dividing line
-
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
పొరుగు ఇళ్లకు క్వారంటైన్ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: మొన్నటి వరకు కుటుంబసభ్యుల్లా కలిసిమెలిసి ఉన్నారు. నేడు కరోనా వైరస్ భూతం చేరింది. అనుమానపు చూపులతో విభజన రేఖ గీసింది. అమెరికా నుంచి వచ్చారు.. ఇక్కడ ఉండటానికి వీళ్లేదు.. క్వారంటైన్‌కు వెళ్లాల్సిందేనని పొరుగిళ్లవారు.. మా ఇల్లు.. మా ఇష్టం ఇక్కడే ఉంటామని ప్రవాసీల పంతం. ఒకప్పుడు అమెరికాలో ఉన్నా.. లండన్ వెళ్లి వచ్చినా.. స్టేటస్ సింబల్‌గా భావించే జనం.. ఇప్పుడు మాత్రం విదేశాల పేరు చెబితేనే వామ్మో అంటున్నారు. హైదరాబాద్ శివార్లలోని అమీన్పూర్ బందంకొమ్ము ప్రాంతంలోని ఒక ఆపార్టుమెంటులో నివసించే కుటుంబం ఇటీవల యూఎస్‌కు వెళ్లివచ్చింది. ఐదుగురు కుటుంబసభ్యులు అమెరికా నుంచి నేరుగా ఇంటికే చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో థర్మల్ స్క్రీనింగ్ చేసి కోవిడ్-19 లక్షణాలు లేకపోవడంతో పంపించేశారు. అయితే, ఈ విషయంలో ఆ నోటా..ఈ నోటా తెలుసుకున్న ఇరుగు పొరుగు ఫ్లాట్లలో నివసించే జనం.. అమెరికా నుంచి వచ్చారు కదా! క్వారంటైన్‌కు వెళ్లాలని పట్టుబట్టారు. ఇదే సమయంలో పోలీసులు, ఇతర వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పరీక్షలు చేసేందుకు రావాలని కోరేందుకు ఆపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఇంకేముంది అమెరికా నుంచి కుటుంబ సభ్యులు అంతెత్తున లేచారు. అసలు వీరిని పైకి(తమ ఫ్లోర్) ఎందుకు రానిచ్చారు అంటూ వాచ్మెన్పై ఎగబడ్డారు. చదవండి: విదేశీ ప్రయాణమే కొంపముంచిందా? ఆపార్ట్మెంటులో స్వీయ నియంత్రణ పాటించకుండా.. ఎడాపెడా సంచరిస్తున్న వీరితో ఆందోళనలో ఉన్న ఆపార్ట్‌మెంటు వాసులకు.. కనీసం టెస్టులకు వెళ్లేందుకు నిరాకరిస్తున్న వీరి వైఖరి అంతుబట్టక లబోదిబోమంటున్నారు. చాలా ఆపార్ట్మెంట్లలో పరిస్థితి ఇలానే ఉంది. సెల్ఫ్ డిక్లరేషన్‌తో విదేశాలకు వెళ్లివచ్చినవారిని సెల్ఫ్ క్యారంటైన్‌కు ప్రభుత్వం అంగీకరించింది. అయితే, తమ ఇంట్లోనే ఒంటరిగా ఉన్న వీరికి పక్క ఇళ్లవారితో చిక్కులు వస్తున్నాయి. ప్రభుత్వ క్వారంటైన్లో ఉండకుండా ఇలా రావడం వల్ల తమ ఆరోగ్యాలను కూడా పణంగా పెట్టాల్సివస్తోందని లబోదిబోమంటున్నారు. స్వేచ్ఛగా తిరిగిన తర్వాత బయటపడితే... ప్రజలంతా కరోనా భయంతో వణికిపోతుంటే.. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తులు మాత్రం ఏ మాత్రం భయపడకుండా బంధువులు, సన్నిహితులను కలుసుకుంటూ విందు, వివాహాలకు హాజరవుతూ జల్సా చేస్తున్నారు. విమానాశ్రయంలో థర్మల్ స్క్రీనింగ్ ఎలాంటి లక్షణాలు బయటపడలేదని చెబుతూ యథేచ్ఛగా సంచరిస్తున్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న పౌరులపై నిఘా పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలకంటే ముందే బంధుమిత్రుల ఇళ్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్‌కు వెళ్లిన వీరిపై ఇప్పుడు నియంత్రణ విధించడం విడ్డూరంగా కనిపిస్తోంది. వాస్తవానికి కరోనా లక్షణాలు 14 రోజుల్లో బయటపడతాయని వైద్యాధికారులు చెబుతున్నారు. ఈ రెండువారాలు స్వీయ నియంత్రణ పాటించకుండా.. క్వారంటైన్లో ఉండకుండా స్వేచ్ఛగా తిరిగిన అనంతరం.. ఈ లక్షణాలు కనిపిస్తే పరిస్థితేంటనేది ఆర్థం కావడంలేదు. ఇటీవల ఐర్లాండ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న వ్యక్తి మరుసటి రోజే వివాహ ఆహ్వాన పత్రికతో ఇంట్లో వాలడంతో సదరు ఆహ్వానితుడు భయపడుతూ.. కార్డు తీసుకున్నారు. మరోవైపు ఆస్ట్రేలియాలో పర్వతారోహణ చేసిన మరో యువకుడు ఏకంగా మరుసటి రోజే పోలీసు ఉన్నతాధికారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఇలా చెప్పుకుంటూ పొతే.. లెక్కలేనంత మంది.. రాష్ట్రానికి రావడమేకాదు.. అందరితో కలివిడిగా వ్యవహరించారు. ఇలాంటి చర్యలతోనే పాశ్చాత్య దేశాల్లో కరోనా విస్తృతి పెరిగిందనే సత్యాన్ని విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. పేరు మార్పుతో తిప్పలు కొసమెరుపు ఏమంటే..: చైనా పేరు వింటే వెన్నులో వణుకు పుడుతోందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇది. తాజాగా చెన్నై ఐఐటీలో చదివే ఓ విద్యార్థికి సెలవులు ప్రకటించడంతో ఇంటికి చేరాడు. అయితే, అతడు వచ్చింది చెన్నై నుంచి కాగా.. చైనా నుంచి వచ్చారనే పుకారు అందుకుంది. ఇంకేముందు పొద్దునే పోలీసులకు ఫోన్లు, తహసీల్దార్, ఎంపీడీవో, వైద్యాధికారుల పరుగో పరుగు. అసలు విషయం తెలిసి నోరెళ్లబెట్టారు. ఇదెక్కడ జరిగిందో తెలుసా నాగర్‌కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం లక్ష్మాపూర్ తండా. -
రాజకీయాలపై విభజన రేఖ!
జిల్లాల పునర్విభజన సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేపనుంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో తలపండిన ప్రజాప్రతినిధులు.. రాజకీయ దిగ్గజాల తలరాత మారనుంది. జూన్ 2 రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవాన నయా జిల్లాలకు ముహూర్తం ఖరారు చేయనుండడంతో జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నేతల భవితవ్యంపై సర్వత్రా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల్లో వికారాబాద్‌కు తొలిస్థానం ఉంటుందనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో.. ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ముఖ్యనాయకుల హవాపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మాజీ డిప్యూటీ స్పీకర్ హరీశ్వర్‌రెడ్డి నామినేటెడ్ పోస్టుపై కన్నేశారు. విభజనతో ఆయన కూడా పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారు. మారనున్న రాజకీయ సమీకరణాలతో ఆయన ఆశించిన పోస్టు దక్కించుకోవడం సస్పెన్స్‌గా మారనుంది. తూర్పు ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటు కానుండడంతో ఇబ్రహీంపట్నం జిల్లా కేంద్రంగా అవతరిస్తే స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రాభవం మరింత పెరిగే అవకాశం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి, క్యామ మల్లేశ్, టీఆర్ఎస్ సారథి నాగేందర్గౌడ్ల పరిధి నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కానుంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: పశ్చిమ రంగారెడ్డి ప్రాంతంలోని నియోజకవర్గాలను కలుపుతూ వికారాబాద్‌ను జిల్లాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతిని ధుల ప్రాబల్యం తగ్గే అవకాశముంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తనదైనశైలిలో రాణిస్తూ.. జిల్లాను ఒంటిచేత్తో నడిపిస్తున్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి విభజన రేఖ కొత్త చిక్కులు తెచ్చిపెట్టనుంది. తూర్పు, ఉత్తర ప్రాంతంలోనూ ప్రభావం చూపుతున్న మంత్రి.. కేవలం పశ్చిమ ప్రాంతానికే పరిమితం కానున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాండూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న మహేందర్ జిల్లాల ఏర్పాటుతో పక్క జిల్లాల్లో జోక్యం చేసుకునే అవకాశం అంతంతమాత్రమే కానుండడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయన గ్రామీణ ప్రాంతాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి అనివార్యం కానుంది. ఒకవేళ జిల్లాలు ఏర్పాటు చేసినా.. ఆయా జిల్లాల్లో మరొకరికి మంత్రి పదవి కట్టబెట్టకపోతే మా త్రం ఆయన హవాకు ఢోకా ఉండదు. ప్రతిపాదిత కొత్త జిల్లాల్లో ఎవరికైనా మంత్రివర్గంలో చోటుకల్పిస్తే.. అమాత్యుని ప్రాభవం తగ్గిపోవడం తథ్యం. చైర్‌పర్సన్‌కు తప్పని తిప్పలు.. జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతామహేందర్‌రెడ్డికి కూడా ఈ పరిణామం కొత్త సమస్యలు సృష్టించనుంది. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న యాలాల మండలం కూడా ప్రతిపాదిత పశ్చిమ జిల్లాలో ఉండడంతో ఆమె ప్రభావం తగ్గనుంది. కానీ, జిల్లా పరిషత్ పాలకమండలిపదవీకాలం ముగిసేవరకు కొనసాగిస్తే.. ఆమె హవాకు ఢోకా ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాజీ మంత్రి సబిత సుదీర్ఘకాలం చేవెళ్ల రాజకీయాలను శాసించారు. మహేశ్వరం, మహేశ్వరం నియోజకవర్గాలపై పట్టు సాధించారు. విభజన నేపథ్యంలో ఈ సెగ్మెంట్లు వేర్వేరు జిల్లాల్లో చేరితే ఆమెకు రాజకీయంగా ఇబ్బంది కానుంది. ఇక సబిత కుమారుడు కార్తీక్‌రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీచేశారు. విభజన నేపథ్యంలో ఇక ఆయన అక్కడి రాజకీయాలపైనే దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వైరివర్గాలన్నీ ఒకే జిల్లాకు.. జిల్లాల డీలిమిటేషన్ గ్రూపు రాజకీయాలపై కూడా ప్రభావం చూపనుంది. రాజకీయ ఉద్ధండులు ఉన్న వికారాబాద్ జిల్లాలో అధికార పార్టీల నేతల మధ్య తీవ్ర అభిప్రాయబేధాలున్నాయి. మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి మహేందర్‌రెడ్డికి కొంత కాలంగా పొసగడంలేదు. మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలతో కూడా దాదాపుగా ఇంతే. ఇక కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కూడా ఈ ఇరువురికి అంత సఖ్యత లేదు. ఇలా ఎవరికివారూ తలపండిన నేతలు కావడం.. వారంతా ఒకే జిల్లాకు పరిమితం కానుండడంతో ఇక్కడి రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. - జిల్లాల విభజనతో ఉత్తర నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల్లో కూడా కేబినెట్ బెర్తులపై ఆశలు చిగురిస్తున్నాయి. - జిల్లా పార్టీ అధ్యక్ష పదవులు, కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులు జిల్లాలవారీగా కేటాయించే అవకాశం ఉండడం కూడా ఆశావహులను ఊహలపల్లకీలో ఊరేగింపజేస్తున్నాయి. - ప్రతిపాదిత తూర్పు, ఉత్తర జిల్లాల్లో శివారు నేతలే ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంది.