సాక్షి, హైదరాబాద్ : మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి నాయిని అహల్య (64) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. భర్త చనిపోయి 4 రోజులు గడవక ముందే ఆమె కూడా తుది శ్వాస విడిచారు. తండ్రి చనిపోయిన బాధ నుంచి కోలుకోక ముందే తల్లి కూడా మరణించడంతో వారి కుమారుడు, కూతురు కన్నీరు మున్నీరవుతున్నారు. గత నెల 28న నాయినికి, ఆ తర్వాత ఆయన భార్య అహల్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో వారిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నెల 10న పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ నెగెటివ్ వచ్చింది. అదే సమయంలో ఇద్దరికీ ఈ నెల 13న న్యుమోనియా సోకింది. ఆరోగ్యం క్షీణించడంతో నాయిని ఈ నెల 22న ఆస్పత్రి లో కన్నుమూశారు. భర్తను కడసారి చూసేందుకు అహల్యను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లోనే తీసుకొచ్చి చూపించి మళ్లీ తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షీణించింది.
నీతోపాటే నేనూ..
నల్లగొండ జిల్లా నేరేడుగొమ్మ గ్రామం నాయిని నర్సింహారెడ్డిది కాగా, దానికి 5 కి.మీ. దూరంలోని పెద్ద మునిగాల గ్రామం అహల్యది. మేనమామ కూతురు అయిన అహల్యను నాయిని పెళ్లి చేసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, ప్రగతి శీల ఉద్యమాలకు అండగా నిలిచిన నాయినిపై ఎన్నో కేసులు పోలీసులు పెట్టినా ఆమె ఎన్నడూ కుంగిపోలేదు. ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. నాయిని ఎంత బిజీగా ఉన్నా ఇంటికి వెళ్లే సమయంలో భార్యకు ఫోన్ చేసి ఆమెకు కావాల్సినవి తీసుకెళ్లేవారు. అహల్య పార్థివ దేహాన్ని మంగళవారం ఉదయం బంజారాహిల్స్ మినిస్టర్ క్వార్టర్స్‌లోని ఆమె నివాసానికి తీసుకు రానున్నారు. అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం మహాప్రస్థానంలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. చదవండి: బుల్లెట్ వీరుడు.. మీసాల సూర్యుడు..
సీఎం కేసీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: నాయిని అహల్య మృతికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment