హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం తగదు | Governor rule in Hyderabad is not correct | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం తగదు

Published Fri, Dec 20 2013 12:20 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

Governor rule in Hyderabad is not correct

పరిగి, న్యూస్‌లైన్: ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం శాసనసభకు పంపించిన ముసాయిదా బిల్లులో పలు అంశాలు తెలంగాణ స్వయం ప్రతిపత్తికి విఘాతం కలిగించేలా, అన్యాయం చేసేలా ఉన్నాయని టీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి టీటీడీ కల్యాణ మండపంలో ఆయా పార్టీలు, జేఏసీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించారు. ఇంగ్లిష్, తెలుగులో ఉన్న బిల్లు ప్రతులను సమావేశానికి హాజరైన వారందరికీ హరీశ్వర్ రెడ్డి అందజేశారు. ఆయా వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
 
 అందరి అభిప్రాయాలను క్రోడీకరిస్తూ  చివరగా హరీశ్వర్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణకు రాజధానిగా ఉండే హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారం కల్పించడం ఈ ప్రాంత స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమేనని అన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనాన్ని ఎంతమాత్రం ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం హామీ ఇస్తుందని అన్నారు. అప్పుల పంపకం జనాభా ప్రాతిపదికన అంటే ఒప్పకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రాజెక్టులు, ఫ్యాక్టరీలు, పోర్టుల నిర్మాణాలతో అభివృద్ధి ఏ ప్రాంతంలో జరిగితే, ఆ ప్రాంతం వారే ఆ అప్పులు భరించాలని ఆయన అభిప్రాయపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే తమకు అభ్యంతరం లేదని, ఆయితే తెలంగాణ ప్రాంతంలో చేవెళ్ల - ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించటంతో పాటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
 
 ప్యాకేజీ తెలంగాణకే ఇవ్వాలి...
 రాష్ట్ర విభజన తర్వాత ఒకవేళ కేంద్రం ప్యాకేజీ ఇస్తే అది తెలంగాణకే ఇవ్వాలని హరీశ్వర్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగినందునే వేర్పాటువాదం తెరపైకి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన తెలంగాణ రాష్ట్రానికే ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణానికి మాత్రమే నిధులు సమకూర్చాలని స్పష్టం చేశారు. ఇక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే సీమాంధ్ర ఉద్యోగులంతా ఇక్కడే పదవీ విరమణ పొందుతారని, వారందరికీ పెన్షన్లు ఎక్కడినుంచి ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు.
 
 ఎక్కడ అపాయింట్‌మెంట్ అయిన ఉద్యోగులను అక్కడికే పంపటంతో పాటు వారికి అక్కడే పింఛన్ చెల్లించే విధంగా బిల్లులో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. జేఏసీ జిల్లా కన్వీనర్ సదానందం మాట్లాడుతూ గతంలో ఏర్పాటైన రాష్ట్రాల విషయంలో అనుసరించిన విధివిధానాలే తెలంగాణ విషయంలోనూ అనుసరించాలని అన్నారు.
 
 శాసనసభలో అనవసర రాద్ధాంతం చేస్తున్న వారిని సస్పెండ్ చేసి వెంటనే బిల్లుపై చర్చను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ నందకుమార్ యాదవ్, పరిగి మండల ఎంపీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు సురేందర్‌కుమార్, బీజేపీ తాలూకా కన్వీనర్ రాముయాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పెంటయ్య, ప్రధాన కార్యదర్శి రాంచందర్, విద్యావంతుల వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్‌రాంలు, నియోజకవర్గ చైర్మన్ బసిరెడ్డి, టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్‌వర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు విజయారావు, ఆయా సంఘాలు, పార్టీల నాయకులు రామన్నమాదిగ, సత్యం, మోహనాచారి, బషీర్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement