ఇద్దరినీ కూర్చోబెట్టాలి: బాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చంద్రబాబు తన ‘మనసులో మాట’ను ఇప్పటికీ బయట పెట్టడం లేదు. బిల్లు అంకం తుది ఘట్టానికి చేరుకున్నా తన వైఖరి చెప్పకుండా ఎప్పటిలాగే నాన్చుతున్నారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి సహా పలు పార్టీల నేతలను కలసిన బాబు.. బిల్లును సమర్థిస్తున్నారా, లేక వ్యతిరేకిస్తున్నారా అన్న విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు.
సోమవారం రాత్రి 7.30కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో బాబు ఒంటరిగా భేటీ అయ్యారు. బిల్లు లోపభూయిష్టమంటూ వినతిపత్రం సమర్పించారు. ‘‘బిల్లుపై పునఃపరిశీలన చేయండి. రాజ్యాంగానికి లోబడి సమన్యాయం జరిగేలా పరిష్కారం చూపండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. రాష్ట్రం సమైక్యంగా కొనసాగాలంటే తెలంగాణ ప్రజలను ఒప్పించాలి. విభజన తప్పనిసరైతే రెండు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలి’ అని అందులో పేర్కొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రజలతో, నాయకులతో చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. ఈ మేరకు తాము చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఆయనే వారితో చర్చించి సముచిత నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ‘‘కేంద్రం రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించిందని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీ ఓటేసిందని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాను. సమస్యలన్నిటినీ సామరస్యంగా పరిష్కరించేందుకు అవసరమైన యంత్రాంగం ఉండాలని కోరాను’’ అన్నారు. ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే చెడు సంప్రదాయానికి కాంగ్రెస్ నాంది పలుకుతోందని విమర్శించారు. ‘‘ముఖ్యమంత్రిని ముందర పెట్టి కొత్త నాటకానికి కాంగ్రెస్ తెర తీసింది. సమైక్యమంటే ఆయనకేదో ఓట్లు పడుతాయని ఆలోచిస్తున్నారు. 2008లో టీడీపీ తీర్మానానికే కట్టుబడి ఉన్నాం’’ అన్నారు. చర్చలకు సమయం లేదుగా అని ప్రశ్నించగా, సమయం విషయం కాదని, అంశాన్ని చూడాలని చెప్పుకొచ్చారు. ‘‘ఒకచోట రాజధాని, మరోచోట ప్రజలు విడిపోవడం చరిత్రలో లేదు. ఇలాంటి విషయంలో జాగ్రత్తలు పాటించకే సమస్యలొచ్చాయి. ఆర్టికల్ 371 డి, రాజ్యాంగ సవరణ అవసరమన్నా పట్టించుకోవడం లేదు. పద్ధతి ప్రకారం చేసి ఉంటే బిల్లు వచ్చేది కాదు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేదాకా విషయాన్ని ముందుకు తీసుకెళ్తాం’’ అన్నారు.
రాజ్‌నాథ్, శరద్‌యాదవ్‌లతో భేటీ
సోమవారం మధ్యాహ్నం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, జేడీయూ నేత శరద్‌యాదవ్‌లతో కూడా బాబు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రెండు ప్రాంతాలకు న్యాయం జరగాలని, రాష్ట్ర భాగస్వాములను పిలిపించి మాట్లాడాలని, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని వారికి చెప్పానన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగాలని రాజ్‌నాథ్ అన్నారన్నారు. ‘‘స్క్రిప్టు 10 జన్‌పథ్‌లో. అక్కడ రాష్ట్రంలో అదే నాటకం. నేను ఢిల్లీలో దీక్ష చేసినా వీరు మారలేదు’’ అన్నారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాల ఏర్పాటు ప్రక్రియ ఆనందంగా జరిగిందంటూ ప్రశంసించారు!
బిల్లుపై మంగళవారం నిర్ణయం: శరద్‌యాదవ్
విభజన బిల్లుపై జేడీయూ నిర్ణయాన్ని మంగళవారం సమావేశమై చర్చించాక వెల్లడిస్తామని శరద్ యాదవ్ చెప్పారు. బాబుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతియుతంగా విభజన జరగాలనేది తమ అభిప్రాయమన్నారు. ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంటు నడవదు. ఆర్థిక బిల్లును పూర్తి చేయాల్సి ఉన్నా ఆర్థిక విభాగాల వద్ద పేపర్లు సిద్ధంగా లేవు. పార్లమెంటు సమావేశాలను 12వ తేదీ నుంచి పెట్టాలంటే విన్లేదు. ముందు ఆర్థిక బిల్లును ఆమోదిస్తే బాగుంటుందని నేటి అఖిలపక్షంలో అన్ని పార్టీలూ చెప్పాయి’’ అని బదులిచ్చారు.
‘సోనియా ఇంటివద్ద పోరాడమనండి’
‘‘నిరవధిక ధర్నా చేస్తానంటూ రేపు ఒక కొత్త యాక్టర్ ఇక్కడికొస్తున్నాడ’’ంటూ సీఎం కిరణ్‌నుద్దేశించి బాబు ఎద్దేవా చేశారు. ‘‘కలిసి పోరాడదామంటున్నారు. మాకు చెప్పడం కాదు, సోనియాపై పోరాడమనండి. ఆమె నివాసం 10 జన్‌పథ్ ముందు కిరణ్ ధర్నా చేయాలి. కారకుల ఎదుట పోరాడాలి గానీ వీధుల్లో కాదు. కానీ అక్కడ చేయరు. రాజ్‌ఘాట్ పోతామని, అధ్యక్షుడి దగ్గరకు పోతామని అంటున్నారు. ఇదంతా 10 జన్‌పథ్ నుంచి ఆడిస్తున్న నాటకం. అందులో వీరంతా పాత్రధారులు. కేంద్ర కేబినెట్‌లో బిల్లు పాస్ చేసి ప్రధాని పంపితే ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తారు. ఢిల్లీకి, రాష్ట్రపతి దగ్గరకు వచ్చి పాదయాత్ర చేస్తానంటాడు. సోనియా అధ్యక్షతన సీడబ్ల్యుసీ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని పీసీసీ అధ్యక్షుడు తిరస్కరిస్తారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ డ్రామాలు కట్టిపెట్టి ఆమోదయోగ్య పరిష్కారం చూడాలి’’ అన్నారు.
‘ఒంటరి’ భేటీల బాబు
‘ఢిల్లీకి వచ్చిన పని ఒకటి.. చేస్తున్న పని మరొకటి’ - చంద్రబాబు తీరుపై టీడీపీ నేతల్లోనే వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది! సోమవారం ఢిల్లీలో బాబు ఎవరిని కలసినా వ్యక్తిగతంగా మాత్రమే మాట్లాడటం, తమెవరినీ అనుమతించకపోవడం పట్ల వారిలో విస్మయం వ్యక్తమవుతోంది. పైగా అందరినీ కలుస్తున్నా విభజనకు టీడీపీ అనుకూలమా, వ్యతిరేకమా అన్నది మాత్రం సూటిగా చెప్పడం లేదంటూ నిట్టూరుస్తున్నారు.
నిజానికి రాబోయే ఎన్నికలు, పొత్తుల వ్యవహారాలకే బాబు ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆయన వ్యవహార శైలిని బట్టి అర్థమవుతోందని ఆయనతో పాటు ఢిల్లీ వచ్చిన టీడీపీ నేత ఒకరన్నారు. రాష్ట్రపతితో ఎప్పుడూ పార్టీ నేతలతో పాటుగా భేటీ అయ్యే బాబు, సోమవారం మాత్రం ఒక్కర్నీ వెంట తీసుకెళ్లలేదు! సుమారు 40 నిమిషాల పాటు ప్రణబ్‌తో ఏకాంతంగా భేటీ అయ్యారు. అంతకు ముందు బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌తో భేటీ సందర్భంగా తొలుత యనమల రామకృష్ణుడు, ఎంపీలు ఎన్.శివప్రసాద్, రమేశ్ రాథోడ్ బాబు వెంట ఉన్నారు. కానీ కొద్ది నిమిషాలకే వారిని పక్కకు పంపి, రాజ్‌నాథ్‌తో ముప్పావు గంట పాటు బాబు ఏకాంతంగా మంతనాలు జరిపారు. ఆ సమయంలో పార్టీ నేతలను దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. తరవాత శరద్‌యాదవ్, అజిత్‌సింగ్‌లతో భేటీ సందర్భంగా కూడా ఇదే పునరావృతమైంది. ‘‘అన్ని భేటీల్లోనూ లోపలికి బాబుతో కలసి వెళ్తాం. బయటికి కూడా ఆయనతో కలిసే వచ్చాం. అంతే తప్ప లోపల ఏ జాతీయ నేతతో బాబు ఏం మాట్లాడారో మాకైతే తెలియదు’’ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడొకరు వాపోయారు. మంగళవారం బీజేపీ అగ్ర నేత అద్వానీని కూడా ఏకాంతంగానే కలవాలని బాబు నిర్ణయించారు! అధినేత వైఖరి అర్థం కాక అయోమయపడుతున్న సీమాంధ్ర టీడీపీ నేతలు మంగళ లేదా బుధవారాల్లో రాష్ట్రపతిని విడిగా కలవాలన్న నిర్ణయానికి వచ్చారు.