విజయం అమరులకు అంకితం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో మొత్తం ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టిన ఇందూరు ప్రజలకు రుణపడి ఉంటామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రెండు ఎంపీ, తొమ్మిది అసెంబ్లీ స్థానాలలో పూర్తి మెజార్టీ ఇచ్చి తమపై విశ్వాసం ఉంచిన జిల్లా ప్రజలకు కృతజ్ఞతగా ఉంటామన్నారు. ఈ అఖండ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటిం చారు. శనివారం నిజామాబాద్‌లోని టీఆర్‌ఎస్ జిల్లా కేంద్ర కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో కవిత మాట్లాడారు.
1984 తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారం చేపట్టేందుకు వీలుగా తెలంగాణ ప్రజలు మెజార్టీ ఇచ్చారన్నారు.ప్రజల దీవెనలు పార్టీ అధినేత కేసీఆర్‌కు ఉండటంతోనే ఇది సాధ్యమైందని, జిల్లా సమగ్రాభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందన్నారు. షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ, గల్ఫ్ బాధితులు, బీడీకార్మికులు, తాగునీరు, సాగునీరు, ఇలా జిల్లాలో చాలా సమస్యలున్నాయని, ప్రజలు ఇచ్చిన స్వీప్ మెజార్టీని వివరించి అవసరమైతే కేసీఆర్‌ను 10 శాతం అదనపు నిధులు జిల్లాకు కేటాయించాలని కోరుతామన్నారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ఐదేళ్లలో అమలు చేసి తీరు తామని స్పష్టం చేశారు.ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజల కిచ్చిన హామీలను నెరవేర్చుతారన్నారు. తెలంగాణ జిల్లాలలోనే ఇందూరును ఆదర్శంగా ఉండేలా అభివృద్ది చేసేందుకు కృషి చేస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో హైదరాబాద్‌కు పార్టీ కార్యాలయానికి తీసిపోకుండా ‘తెలంగాణ భవన్’ను నిర్మిస్తామని, జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆమె పేర్కొన్నారు.
అభివృద్ధి నిరోధకుడు డీఎస్
నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని అడ్డుకున్న డీఎస్‌కు ప్రజలు మరోసారి తగిన గుణపాఠం చెప్పారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అ భివృద్ది నిరోధకుడైన ధర్మపురి శ్రీనివాస్‌ను ఓడించాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉండేదని, అయితే టీఆర్‌ఎస్, కేసీఆర్ ద్వారా ఆ కోరిక నెరవేరిందన్నారు. నిజామాబాద్ రూరల్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. సమస్యలపై అవగాహన ఉన్న నాయకులను ప్రజలు ఎన్నుకున్నారని, జిల్లా అభివృద్ధికి ఇక ఢోకా ఉండదని అన్నారు.
పట్టం కట్టిన ప్రజలను మరవలేం
ప్రత్యేక తెలంగాణ కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా, చివరకు కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్‌ఎస్ ఉద్యమంపైనే ప్రజలు విశ్వాసం ఉంచారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పేర్కొన్నారు. గాంధేయవాద ఉద్యమంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన కేసీఆర్‌తోనే ‘తెలంగాణ’ సాధ్యమైందని భావించిన ప్రజలు ఇతర పార్టీలను పట్టించుకోలేదన్నారు. నిజామాబాద్ అర్బన్‌లో అసలు టీఆర్‌ఎస్‌కు పట్టు లేదని, గెలుపు కష్టమని కొందరు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు తనను గెలిపించి దీటైన జవాబు చెప్పారన్నారు. ఇక్కడి ప్రజలకు సర్వత్రా రుణపడి ఉంటానని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చి ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి, జిల్లా పరిశీలకులు బాపూరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి పాల్గొన్నారు.