కుల్కచర్ల, న్యూస్‌లైన్: మరోసారి పరిగి ఓటర్లు రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి భిన్నమైన తీర్పునిచ్చారు. గత 15 సంవత్సరాలుగా పరిగి శాసన సభ్యుడు ప్రతిపక్షానికే పరిమితమవుతున్నాడు. ఈసారి కూడా కాంగ్రెస్ అభ్యర్థి టి.రామ్మోహన్‌రెడ్డిని గెలిపించి ఓటర్లు అదే తీర్పును పునరావృతం చేశారు. రాష్ట్రం మొత్తం టీఆర్‌ఎస్ గాలి వీచినా పరిగి నియెజకవర్గం ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ఈసారి సర్పంచ్, ప్రాదేశిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు వరుసగా వచ్చాయి. పరిగి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. నియెజవర్గంలో ఐదు మండలాలు దోమ, కుల్కచర్ల, పరిగి, గండేడ్, పూడూరుల్లో ప్రాదేశిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.
ఇక సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కే ఓటు వేసి ఉంటారని, హరీశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని టీఆర్‌ఎస్ శ్రేణులు భావించాయి. ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చి అందరికీ షాకినిచ్చాయి. పరిగి నియోజకవర్గం పరిధిలో తెలంగాణ సెంటిమెంట్ బలంగానే ఉంది. పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లోనూ ఇదే రుజువైంది. అయితే సార్వత్రికానికి వచ్చే సరికి తీర్పు మారడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. అయితే వరుసగా ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డికే అవకాశం ఇవ్వడంతో ఈసారి ఇతరులకు అవకాశం ఇవ్వాలని ఓటర్లు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీఆర్‌ఆర్ గెలవగా హరీశ్వర్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు.
నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలిస్తే హరీశ్వర్‌రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని, కనీసం ఈసారైనా నియోజకవర్గానికి న్యాయం జరిగి అభివృద్ధి జరుగుతుందని ఆశించిన వారికి భంగపాటు తప్పలేదు. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన టీఆర్‌ఆర్‌ను ఆ పార్టీ నాయకులు అభినందిస్తున్నారు. ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఆయన్ను కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
15 ఏళ్లుగా ప్రతిపక్షమే..!
Published Sun, May 18 2014 12:27 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement