ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న కలెక్టర్ నీతూ ప్రసాద్
-
కేసీఆర్ నాటిన మొక్కలను పరిశీలించిన కలెక్టర్
-
హారితహారంపై మంచి వార్తలు రాయండి
-
ఎల్లమ్మ దేవాలయంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు
హుస్నాబాద్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గతేడాది నాటిన మొక్కలను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరిశీలించారు. శనివారం పట్టణంలోని ఎల్లమ్మ దేవాలయం ఆవరణలో సీఎం నాటిన 500 మొక్కలన్నింటినీ పరిశీలించారు. మొక్కల చుట్టూ కంచెలు ఏర్పాటు చేసి సంరక్షిస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. సీఎం నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆరోగ్యవంతంగా ఉన్నాయన్నారు. మొక్కలను కంటికి రెప్పలా కాపాడాలని సూచించారు. ఇందుకు నగర పంచాయతీ, ఆలయ కమిటీ, సిబ్బంది బాధ్యత తీసుకోవాలన్నారు. ఎల్లమ్మ ఆలయానికి వచ్చే మహిళలు, పురుషుల కోసం మరుగుదొడ్లు నిర్మించేందుకు రూ.3లక్షలు విడుదల చే స్తున్నట్లు ప్రకటించారు. నగర పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను కాపాడేందుకు రూ.లక్ష మంజూరు చేయనున్నట్లు తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో వంద శాతం మరుగుదొడ్లు పూర్తి చేయాలని, అవసరమైన నిధులను సమకూరుస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
హరితహారంపై మంచి వార్తలు రాయండి
హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీళ్లులేవు.. ఎండిపోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న మీడియాప్రతినిధులు.. మొక్కలను కాపాడుతున్న విషయంపైనా మంచి వార్తలు రాసి ప్రజల్లో చైతన్యం కలిగించాలని కలెక్టర్ నీతూప్రసాద్ సూచించారు. సీఎం నాటిన మొక్కలపై మంచి వార్తలు రాయాలన్నారు. అంతకముందు ఆమె ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ సుద్దాల చంద్రయ్య, ఎంపీపీ భూక్య మంగ, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, ఆలయ కమిటీ తాత్కలిక అధ్యక్షుడు పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేశ్వర్, కమిషనర్ కుమారస్వామి, తహసీల్దార్ వాణిరెడ్డి, ఎంపీడీవో రాంరెడ్డి, కౌన్సిలర్లు ఇంద్రాల సారయ్య, చిత్తారి పద్మ, కోమటి స్వర్ణలత, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ఎడబోయిన తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.