
ఉద్యోగులెందరు?
♦ సమాచారం కోరిన సర్కారు
♦ జిల్లాల పునర్విభజన ప్రక్రియ వేగవంతం
♦ కొత్త జిల్లాలకు అవసరమైన సిబ్బంది కూడా..
♦ నయా జిల్లాలకు 1,000-1,300 ఉద్యోగులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణపై సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాల ముఖచిత్రం దాదాపుగా కొలిక్కి వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడే జిల్లాలు, మండలాలు, డివిజన్లకు ఏ మేరలో ఉద్యోగులు అవసరమవుతారనే లెక్కలపై ఆరా తీస్తోంది.
ఈ మేరకు శనివారం సాయంత్రంలోగా నిర్దేశిత నమూనాలో శాఖల వారీగా సమాచారాన్ని పంపాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) రేమాండ్ పీటర్ శుక్రవారంఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద ప్రస్తుతం వివిధ విభాగాల్లో ప్రస్తుత కేడర్ స్ట్రెంత్, పనిచేస్తున్న సంఖ్య, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలతో నివేదిక తయారు చేసింది. అలాగే ప్రతిపాదిత జిల్లాలకు అవసరమయ్యే స్టాఫ్, అదనంగా ఎంత మందిని సర్దుబాటు చేయాలో పేర్కొంటూ సీసీఎల్‌ఏకు ప్రతిపాదనలు పంపింది.
ఉద్యోగులు 34,426
జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకుంది. ఈ వివరాలను ఉద్యోగుల కుల, రిజర్వేషన్ల ప్రకారం విభజించి ప్రత్యేక నివేదిక తయారు చేసింది. ఈనేపథ్యంలో జిల్లాలో 34,426 మంది ఉద్యోగులున్నారు. వీరిలో పురుషులు 19,392, మహిళలు 15,034 మంది ఉన్నారు. అయితే ఇది ప్రాథమిక నివేదిక మాత్రమే. ఇందులో 38 శాఖలకు సంబంధించిన ఉద్యోగులు మాత్రమే ఉన్నారు.
శనివారం సాయంత్రంలోగా ఉద్యోగుల సంఖ్య, రిజర్వేషన్ల వారీగా మహిళలు, పురుషుల సంఖ్య కొలిక్కి రానుంది. ఇదిలావుండగా, కొత్తగా ఏర్పాటుచేసే జిల్లాల పరిధిలో ప్రస్తుత ఉద్యోగులకు అదనంగా సగటున 1000-1300 మంది ఉద్యోగులు అవసరమని సర్కారు భావిస్తోంది. కలెక్టరేట్‌లో 300, జిల్లా పరిషత్‌లో 100, మిగతా జిల్లా ఉన్నత విభాగాల్లో(హెచ్‌ఓడీ) 900 మేర అవసరమవుతారని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఇప్పటికిప్పుడు ఉద్యోగులను భర్తీ చేయడం కష్టమని భావిస్తున్న సర్కారు.. కొన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ఆలోచిస్తోంది. తద్వారా కొత్త జిల్లాల్లో ఉద్యోగులను సర్దుబాటు చేసుకోవాలని అనుకుంటోంది.