
జనాభాలో ఫస్ట్... విస్తీర్ణంలో లాస్ట్
జిల్లాల పునర్విభజన తర్వాత హైదరాబాద్ ముఖచిత్రమిది
* విస్తీర్ణపరంగా అగ్రస్థానంలో నల్లగొండ
* జనాభాలో అతి చిన్న జిల్లాగా సిరిసిల్ల
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరమే అత్యధిక జనాభా గల జిల్లాగా అవతరించనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లా 39.43 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో రంగారెడ్డి (25.51 లక్షలు), మేడ్చల్(మల్కాజిగిరి) (25.51 లక్షలు) ఉన్నాయి. అతి తక్కువ జనాభా గల జిల్లాగా రాజన్న (సిరిసిల్ల) జిల్లా ఏర్పాటు కానుంది.
జనాభాపరంగా మొదటి స్థానంలో ఉన్న హైదరాబాద్.. విస్తీర్ణంలో మాత్రం 217 చదరపు కిలోమీటర్ల పరిధితో చిన్న జిల్లాగా మిగలనుంది. నల్లగొండ జిల్లా 6,862.78 చ.కి.మీ. విస్తీర్ణంతో అతిపెద్ద జిల్లాగా అవతరించనుంది. భూపాలపల్లి(జయశంకర్ జిల్లా) 6,175.21 చ.కి.మీ. పరిధితో రెండోస్థానంలో, రంగారెడ్డి జిల్లా (5,005.98 చ.కి.మీ.) మూడో స్థానంలో నిలిచింది.