక్తి ఫోటో పెట్టి పరువు తీసి రోడ్డున పడేశారని కన్నీటి పర్యంతమయ్యారు.ప్రభుత్వ రుణాలు వస్తాయని చెప్పి ఫోటోలు తీశారని చెప్పారు. నాగరాజు మాట్లాడుతూ తన భార్య పక్కన ఇంకో వ్యక్తి ఫోటో పెట్టి ప్రకటనల్లో ప్రచురించడంతో తనకు అవమానకరమన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment