తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ గందరగోళ పరిస్తే..ఇప్పుడు అదే కోవలో ఆ పార్టీ సీమాంధ్ర నేతలూ చేరారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై రెండు కళ్ల సిద్ధాంతమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అందరినీ గందరగోళ పరిస్తే..ఇప్పుడు అదే కోవలో ఆ పార్టీ సీమాంధ్ర నేతలూ చేరారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చను కొన్ని రోజులు జరపడానికి వీలులేదని పట్టుపట్టిన టీడీపీ సీమాంధ్ర నేతలు రాత్రికి రాత్రే నిర్ణయం మార్చుకుని చర్చకు సహకరించడానికి కారణాలేమిటన్న దానిపై ఆ పార్టీ నేతలు పొంతనలేని సమాధానాలు చెప్పుకొచ్చారు.
టీ బిల్లు అసెంబ్లీకి రాకముందే సమైక్య తీర్మానం చేస్తే ప్రయోజనం కానీ ఇప్పుడు చేసి లాభమేమిటని ఎమ్మెల్యే గాలి ముద్దుకృష్ణమ నాయుడు.. తమ మెడ మీద డెడ్ లైన్ అనే కత్తి వేలాడుతోంది కాబట్టే బిల్లుపై చర్చకు సహకరిస్తున్నామని మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఏ విషయంలోనైనా వైఎస్సార్‌సీపీతో పాటు జగన్‌మోహన్‌రెడ్డిని గుడ్డిగా వ్యతిరేకించడం తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ప్రత్యేక వ్యూహం లేదన్న డొల్లతనం తేటతెల్లమవుతోందని రాజకీయ పరిశీలకులు విమర్శిస్తున్నారు.