చంద్రబాబువన్నీ డ్రామాలే హరీశ్వర్‌రెడ్డి ధ్వజం | harishwar reddy fired on chandrababu naidu drama | Sakshi
Sakshi News home page

చంద్రబాబువన్నీ డ్రామాలే హరీశ్వర్‌రెడ్డి ధ్వజం

Published Thu, Sep 26 2013 3:34 AM | Last Updated on Sat, Jul 28 2018 3:21 PM

harishwar reddy fired on chandrababu naidu drama

పరిగి, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చేటప్పుడు చంద్రబాబుకు తెలియదా తెలుగు ప్రజలు విడిపోతారని..? అప్పుడు లేఖ ఇచ్చి ఇప్పుడు తెలుగు ప్రజలు విడిపోతారంటూ తెలంగాణ ఏర్పాటుకు అడ్డుతగలటం ఆయనకే చెల్లిందని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మండలంలోని సయ్యద్‌పల్లిలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ కార్యకర్తల సమావేశానికి హరీశ్వర్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రసంగించారు. తెలంగాణ విషయంలో టీడీపీ, కాంగ్రెస్‌ల గిమ్మిక్కులను తిప్పి కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
 
 తెలంగాణను అడ్డుకోవటం, జగన్‌ను బయటకు రాకుండా చూసేందుకే చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్లి డ్రామాలాడారని విమర్శించారు. సీమాంధ్రకే సీఎంలా కిరణ్‌కుమార్‌రెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు పై ప్రకటన వచ్చాక సీమాంధ్రలో సమావేశాలకు ఆయనే దగ్గరుండి అనుమతులిప్పించడం ఇందుకు ఉదాహరణ అని హరీశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక కూడా.. తెలంగాణ కోసం కష్టపడిన వారే అధికారంలో ఉంటేనే ఈ ప్రాంత పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. లేనిపక్షంలో మునుపటివలెనే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉం టుందన్నారు. ఆంధ్ర ప్రాంత మంత్రులను చూసి తెలంగాణ మంత్రులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. వారు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుంటే మన మంత్రులు  సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందంటూ జెండాలు ఎగురవేస్తున్నారని దుయ్యబట్టారు.
 
తెలంగాణతోనే సాగునీరు సాధ్యం:  కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
తెలంగాణ ఏర్పాటుతోనే పాలమూరు ఎత్తిపోతల పథకం సాధ్యమని టీఆర్‌ఎస్ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆశాభావం వ్యక్తంచేశారు. చేవెళ్ల ప్రాణహితతో పశ్చిమ జిల్లాకు నీరు రావటం కష్టమన్నారు. వచ్చిన తెలంగాణను దొంగల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
 
అప్రమత్తంగా ఉండాలి: నాగేందర్ గౌడ్
జిల్లాలో టీఆర్‌ఎస్‌ను మరింత పటిష్టం చేస్తామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గౌడ్ పేర్కొన్నారు.  సీడబ్ల్యూసీ ప్రకటించినంత మాత్రాన తెలంగాణ వచ్చినట్లు కాదని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడే మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. కొందరు తొందరపడి పార్టీని వీడుతున్నారని, ఉద్యమం చేసేందుకు ఓపిక లేకే వెళ్లిపోతున్నారని విమర్శించారు. సీమాంధ్రుల కృత్రిమ ఉద్యమాన్ని బట్టబయలు చేయాల్సిన అవసరముందన్నారు.
 
కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు స్వప్న, పరిగి సర్పంచ్ విజయమాల, పరిగి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎస్పీ బాబయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు సురేందర్‌కుమార్, జిల్లా గ్రంథాలయ శాఖ మాజీ చైర్మన్ గోపాల్‌రెడ్డి, టీఎంయూ జాయింట్ సెక్రటరీ హన్మంతు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మల్లేష్ యాదవ్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్, నియోజకవర్గ అధ్యక్షుడు యా దయ్య, పరిగి మండల అధ్యక్షుడు క్లెమెంట్,  జిల్లా నాయకులు గౌస్, యేసుదాస్, కళ్యాణ్‌రావు, సర్పంచులు భాస్కర్, లింగమ్మ, నియోజకవర్గ నాయకులు బషీర్, బాబ్జీ, అనూష, ముకుంద్‌శేఖర్, బాబా, హన్మంతురెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement