నల్లసూరీళ్ల తెలం‘గానం’.. | trs hawa in elections | Sakshi
Sakshi News home page

నల్లసూరీళ్ల తెలం‘గానం’..

Published Sun, May 18 2014 1:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM

నల్లసూరీళ్ల తెలం‘గానం’.. - Sakshi

నల్లసూరీళ్ల తెలం‘గానం’..

 వారు నిత్యం చీకటి గుహల్లో పనిచేసే కార్మికులు.. ఏదైనా సమస్య వచ్చినా దాన్ని పోరాడి సాధించుకునే పోరాట పటిమ వారిది.. ఇచ్చి న మాటకు కట్టుబడే తత్వం వారి సొంతం.. అలాంటి సింగరేణి కార్మికులు కట్టుబడినట్లుగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిపెట్టిన తెలంగాణ రాష్ట్ర సమితిని అక్కున చేర్చుకున్నారు. నాలుగు జిల్లాల కోల్‌బెల్ట్ పరిధిలో అనూహ్య ఫలితాలు అందించి తమ ఐకమత్యాన్ని చాటారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు బుద్ధిచెప్పి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ ఆదరించారు. కోల్‌బెల్ట్ పరిధిలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 5 పార్లమెంటు, 11 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో టీఆర్‌ఎస్‌కు నాలుగు పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకటి పార్లమెంటు, ఒకటి అసెంబ్లీ సీటు అప్పగించారు. కాంగ్రెస్, టీడీపీ ఒక్కో ఎమ్మెల్యే స్థానాన్ని గెలుచుకున్నాయి.
 
మంచిర్యాల సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రానికి తొలిసారిగా జరి గిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో నా లుగు జిల్లాలోని సింగరేణి బొగ్గు గని కార్మికులు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే పట్టం కట్టారు. కోల్‌బెల్ట్ లోని అత్యధిక పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుని ప్రధాన పార్టీల కంటే ముందంజలో ఉంది. మొదటిసారి కార్మికులు ఒక పార్లమెంట్, ఒక అసెంబ్లీ స్థానాన్ని వైఎస్‌ఆర్ పార్టీ చేతిలో పెట్టి ఆదరించారు. ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణ పోరులో రెండు స్థానాలు గెలుపొందడం విశేషం. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఒక్కో స్థానానికే పరిమిత మయ్యాయి.

కమ్యూనిస్టులు మూడు ప్రాంతాల్లో పొత్తుతో పోటీ చేసినా ఒక్క స్థానంలో కూడా వారిని కార్మికులు ఆదరించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో రామగుండం, మంథని, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, పినపాక, సత్తుపల్లి, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాలు కూడా బెల్ట్‌లోనే ఉన్నాయి.
 
 వైఎస్‌ఆర్ సీపీకి ఆదరణ..
 కోల్‌బె ల్ట్ ప్రాంతాల్లో మొదటి సారిగా కార్మికులు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కకు తోసి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పార్లమెంటు స్థానంలో పి.శ్రీనివాస్‌రెడ్డిని, పినపాక అసెంబ్లీ స్థానానికి పి.వెంకటేశ్వర్లును గెలిపించారు. ఇప్పటికే ఆ పార్టీ తరఫున సత్తుపల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో సైతం కౌన్సిలర్లను కార్మికులు ఆదరించారు. ఒంటరిగా బరిలోకి దిగి జాతీయ పార్టీల కంటే తామే గొప్ప అని ఈ పార్టీ నిరూపించింది. భవిష్యత్తులో సింగరేణిలో కీలక బాధ్యతలు వీరికి అప్పగించే అవకాశాలూ లేకపోలేదు.
 
 టీఆర్‌ఎస్ హవా..

 ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటమంటూ కార్మికుల కాలనీలతోపాటు గనులపై టీఆర్‌ఎస్ మొదటి నుంచీ విసృ్తత ప్రచారం చేపట్టింది. సకల జనుల సమ్మెలో కార్మికులను నెల రోజులపాటు భాగస్వాములను చేసింది. ఎన్నికల హామీలో కార్మికులను ఆకట్టుకుంది. దీంతో కోల్‌బెల్ట్‌లోని ఐదు పార్లమెంటు, పదకొండు అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగా పోటీ చేసింది. అందులో.. నాలుగు పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో కార్మికులు ఆ పార్టీని ఆదరించారు. మహబూబాబాద్‌లో సీతారాంనాయక్, వరంగల్‌లో కడియం శ్రీహరి, పెదపల్లిలో బాల్క సుమన్, ఆదిలాబాద్‌లో జి.నగేష్ పార్లమెంటు అభ్యర్థులుగా గెలుపొందారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా మంథనిలో పుట్ట మధు, రామగుండంలో సత్యనారాయణ, ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్‌లో కోవ లక్ష్మి, మంచిర్యాలలో దివాకర్‌రావు, బెల్లంపల్లిలో చిన్నయ్య, చెన్నూర్‌లో ఓదెలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు.
 
 తెలుగుదేశం+బీజేపీకి నామమాత్రం..
 తెలుగుదేశం, భారతీయ జన తా పార్టీలు పొత్తు పెట్టుకొని కోల్‌బె ల్ట్‌లోని అన్ని స్థానాలకు పోటీ పడ్డాయి. బీజేపీ ఒక ఎంపీ, నాలుగు అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయగా ఒక్కటి కూడా దక్కించుకోలేదు. తెలుగుదేశం పార్టీ ఆరు ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీచేయగా సత్తుపల్లి అసెంబ్లీని కాపాడుకోగలిగింది.
 
 కాంగ్రెస్+సీపీఐ.. ఒకటికే పరిమితం..
 కాంగ్రెస్, సీపీఐలు జాతీయ పార్టీలు. వీటికి సింగరేణిలో కార్మిక అనుబంధ సంఘాలు కూడా ఉన్నాయి. వాటిని బలోపేతం చేయడంలో రెండు పార్టీలూ విఫలం కావడం నేటి ఫలితాలకు తార్కాణం. నిత్యం కార్మిక సమస్యలపై పోరాటం చేసే అనుబంధ సంఘాలు ఉన్నా కార్మికులను సార్వత్రిక ఎన్నికల్లో ఆకట్టుకోలేకపోయారు. రెండు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా ఆశించిన ఫలితాలు దక్కలేదు. పొత్తులో సీపీఐ మూడు ఎమ్మెల్యే, ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేయగా ఏ ఒక్క స్థానాన్నీ దక్కించుకోలేదు. అదేవిధంగా కాంగ్రెస్ ఎనిమిది ఎమ్మెల్యే, నాలుగు ఎంపీ స్థానాలకు పోటీ పడగా ఇల్లందు అసెంబ్లీ స్థానం నుంచి కనకయ్య గెలుపొందారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement