లోగుట్టు.. సీఎంకెరుక!
♦ జిల్లాల పునర్విభజనలో గోప్యత
♦ సీఎం, కలెక్టర్ కనుసన్నల్లో ప్రతిపాదిత జిల్లాలు
♦ సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు
♦ ముసాయిదాల సమర్పణకు మరో ఐదు రోజులు
జిల్లాల పునర్విభజనపై యంత్రాంగం గుట్టుగా వ్యవహరిస్తోంది. జిల్లా ఎన్ని ముక్కలు కానుంది? ప్రతిపాదిత జిల్లా కేంద్రాలేవీ? ప్రస్తుత జిల్లాలో కలిసే పొరుగు జిల్లా ప్రాంతాలేంటి? హైదరాబాద్‌లో విలీనమయ్యే మండలాలేవీ? అనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అత్యంత గోప్యతను ప్రదర్శిస్తోంది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో అన్నీతానై వ్యవహరిస్తున్న కలెక్టర్ రఘునందన్‌రావు.. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ఇతరత్రా అంశాలపై కలెక్టరేట్‌లో ఏ ఒక్క అధికారితోనూ చర్చించడం లేదు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాల పునర్విభజనపై చిన్న సమాచారం కూడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రభుత్వ స్థాయిలోనే రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల విభజన అంశంపై చర్చిస్తున్నందున జిల్లాస్థాయిలో ముసాయిదాలు తయారు చేయాల్సిన అవసరంలేదనే అభిప్రాయం అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. ఐదు అంశాల ఆధారంగా జిల్లాల ముసాయిదాలను పంపాలని సీసీఎల్‌ఏ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, రెవెన్యూ యంత్రాంగం ఆ దిశగా కసరత్తు పూర్తిచేయలేదు.
ప్రతిపాదిత జిల్లాల మ్యాపుల రూపకల్పనలో కిందిస్థాయి అధికారులపై ఆధారపడలేదు. ఇవి కూడా ప్రైవేటు సంస్థల్లో డిజైన్ చేయించారంటే.. జిల్లాల పునర్విభజనలో యంత్రాంగం ఎంత రహస్యంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత వారం కలెక్టర్ల కాన్ఫరెన్స్ అనంతరం ఈనెల 20వ తేదీలోపు జిల్లాల ముసాయిదాలను సీసీఎల్‌ఏకు పంపాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఇప్పటివరకు వీటి పై ఎలాంటి అధ్యయనం జరగలేదు. ఇతర జిల్లాల్లో మాత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఇతర ప్రజాప్రతినిధులతో జిల్లాల విభజనపై చర్చోపచ ర్చలు జరుగుతున్నా.. మన జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి సమావేశాలు జరగకపోవడం గమనార్హం.
సమావేశంపై సస్పెన్స్
కొత్త జిల్లాల ఏర్పాటులో చిక్కుముడిగా మారిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై ప్రత్యేకంగా చర్చిద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాల ప్రతిపాదనలు పంపే గడువుకు మరో ఐదు రోజులే మిగిలి ఉన్నా.. ఇప్పటివరకు సీఎం సమావేశంపై జిల్లా యం త్రాంగంలో స్పష్టత రాలేదు. అయితే, జిల్లాల పునర్విభజనపై మొదట్నుంచి జిల్లా యంత్రాంగం సీసీఎల్‌ఏ డెరైక్షన్‌లో నడుచుకుంటోంది. ఈ క్రమంలోనే జిల్లాల సరిహద్దులు, భౌగోళిక స్వరూపంపై అక్కడికక్కడే ప్రతిపాదనలకు తుదిరూపు ఇస్తోందని అధికారవర్గాలు అంటున్నాయి.
ఈ నేపథ్యంలోనే పునర్‌వ్యవస్థీరణపై కలెక్టర్ ‘మిస్టర్ కూల్’గా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లా కొనసాగింపుపై స్పష్టత వచ్చినందున.. మిగతా ప్రాంతాలను ఎక్కడ కల పాలి? ఎన్ని జిల్లాలు ఏర్పాటుచేస్తే బాగుంటుంది? ఏ ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే అం శంపై సీఎం స్థాయిలో రోడ్‌మ్యాప్ ఇప్పటికే ఖరారైనందున.. దానికి అనుగుణం గా మ్యాపులను తయారు చేయాల్సివుంటుందని, అంతదానికి హైరానా పడాల్సి న అవ సరంలేదనే అభిప్రాయాన్ని ఉన్నతస్థాయి అధికారులు వ్యక్తం చేస్తున్నారు.