సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును తిరస్కరిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం ప్రాతిపదికగా పార్లమెంట్‌లో ఆ బిల్లును ప్రవేశపెట్టొద్దని కోరుతూ ఢిల్లీలో రెండు గంటలు మౌన దీక్ష చేయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. రాష్ట్రపతిని కలిసి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరాలని నిర్ణయించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర నేతలు సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, శైలజానాథ్, పి.బాలరాజు, వట్టి వసంతకుమార్, శత్రుచర్ల విజయరామరాజు, గంటా శ్రీనివాసరావు, పార్థసారథి, ఎంపీ జి.హర్షకుమార్ తదితరులు హాజరయ్యారు. రెండు గంటలపాటు సమావేశం జరిగింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. 4 లేదా 5 తేదీల్లో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరినట్లు సీఎం నేతలకు చెప్పారు. 3వ తేదీ మధ్యాహ్నానికి అందరూ ఢిల్లీ చేరుకోవాలని సూచించారు. విభజన బిల్లును తిరస్కరిస్తూ శాసన సభలో తీర్మానాన్ని ఆమోదించిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టొద్దని కోరుతూ లేఖ ఇస్తామని చెప్పారు. సమైక్యవాదాన్ని వినిపిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్‌తోపాటు టీడీపీ ఎమ్మెల్యేలను కూడా రాష్ట్రపతి వద్దకు తీసుకెళితే బాగుంటుందని కొందరు మంత్రులు ప్రతిపాదించారు. విపక్ష ఎమ్మెల్యేలు కూడా వస్తే రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇచ్చిన రోజు తొలుత మహాత్మాగాంధీ సమాధి వద్ద 2 గంటలు మౌన దీక్ష చేయాలని నిర్ణయించారు. ఇతర పార్టీల నాయకులు రాకపోతే ఇందిరాగాంధీ సమాధి వద్ద మౌనం పాటించాలని తీర్మానించారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే దానిపైనా మల్లగుల్లాలు పడ్డారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుందామని సీఎం పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ముగ్గురినీ గెలిపించుకునే సంఖ్యా బలం ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పారు. రెబల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డికి మద్దతుపై ఒకరిద్దరు సభ్యులు ప్రస్తావించినప్పటికీ, సీఎం సమాధానం దాటవేసినట్లు తెలిసింది. ఈ నెల 7న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నందున, ఒక రోజు ముందే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని కొందరు నేతలు సూచించారు. ఢిల్లీ నుంచి వచ్చిన తరువాత శాసన సభ సమావేశాల తేదీపై నిర్ణయం తీసుకుందామని సీఎం తెలిపారు.
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దాఖలు చేసే పిటిషన్లపై తమకు నోటీసులు జారీ చేయాలని, సదరు పిటిషనర్ల అభ్యంతరాలపై తమ వాదన విన్న తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేత సుంకరి జనార్దన్ గౌడ్ శనివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేవియట్‌ను దాఖలు చేశారు.
ఢిల్లీలో 2 గంటలు మౌన దీక్ష
Published Sun, Feb 2 2014 1:59 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement