
అలంపూర్‌ను వనపర్తిలో కలపొద్దు
హైపవర్ కమిటీకి ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌ల వినతి
సాక్షి, హైదరాబాద్: రెండు నదుల మధ్య ఉన్న అలంపూర్, గద్వాల (నడిగడ్డ) నియోజకవర్గాలను యథాతథంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, రాజకీయ ప్రయోజనాల కోసం అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో చేర్చితే చారిత్రక తప్పిదమవుతుందని ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్‌కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయమై జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ సభ్యులకు, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్‌కు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు.
అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ, జోగులాంబ జిల్లా కోసం ఉద్యమాలు చేసి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, అయితే అలంపూర్ నియోజకవర్గంతోపాటు కొత్తగా ఏర్పాటు కానున్న ఉండవల్లి మండలాన్ని వనపర్తిలో కలుపుతున్నారని వచ్చిన వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. దేవాలయం ఉన్న అలంపూర్ లేకుండా జోగులాంబ జిల్లా ఏర్పాటు చారిత్రక తప్పిదమవుతుందన్నారు.
తప్పిదాలకు తావులేకుండా గద్వాల కేంద్రంగా జోగులాంబ జిల్లాకు సరైన రూపం ఇవ్వాలని ప్రజల తరఫున ప్రభుత్వానికి విన్నవించామన్నారు. సంపత్‌కుమార్ మాట్లాడుతూ, అలంపూర్‌ను వనపర్తి జిల్లాలో కలుపుతున్నారనే వార్తలతో.. జోగులాంబ జిల్లా ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారన్న సంతోషం నాలుగు రోజుల్లో మటుమాయమైందన్నారు. అలంపూర్, గద్వాల నియోజకవర్గాలను సంపూర్ణంగా జోగులాంబ జిల్లాలోనే ఉంచాలని, అలా చేయని పక్షంలో జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసినట్లవుతుందని అన్నారు.