రైతు వ్యతిరేక విధానాలకు పరాకాష్ట
టీపీసీసీ నేత డీకే అరుణ
సాక్షి, హైదరాబాద్: గద్వాల్ జిల్లా గట్టు మండలం ఆలూరు కి చెందిన మల్లేశం అనే రైతు సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలకు పరాకాష్ట అని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. మల్లేశం వ్యవసాయం కోసం లక్ష లాది రూపాయలు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు.
గతంలో సీఎం క్యాంపు కార్యా లయానికి వెళ్తే కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత కలసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కవిత హామీని నమ్మిన మల్లేశం చాలాసార్లు సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగాడని, అతడిని కనీసం లోపలికి కూడా రానీయకుండా అవమానించారని డీకే పేర్కొన్నారు. దీంతో మల్లేశం ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు.