నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్.. | districts collecters with Chief Secretary Rajiv Sharma | Sakshi
Sakshi News home page

నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్..

Published Tue, Jun 21 2016 8:52 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్..

నివేదికలు ఒకే... నిర్ణయం పెండింగ్..

సాక్షిప్రతినిది, నిజామాబాద్ : జిల్లాల పునర్విభజనపై సోమవారం హైదరాబాద్‌లో జిల్లా కలెక్టర్లతో చీఫ్ సెక్రెటరీ రాజీవ్‌శర్మ నిర్వహించిన సమావేశంలో జిల్లాకు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించిన సమావేశంలో.. మన జిల్లా విభజనకు సంబంధించి కలెక్టర్ డాక్టర్ యోగితారాణా చేసిన పలు ప్రతిపాదనలకు సానుకూల స్పందన వచ్చినట్లు సమాచారం.

అయితే జిల్లాల ఏర్పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు, భౌగోళిక పరిస్థితులు, ఆయా మండలాల్లో మార్పులు, చేర్పులు తదితర అంశాలకు సంబంధించి కలెక్టర్ రూపొందించిన నివేదికపై మాత్రం సీఎస్ రాజీవ్‌శర్మ, సీసీఎల్‌ఏ కమిషనర్ రేమండ్ పీటర్‌లు నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది. కలెక్టర్ జిల్లాలోని కామారెడ్డి జిల్లా ఏర్పాటుకు సంబంధించి పునర్‌వ్యవస్థీకరణ అంశాలకు సంబంధించి వారం రోజుల పాటు అధికారులతో కసరత్తు చేశారు.

కొత్త మండలాల ఏర్పాటు, డివిజన్ల ఏర్పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విన్నపాలు, ప్రజాప్రతినిధులు, సూచనలను పరిగణనలోకి తీసుకొని రూపొందించిన నివేదికను కలెక్టర్  సీఎస్‌కు అందించారు. జిల్లా పునర్విభజనలో భాగంగా ఏర్పడే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు సంబంధించి కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాకు చెందిన మండలాలు ఇతర జిల్లాల్లో కలిపే తదితర అంశాలను కలెక్టర్ తన నివేదికలో పేర్కొన్నారు. అయితే ఆ నివేదికలను పరిశీలించిన సీఎస్ మాత్రం నిర్ణయాలను పెండింగ్‌లో పెట్టినట్లు తెలిసింది.

తొలి రోజు సమావేశంలో పలువురు కలెక్టర్లు సమర్పించిన నివేదికలపై కూడ అన్ని కోణాల్లో పరిశీలించిన మీదటే పునర్‌విభజన కొనసాగుతుందని ఈ సందర్భంగా కలెక్టర్‌లకు తెలిపినట్లు సమాచారం. బాన్సువాడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, 10 మండలాల ఏర్పాటుపై మాత్రం స్పష్టత వచ్చినట్లు తెలిసింది. జిల్లా ఏర్పాటులో భాగంగా మొదట అనుకున్న ప్రకారం కామారెడ్డిలో నాలుగు నియోజక వర్గాలు, నిజామాబాద్‌లో 5 నియోజక వర్గాలు ఉండే విధంగా కలెక్టర్ నివేదించడంపై సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే జూలై 5న మరోమారు జిల్లా కలెక్టర్లతో జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. కలెక్టర్ సూచించిన నివేదికలను పరిశీలించి ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన సీఎం కేసీఆర్ మరికొన్ని విన్నపాలను పరిగణనలోకి తీసుకొని కలెక్టర్ల నివేదికల ఆధారంగా పునర్ వ్యవస్థీకరణ ప్రారంభించే అవకాశం ఉంది. కలెక్టర్లతో సమావేశం ముగియగానే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకువచ్చే ఉత్తర్వులు జారీ చేస్తారన్న చర్చ సాగుతోంది.
 
ముగిసిన మొదటి రోజు సమావేశం..
హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల మొదటిరోజు సమావేశం ముగియగా.. ఎలాంటి నిర్ణయాలు మాత్రం వెలువడ లేదు. అయితే సమావేశంలో చర్చించిన అంశాలను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పొక్కకుండా జాగ్రత్త పడిన అధికారులు...‘పునర్విభజన ప్రక్రియలో ముందుకు సాగండి’ అని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో కలెక్టర్లు ఇక పునర్విభజన ప్రతిపాదనలపై ఏమీ మాట్లాడకుండా కొత్తగా ఏర్పడే మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల్లో భవనాల నిర్మాణం, తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు, అధికారులు, ఉద్యోగుల విభజనపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. జిల్లాకు సంబంధించి భౌగోళిక పరిస్థితులు, జనాభా, భూగర్భవనరులు, రేఖాచిత్రాలు, ఉద్యోగుల విభజన పలు అంశాలపై వారు మరింత దృష్టి పెట్టనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రూట్ మ్యాప్‌ను అమలులోకి తీసుకురావడం , కార్యాలయాలు, ఉద్యోగుల  ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాలను వేగవంతం చేసే అవకాశం కూడ ఉంది.

వీటన్నింటితో మారోసారి జులై 5 సమావేశం అనంతరం వీటికి సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేయనున్నారన్న చర్చ సాగుతోంది. అందుకు అనుగుణంగానే కలెక్టర్లు కూడా విభజన అంశాల్లో మరింత వేగం పెంచి ప్రాంతాలు విభజన కొత్త మండలాలు, రెవెన్యూ మండలాల, కార్యాలయాలను ప్రారంభించడం వంటి ముఖ్యమైన అంశాలను ఒక కొలిక్కి తీసుకు రావాల్సి ఉంది. దసరా కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు జరుగాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పనులు మరింత వేగంగా జరుగనున్నాయి. వచ్చే నెలలో సమావేశం తర్వాత పునర్విభజనపై పూర్తి స్పష్టత రానుంది.
 
నిజామాబాద్ మండలాన్ని నిజామాబాద్ అర్బన్, రూరల్‌గా, బోధన్ మండలాన్ని అర్బన్, రూరల్‌గా, ఆర్మూర్ మండలాన్ని ఆర్మూర్, ఆలూర్‌గా, కామారెడ్డిని కామారెడ్డి, దేవునిపల్లిగా విభజించనున్నారు. వర్ని మండలంలోని రుద్రూర్‌ను మండల కేంద్రం చేయనున్నారు. అలాగే దోమకొండలోని బీబీపేట, భిక్కనూరులోని రాజంపేట, సదాశివనగర్ మండలంలోని రామారెడ్డిని మండలాలుగా ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. డిచ్‌పల్లి, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని కొన్ని గ్రామాలు కలిపి మరో మండలం చేసే అవకాశాలున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement