సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 82 పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. అలాగే పోలీసు కమిషనరేట్ల సంఖ్యను ఎనిమిదికి పెంచుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కమిషనరేట్లతో పాటు కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్లను, రామగుండం, మంచిర్యాల పట్టణాలను కలిపి మరో కమిషనరేట్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్‌లోని పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం హోం మంత్రి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతన జిల్లాలకు సిబ్బంది సర్దుబాటు, నూతన స్టేషన్లు తదితర వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 118 కొత్త మండలాలు ఏర్పడుతున్నాయని, వాటికి అనుగుణంగా 82 పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
అలాగే 23 సర్కిళ్లు, 22 సబ్ డివిజన్ల ఆవశ్యకత ఉందన్నారు. కొత్త కమిషనరేట్లుగా కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేటలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే మంచిర్యాల, రామగుండం ప్రాంతాలు పెద్దవిగా ఉండటం చేత రెండు పట్టణాలను కలిపి కమిషనరేట్ చేయాల్సిన అవసరముందన్నారు. అనంతరం హోం మంత్రి నాయిని మాట్లాడుతూ పెద్ద జిల్లాలకు సీనియర్ అధికారులను, చిన్న జిల్లాలకు కింది స్థాయి అధికారులను కేటాయించాలని డీజీపీకి సూచించారు.
హోంశాఖకు సీఎం అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అందుకే కొత్త వాహనాలు, స్టేషన్ల నిర్వహణ ఖర్చులతో పాటు వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, వరంగల్ కమిషనర్ సుధీర్‌బాబులతో పాటు సీనియర్ అధికారులు, జిల్లాల ఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగా 82 పోలీస్‌స్టేషన్లు: నాయిని
Published Thu, Oct 6 2016 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
Advertisement
Advertisement