సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేస్తున్న పోరాటాలను ప్రజలు నమ్ముతున్నారని, అందుకే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆరు శాతం నుంచి 30 శాతానికి బీజేపీ ఓట్ల శాతం పెరుగుదల మామూలు విషయం కాదన్నారు. బుధవారం కోరుట్లకు చెందిన కొందరు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓప్రైవేట్ సంస్థ సర్వే నివేదికను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘బీజేపీ గ్రాఫ్ పెరిగితే టీఆర్‌ఎస్ గ్రాఫ్ తగ్గిపోయింది.
దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచాం. మూడేళ్లుగా బీజేపీ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ప్రజలు బీజేపీని విశ్వసిస్తున్నారు. మరో 8 శాతం ఓట్లను పెంచుకోవడం బీజేపీకి కష్టమే కాదు. ప్రజలు మా పోరాటాలను గమనిస్తున్నారు’అని అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన వ్యాపారవేత్త మహిపాల్ రెడ్డి, అలాగే లోక్‌సత్తా సహా ఇతర పార్టీలకు చెందిన పలువురు కార్యకర్తలు బీజేపీలో చేరారు.
ఇకనైనా కేసీఆర్ మొద్దు నిద్ర వీడాలి..
సీఎం కేసీఆర్ ఇకనైనా మొద్దు నిద్ర వీడి, ప్రజలను ఆదుకోవాలని సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరకపోవడంతో రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలివ్వడం లేదన్నారు. ఇచ్చిన హామీ మేరకు రూ.లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయడంతోపాటు తక్షణమే బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి కొత్తగా రుణాలిచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment